
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ వివాదాస్పద సినిమా ‘పద్మావత్’పై నిషేధం విధిస్తున్న రాష్ట్రాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా హర్యానా కూడా ఈ సినిమా విడుదలపై నిషేధం విధించింది. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్టు హర్యానా మంత్రి అనిల్ విజ్ తెలిపారు. చరిత్రను వక్రీకరించి తెరకెక్కించిన ఈ సినిమాపై నిషేధం విధించాలన్న తన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాణి పద్మావతి పాత్రను దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తప్పుగా చిత్రీకరించారని అంతకుముందు అనిల్ విజ్ ఆరోపించారు. భారతీయ మహిళల గౌరవానికి రాణి పద్మావతి ప్రతీక అని, ఆ పాత్రను ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు.
రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్.. ఇప్పటికే ‘పద్మావత్’ పై నిషేధం విధించాయి. సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ చిత్రం విడుదల కాకుండా నిషేధం పెట్టడం గమనార్హం. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ‘పద్మావత్’కు వ్యతిరేకంగా రేపటి నుంచి ఆందోళనలకు దిగుతామని రాజస్థాన్‌లోని కర్ణిసేన ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment