![step back on Protest Karni Sena Praise Padmaavat - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/3/Karni-Sena-Praise-Padmaavat.jpg.webp?itok=BYqCugVO)
పద్మావత్‌లో దీపిక.. కర్ణి సేన కార్యకర్తలు(పక్క చిత్రంలో)
సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రంపై శ్రీరాజ్‌పుత్ కర్ణి సేన ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ఈ చిత్రంపై ఆందోళనలను విరమించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పద్మావత్ అమోఘం అంటూ విపరీతమైన పొగడ్తలు గుప్పించింది.
శుక్రవారం ముంబైలో పలువురు కర్ణిసేన నేతలు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం కర్ణిసేన ముంబై చీఫ్ యోగంద్ర సింగ్ కటార్ మీడియాతో మాట్లాడారు. ‘‘చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు’’ అంటూ కటార్ తెలియజేశారు. ఇక కర్ణిసేన జాతీయాధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామడి ఆదేశాలను అనుసరించి కర్ణిసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.
‘‘సినిమాలో రాణి పద్మినీ, ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు కూడా లేవు. రాజ్‌పుత్‌ల మనోభావాలు చిత్రం దెబ్బతీయలేదు. పైగా చాలా గొప్పగా చూపించారు. అందుకే ఆందోళనలు విరమిస్తున్నాం. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతోపాటు మిగతా చోట్ల కూడా చిత్రం ఆడేందుకు దోహదం చేస్తాం’’ అని పేర్కొంది.
కాగా, చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించింది. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు సినిమాలో అలాంటి అంశాలేవీ లేవని నిర్ధారణ కావటంతో యూటర్న్ తీసుకుని మద్ధతు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment