సాక్షి, ముంబై: సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రక సినిమా ‘పద్మావత్’.. రాణి పద్మావతి జీవితకథ ఆధారంగా తెరకెక్కినట్టు భావిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా.. మరో రెండురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్నది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. అందుకు కారణం అడుగడుగునా కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌లు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటమే. ఇప్పటికే పలుచోట్ల ఈ సినిమాను ప్రదర్శిస్తారని భావించిన థియేటర్లపై కర్ణిసేన దాడులకు దిగుతోంది.
ఈ వివాదాల నడుమ వచ్చే గురువారం ‘పద్మావత్’ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ మంగళవారం ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయంలో వినాయకుడికి ప్రత్యేక పుజలు నిర్వహించారు.
‘పద్మావత్’ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికపై కూడా కర్ణిసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు భన్సాలీతోపాటు దీపిక తల నరికితే నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీపిక కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆలయాన్ని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment