ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘రాణి పద్మిని’ పేరుతో ప్రారంభించిన చిత్రం ‘పద్మావతి’గా, ఆ తర్వాత ‘పద్మావత్’గా మారడమే కాదు... సెన్సార్ బోర్డు కత్తిరింపులనూ, ఆ సినిమాపై కత్తులు నూరిన కర్ణిసేన ‘మనో భావాలను’ గుర్తించి మసులుకున్నా దానికి కష్టాలు తప్పలేదు. 68వ గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు గురువారం అది దేశవ్యాప్తంగా విడుదల కాబో తుండగా అన్ని రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో అల్లరి మూకలు వీధుల్లో వీరంగం వేస్తున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. థియేటర్లు, షాపింగ్ మాల్స్, బస్సులు, కార్లు, మోటారు సైకిళ్లు, ఇతర ఆస్తులు తగలబడుతున్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో పసివాళ్లతో వెళ్తున్న పాఠశాల బస్సును కూడా వదలకుండా రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. అందులోని పిల్లలనూ, టీచర్లునూ భీతావహుల్ని చేశారు.
మరో పాఠశాల బస్సును దహనం చేశారు. సెన్సార్ బోర్డు అనుమతి లభించిన ‘పద్మావత్’ను అడ్డుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, దానికి అన్నివిధాలా భద్రత కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పాక కూడా ఇదంతా యధేచ్ఛగా సాగుతోంది. వీధుల్లోకి వస్తున్న వేలమందిని నియంత్రించడానికి అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించకుండా ఆ ప్రభుత్వాలన్నీ అటు రాజ్యాంగబద్ధమైన కర్తవ్యాన్ని, ఇటు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ బేఖాతరు చేశాయి. ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులే కర్ణిసేనతో సమానంగా, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గుర్తుంచుకుంటే ఇలాంటి హింసాత్మక ఘటనలు అక్కడే ఎందుకు చోటుచేసుకుంటున్నాయో సులభంగానే అర్ధమవుతుంది. పైగా ఈ గొడవంతకూ బాధ్యత ‘పద్మావత్’ తీసిన సంజయ్ లీలా భన్సాలీదేనని హర్యానా మంత్రి అనిల్ విజ్ ప్రకటించి అందరినీ నివ్వెరపరిచారు.
ఈసారి గణతంత్ర దినోత్సవానికి సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, వియత్నాం, బ్రూనై తదితర ఆగ్నేయాసియా దేశాల(ఆసియాన్) అధినేతలు పదిమంది ముఖ్య అతిథులుగా వస్తున్నారని, వారు దేశంలో అడుగుపెట్టిన రోజున చానెళ్లన్నిటా ఈ హింసే ప్రధాన వార్తయితే దేశం పరువు పోతుందన్న కనీస జ్ఞానం కూడా అక్కడి ప్రభుత్వాలకు కొరవడింది. గురుగ్రామ్ బహుళజాతి సంస్థలకు ప్రసిద్ధి. అక్కడ అనేక భారీ పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, సాఫ్ట్‌వేర్ సంస్థలు పనిచేస్తున్నాయి. వేలకొలది కార్మికులు, ఉద్యో గులు ఆ నగరంలో పనిచేస్తున్నారు. పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకూ అక్కడ వందల సంఖ్యలో విద్యా సంస్థలున్నాయి.
అది దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో భాగం. అలాంటిచోట అల్లరిమూకలు రోడ్లపైకొస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు... కేంద్ర ప్రభుత్వానికి సైతం అప్రదిష్ట. చిత్ర మేమంటే ఇంతచేటు హింస జరిగినా బీజేపీ ప్రతినిధులెవరూ చానెళ్లలో జరిగిన చర్చలకు రాలేదు. ఆ పార్టీ వైఫల్యాలను సొమ్ము చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించే ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మోహం చాటేసింది. ఈమధ్య వ్యంగ్యమైన ట్వీట్లు ఇవ్వడంలో ముందుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం పత్తాలేరు. కులాల పేరిటా, మనోభావాల పేరిటా ఎవరు ఏం చేసినా దేశ ప్రజలకు దిక్కూ మొక్కూ లేదన్నమాట!
మన రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛతో సహా ఎన్నో హక్కుల్ని కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని చెప్పింది. ఏవో కొన్ని గ్రూపులు మతం పేరు చెప్పుకుని, కులం పేరు చెప్పుకుని మనోభావాలు దెబ్బ తిన్నాయని రోడ్డెక్కుతుంటే, సమాజం మొత్తంపై తమ అభిప్రాయాలను బల వంతంగా రుద్దాలని ప్రయత్నిస్తుంటే ప్రభుత్వాలన్నీ చేష్టలుడిగి చూస్తున్నాయి. తమకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వ్యక్తులపై, సంస్థలపై విరుచుకుపడే ఈ ప్రభుత్వాలు ఇలాంటి గ్రూపుల ముందు సాగిలపడుతున్నాయి. వాటికి వ్యతిరేకిస్తే తమ ఓటు బ్యాంకు దెబ్బతింటుందన్న భయంతో వణుకుతున్నాయి. ఆ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనైనా ధిక్కరించడానికి సాహసిస్తు న్నాయి.
అది చలనచిత్రం కావొచ్చు... ఒక పుస్తకం కావొచ్చు... మరో కళాత్మక చిత్రం కావొచ్చు–దేన్నయినా నచ్చలేదని, విభేదిస్తున్నానని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. మన రాజ్యాంగం సైతం హక్కులకు కొన్ని పరిమితులను కూడా విధించింది. కానీ ఆ పరిమితుల పేరిట భావప్రకటన హక్కునే కాలరాయాలని చూడటం ప్రభు త్వాలకైనా, ప్రైవేటు గ్రూపులకైనా తగని పని. కేజ్రీవాల్‌పై ‘యాన్ ఇన్‌సిగ్నిఫికెంట్ మాన్’ పేరిట నిర్మించిన డాక్యుమెంటరీలో తనకు సంబంధించి పెట్టిన పాత్రను వక్రీకరించారని, అది న్యాయస్థానంలో తనపై ఉన్న కేసును ప్రభావితం చేసేలా ఉన్నదని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై మొన్న నవంబర్‌లో తీర్పునిస్తూ సృజనాత్మకతకు సంకెళ్లు విధించే ధోరణులను అనుమతించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. మనోభావాలు దెబ్బతిన్నాయన్న పేరిట సృజనాత్మక వ్యక్తీకరణలను శిలువ ఎక్కించడం తగదన్నది.
ఆ తీర్పు వెలువడి మూడు నెలలైనా కాలేదు... ప్రభుత్వాలన్నీ ‘పద్మావత్’పై పగబట్టినట్టు వ్యవహరించాయి. ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చి దాదాపు 25 రోజులవుతోంది. ఆ సినిమా చూడనే చూడం... మేం వద్దన్నాం గనుక విడుదలను ఆపాల్సిందేనని ఆగ్రహించే కర్ణిసేన సంగతలా ఉంచి ప్రభుత్వాల్లో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారో, బీజేపీ ముఖ్యులో దాన్ని వీక్షించి ఏమున్నదో తెలుసుకుంటే, వాటిపై తమకున్న అభ్యంతరాలేమిటో న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తే వేరుగా ఉండేది. నిజానికి చిత్రం చూసినవారు అది రాజపుట్ గౌరవప్రతిష్టలను, పద్మావతి పాత్రను ఉన్నతంగా చూపిందని అంటున్నారు. కనీసం నిజానిజాలేమిటో తెలుసు కోవాలన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించేవారిని అదుపు చేయలేకపోతే చట్టబద్ధ పాలన దెబ్బతింటుందని, అది అంతిమంగా అరాచకానికి దారితీస్తుందని ప్రభు త్వాలు గ్రహించాలి.
Comments
Please login to add a commentAdd a comment