కాశ్మీర్ లో సిరియా ఉగ్రవాద జెండాలు?
ఇరాక్, సిరియాల్లో విధ్వంసం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ ఐ ఎస్) ఉగ్రవాదులు భారతదేశంపై కన్నేశారా? కాశ్మీర్ లో ఐఎస్ ఐఎస్ పతాకాలను ప్రదర్శిస్తూ కొందరు ముసుగులు వేసుకున్న యువకులు ప్రదర్శనలు చేయడంతో ఒక్కసారి భారత గూఢచారి వర్గాలు ఉలిక్కిపడ్డాయి.
అటు అల్ కాయిదా, ఇటు ఐఎస్ ఐఎస్ లు రెండూ కాశ్మీర్ లో కార్యకలాపాలు కొనసాగించడం లేదన్నదే ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. కాశ్మీర్ లో లష్కర్, జైషె మొహమ్మద్, అల్ బాదర్, హిజ్బుల్ ముజాహిదీన్ లాంటి పాక్ సమర్థిత ఉగ్రవాదుల కార్యకలాపాలు జోరుగా నడుస్తున్నాయి. కానీ అల్ కాయిదా, ఐఎస్ ఐఎస్ లు పనిచేయడం లేదని ఇంటలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
కానీ జూన్ నెలలో అల్ కాయిదా ఒక విడియోను జారీచేసి కాశ్మీరు పోరాటాన్ని కొనసాగించాలని ముస్లింలకు పిలుపునివ్వడం, ఆ తరువాత కొద్ది రోజులకే ఐఎస్ ఐఎస్ జెండాలతో ప్రదర్శన జరగడం గూఢచారి వర్గాన్ని కలవర పరుస్తోంది.
ఇప్పటికే భారత్ కుచెందిన 18 మంది సున్నీ యువకులు ఇరాక్ చేరుకుని ఐఎస్ ఐఎస్ సేనలతో కలిసి పోరాడుతున్నారు. వీరిలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కావడంతో ఐఎస్ ఐఎస్ వీరిని వెబ్ సైట్ మేనేజ్ మెంట్ కి ఉపయోగించుకుంటున్నారు. ఇంకో వైపు ఐఎస్ ఐఎస్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు దాదాపు 7000 మంది షియాలు ఇరాక్ రాయబార కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత ఇంటలిజెన్స్ ఏజెన్సీలు నిఘాను పెంచాయి. గల్ఫ్ దేశాల్లోజరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి.