యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు | Fears of a Global Oil Shock if the Mideast Crisis Intensifies | Sakshi
Sakshi News home page

యుద్ధ భయాలు.. ఊరించే స్టాక్‌లు

Published Tue, Oct 8 2024 5:36 AM | Last Updated on Tue, Oct 8 2024 7:57 AM

Fears of a Global Oil Shock if the Mideast Crisis Intensifies

యుద్ధాల్లో మార్కెట్‌ క్రాష్‌లపై ఆందోళన వద్దు 

ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇదొక సదవకాశం

తక్కువ ధరల్లో దొరికే క్వాలిటీ స్టాక్స్‌ను ఎంచుకోవాలి 

గతంలో యుద్ధ ప్రభావం తర్వాత వేగంగా కోలుకున్న మార్కెట్‌ 

ప్రస్తుత పతనంపై నిపుణుల అభిప్రాయం

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన ఆరి్థక వ్యవస్థలకు... చినికి చినికి ‘మిసైళ్ల’వానగా మారిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య పోరు లెబనాన్‌కు పాకడం.. తాజాగా ఇరాన్‌ కూడా రణరంగంలోకి దూకి ఇజ్రాయెల్‌పై మిసైళ్ల వర్షం కురిపించడంతో ఈ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

ఇది ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తోంది. క్రూడ్‌ ధరలు భగ్గుమనడం (10% పైగా జంప్‌) మనలాంటి వర్ధమాన దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ పరిణామాలతో సెన్సెక్స్‌ 4,422 పాయింట్లు, నిఫ్టీ 1,383 పాయింట్లు, అంటే 5.3% చొప్పున పతనమయ్యాయి. గడిచిన రెండేళ్లలో వారం రోజుల్లో మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. అయితే, ఈ పతనాలను చూసి రిటైల్‌ ఇన్వెస్టర్లు మరీ అందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్‌ నిపుణులు. గత యుద్ధాల సమయంలో పడిపోయిన మార్కెట్లు చాలా త్వరగా కోలుకున్నాయని, అందుకే ఈ క్రాష్‌ను సదవకాశంగా మలచుకోవాలనేది విశ్లేషకుల మాట!! 

నాన్‌స్టాప్‌గా దౌడు తీస్తున్న బుల్‌కు పశి్చమాసియా యుద్ధ ప్రకంపనలు బ్రేకులేశాయి. రోజుకో కొత్త ఆల్‌టైమ్‌ రికార్డులతో చెలరేగిన దేశీ స్టాక్‌ మార్కెట్లో ఎట్టకేలకు కరెక్షన్‌ మొదలైంది. సూచీలు 5 శాతం పైగా క్షీణించగా.. ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.26 లక్షల కోట్లు ఆవిరైంది. టాప్‌–10 కంపెనీల మార్కెట్‌ విలువ సుమారు రూ.7 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటిదాకా మార్కెట్‌ను పరుగులు పెట్టించిన విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో రివర్స్‌గేర్‌ వేశారు. 

మరోపక్క, చైనా ఉద్దీపక ప్యాకేజీ ప్రభావంతో మన మార్కెట్‌ నుంచి వైదొలగి అక్కడికి క్యూ కడుతున్నారు. గత 4 ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాల లక్ష్యంతో ఇన్వెస్ట్‌ చేసే మదుపరులకు ఇది మంచి చాన్సని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. చారిత్రకంగా చూస్తే, ఇలాంటి ఉద్రిక్తతలు, యుద్ధాల సమయంలో మార్కెట్లు స్వల్పకాలానికి భారీగా పడటం లేదంటే దిద్దుబాటుకు లోనైనప్పటికీ... మళ్లీ కొద్ది వారాలు, నెలల్లోనే పుంజుకున్నాయని, భారీగా లాభాలను  పంచాయని గణాంకాలతో సహా వారు ఉటంకిస్తున్నారు.

క్వాలిటీ స్టాక్స్‌.. మంచి చాయిస్‌! 
స్వల్పకాలిక తీవ్ర ఒడిదుడుకుల ఆధారంగా ఇన్వెస్టర్లు హఠాత్తుగా నిర్ణయాలు  తీసుకోకూడదని.. గతంలో మంచి పనితీరు కనబరిచి తక్కువ ధరల్లో (వేల్యుయేషన్లు) దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఎంచుకోవడం ద్వారా లాంగ్‌ టర్మ్‌ పెట్టుబడులకు పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే, మంచి డివిడెండ్‌ రాబడులను అందించే స్టాక్స్‌ కూడా ఈ పతనంలో కొనుగోలుకు మరింత ఆకర్షణీయమైన ఆప్షన్‌ అనేది వారి అభిప్రాయం.

  ఊరించే వేల్యుయేషన్లు... 
‘పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను నిరి్మంచుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి’ అని రైట్‌ రీసెర్చ్‌ ఫౌండర్‌ సోనమ్‌ శ్రీవాస్తవ చెప్పారు. భారీ పీఈ (ప్రైస్‌ టు ఎరి్నంగ్స్‌) నిష్పత్తితో కూడిన అధిక వేల్యుయేషన్‌ స్టాక్స్‌.. ఈ కరెక్షన్‌లో మరింతగా దిగొచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో చేతిలో క్యాష్‌ పుష్కలంగా ఉన్న మదుపరులు... తక్కువ ధరల్లో ఇలాంటి ఊరించే షేర్లను కొనుగోలు చేయడం బెటర్‌ అంటున్నారు మార్కెట్‌ పరిశీలకులు.

‘మార్కెట్లో ఈ కుదుపులు సద్దుమణిగి, పరుగులంకించుకున్నప్పుడు కొత్త పెట్టుబడులు భారీ లాభాలను అందించే అవకాశం ఉంటుంది’ అని వీఎస్‌ఆర్‌కే క్యాపిటల్‌ డైరెక్టర్‌ స్వాప్నిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇటీవలి బుల్‌ రన్‌కు మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లు దన్నుగా నిలిచాయి, తాజా కరెక్షన్లో ఇవే భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీర్ఘకాలిక దృష్టితో లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ను ఎంచుకోవడం తెలివైన ఆప్షన్‌ అనేది నిపుణుల సలహా!

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. తమ లాంగ్‌ పొజిషన్లను తగ్గించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మరో 5 శాతం క్షీణించే అవకాశం ఉంది. 
– రాజేశ్‌ పలి్వయా, వైస్‌ ప్రెసిడెంట్, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement