గుర్గావ్‌లో కర్ణిసేన రాళ్లదాడి చేసిన స్కూల్ బస్సు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా గురువారం నాడు విడుదలైన వివాదాస్పద బాలివుడ్ సినిమా ‘పద్మావత్’కు వ్యతిరేకంగా దేశంలోని ఆరేడు బీజీపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో బుధవారం కర్ణిసేన ఆందోళనలు విధ్వంసానికి దారితీయడం పట్ల దేశీయ మీడియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మీడియా దిగ్భ్రాంతి వ్యక్తం చే సింది. ప్రపంచ మీడియా కూడా ఎక్కువగా అల్లర్లకే ప్రాధాన్యతనిస్తూ వార్తలను ప్రచురించింది. ముఖ్యంగా గుర్గావ్‌లో చిన్న పిల్లల స్కూల్ బస్సుపై కర్ణిసేన రాళ్ల దాడులకు దిగడం, ప్రాణభీతితో బస్సులోని బడి పిల్లలు సీట్ల కింద దాక్కున్న వీడియో దృశ్యాలను ప్రపంచ మీడియా ఎక్కువగా ప్రసారం చేసింది.
‘పౌరానిక హిందూ రాణి’కి సంబంధించిన ఇతివృత్తంతో తీసిన సినిమా పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్‌లో కర్నిసేన కార్యకర్తలు విధ్వంసానకి దిగిన దృశ్యాలకు ‘పాకిస్థాన్ టుడే’ ప్రాముఖ్యతనిచ్చింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా అహ్మదాబాద్‌లో దాదాపు 200 బస్సులను దగ్ధం చేసిన సంఘటనలకు బంగ్లాదేశ్‌లోని ‘ది ఇండిపెండెంట్’, ‘ప్రోథమ్ హాలో’ పత్రికలు ప్రాధాన్యమిచ్చాయి. పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న ‘ది డాన్’ పత్రిక మాత్రం అల్లర్లకు అంత ప్రాధాన్యత ఇవ్వకుండా వివిధ క్రిటిక్స్ రాసిన సినిమా రివ్యూలకు ప్రాధాన్యం ఇచ్చింది.
శ్రీలంక నుంచి వెలువడుతున్న ‘ది మిర్రర్’ పత్రిక మాత్రం స్థానిక పాఠకులను ఆకట్టుకునే వార్తా కథనాన్ని ప్రచురించింది. రాణి పద్మావతిని సింహళ (శ్రీలంక) రాజ కుమారిగా చూపించారనే వార్త తెలిసి ఆ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా! అని శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘే ఎదురు చూస్తున్నారని ఆ పత్రిక తన సంపాదకత్వంలోనే పేర్కొంది. ఈ సినిమా పట్ల నరేంద్ర మోదీ కూడా అంతే ఉద్విఘ్నతతో ఉన్నారని, ఆయన ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో కలిసి అహ్మదాబాద్‌లో ఓ సాంస్కతిక కార్యక్రమాన్ని వీక్షించినప్పుడు అక్కడ విద్యార్థులు పద్మావతి సినిమాలోని గూమర్ పాటకు నృత్య ప్రదర్శన ఇచ్చారని, ఆ సందర్భంగా ఆ పాట మోదీకి ఎంతో నచ్చిందని కూడా ఆ పత్రిక తన సంపాదకత్వంలో పేర్కొంది. మోదీ గూమర్ పాటకు ఇచ్చిన ప్రదర్శనను వీక్షించడం వివాదాస్పదం కూడా అయింది. అయితే ఆయనకు ఆ పాట నచ్చిందో, లేదో తెలియదు. పద్మావతి వివాదంపై ఆరేడు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగుతున్నా నోరు విప్పని మోదీ ఓ పాట గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని భావించలేం.
భారీ పెట్టుబడులతో అద్భుత సెట్టింగ్లతో కళాత్మకంగా తీసిన ‘పద్మావత్’ సినిమా ఎందుకు వివాదాస్పదం అయిందో, ఆ సినిమాను రాజ్‌పుత్‌లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమగ్రంగా వివరిస్తూ అమెరికా నుంచి వెలువడుతున్న ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ మాటలను ఖాతరు చేయకుండా గురువారం నాడు సినిమాను విడుదల చేస్తే ‘ఆత్మార్మణం’ చేసుకుంటామని రెండువేల మంది కర్ణిసేన మహిళలు హెచ్చరించడాన్ని కూడా ఆ పత్రిక ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటనలు తమ దృష్టికి రాలేదని, పరిస్థితి అదుపులోనే ఉందని రాజస్థాన్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment