సాక్షి, న్యూఢిల్లీ : పద్మావత్ చిత్రం విడుదలైతే థియేటర్లను తగలబెడతామంటూ రాజ్‌పుత్ కర్ణిసేన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందించింది. థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
‘‘దేశంలో స్వేచ్ఛా హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుంది. సినిమాను అడ్డుకుంటామని.. థియేటర్లు ధ్వంసం చేస్తామని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిందే’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒకవేళ చిత్ర యూనిట్ సభ్యులు కోరితే... వారికి కూడా వ్యక్తిగతంగా భద్రత కల్పించాలని న్యాయమూర్తి పోలీసులకు సూచించారు.
కాగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిత్రంపై నిషేధం విధించగా.. నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. చిత్ర విడుదలను అడ్డుకోవద్దంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది తెలిసిందే. బండిట్ క్వీన్ చిత్ర విషయంలోనే అభ్యంతరం వ్యక్తం కానప్పుడు.. పద్మావత్ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ చిత్రం విడుదలైతే రాజ్‌పుత్ మహిళలంతా సాముహిక ఆత్మహత్యలకు పాల్పడతారని కర్ణిసేన హెచ్చరిస్తోంది.
అనధికార నిషేధం...?
కర్ణిసేన హెచ్చరికల నేపథ్యంలో... సుప్రీం కోర్టు ఆదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అనధికారిక బ్యాన్ విధించే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కోర్టు ఆదేశాల సంగతి పక్కన పెట్టి.. స్థానిక చట్టాల చొరవతో రాష్ట్రాలు నిషేధాన్ని కొనసాగించాల్సిందేనని కర్ణిసేన అధినేత లోకేంద్ర సింగ్ కల్వి కోరుతున్నారు. గతంలో రాజస్థాన్ లో జోధా అక్బర్ చిత్రాన్ని థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు స్వచ్ఛందంగా బహిష్కరించిన విషయాన్ని, మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫనా చిత్రాన్ని గుజరాత్‌లో నిషేధించిన(అనధికారికంగా) విషయాన్ని లోకేంద్ర గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment