న్యూఢిల్లీ: ‘పద్మావత్’ సినిమా నిర్మాతల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేను చంపేస్తామని రాజ్‌పుత్ కర్నిసేన బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావత్’ సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాము కర్ణిసేన ప్రతినిధులమని, ‘పద్మావత్’ సినిమాకు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు తప్పవని సాల్వేను కొందరు ఫోన్ చేసి బెదిరించినట్టు సమాచారం. ‘ కర్ణిసేన నా కార్యాలయానికి ఫోన్ చేసి బెదరించింది. దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని సవాల్ విసిరింది’ అని సాల్వే మీడియాతో తెలిపారు. సాల్వేను చంపేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడంతో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
వివాదాస్పదంగా మారిన ‘పద్మావత్’ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నప్పటికీ.. కర్ణిసేన మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు ఏమాత్రం ఆపడం లేదు. సినిమా విడుదలైతే.. థియేటర్లు తగలబెడతామని, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. ‘పద్మావత్’కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కర్ణిసేన తగ్గకపోవడంతో ఈ సినిమా విడుదల ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment