
సాక్షి, నూజివీడు: కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏలూరు జిల్లా నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారంటూ అ పెట్టిన అక్రమ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం వంశీ పిటిషన్ దాఖలు చేయగా.. నాలుగు రోజుల క్రితం వాదనలు ముగిశాయి. మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఈరోజు వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వల్లభనేని వంశీపై అనేక కేసులు బనాయించారు. ఈ క్రమంలోనే వంద రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కాగా, తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్ మంజూరైంది. మొత్తం అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించడంతో నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ జైలు నుంచి విడులవుతున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకునే అవకాశం ఉంది.
