సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద ‘పద్మావత్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకావడంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన విధ్వంసాలకు దిగుతోంది. పలు రాష్ట్రాల్లో సినిమాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు జరుపుతోంది. ముఖ్యంగా రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో తొలిరోజు ‘పద్మావత్’ విడుదల నిలిచిపోయింది. ఈ రాష్ట్రాలు మొదటి నుంచి సినిమా విడుదలను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. రాజ్‌పుత్‌ల ప్రభావం బలంగా ఉండడం, ప్రజల సెంటిమెంట్, కర్ణిసేన హెచ్చరికలు తదితర కారణాల వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనే భావనతో ఇక్కడ మల్టీప్లెక్స్ యజమానుల సంఘం సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించింది.
కర్ణిసేన ఆందోళనలు ఇలా..
- రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో కర్ణిసేన దుకాణాలపై విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడింది.
- రాజస్థాన్ జైపూర్‌లో పద్మావత్‌కు వ్యతిరేకంగా కర్ణిసేన బైక్ ర్యాలీ చేపట్టింది
- బిహార్ ముజఫర్‌పూర్‌లో కర్ణిసేన ఆందోళనకారులు తల్వార్లు ప్రదర్శిస్తూ.. టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు
- తమిళనాడులో పద్మావత్‌కు శ్రీరామసేన ఆందోళన
- గుజరాత్ అహ్మదాబాద్‌లో పద్మావత్ సినిమా థియేటర్ల వద్ద భారీ భద్రత..
- వారణాసిలో పద్మావత్ థియేటర్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేసిన యువకుడు. అడ్డుకున్న పోలీసులు
దక్షిణాది రాష్ట్రాల్లో సాఫీగా..
దక్షిణాది రాష్ట్రాల్లో పద్మావతి ప్రదర్శన సాఫీగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 400పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు థియేటర్ల వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటుచేశాయి. బాగుందన్న టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment