
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు హోరెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కర్ణిసేనతోపాటు ఈ సినిమాను విడుదల చేయని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పద్మావత్ సినిమా విడుదలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కర్ణిసేన తీవ్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ‘పద్మావత్’ సినిమా విడుదల నిలిచిపోయింది. మరోవైపు పలు రాష్ట్రాల్లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్నిచోట్ల ఆందోళనకారులు దుకాణాలపై దాడులకు దిగి విధ్వంసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఈ రాష్ట్రాలు విఫలమయ్యాయని, కాబట్టి ఆ నాలుగు రాష్ట్రాలపై, కర్ణిసేనపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని పిటిషనర్ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. కేసు తీవ్రతనుబట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.