కొండంత అండ
ఎంపీ: తమ్ముడూ నీ పేరేంటి? హాస్టల్లో భోజనం ఎలా ఉంటుంది?
విద్యార్థి: నాపేరు వెంకటేశ్ సార్. తొమ్మిదో తరగతి చదువుతున్నా. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు. ఈ హాస్టల్లో అన్నీ సమస్యలే సార్.
ఎంపీ: బాబూ.. నువ్వేం చదువుతున్నావ్..?
విద్యార్థి: నా పేరు సందీప్ సార్, 8వ తరగతి చదువున్నా.
ఎంపీ: ఈ హాస్టల్లో బాత్రూంలు, మరుగుదొడ్లు ఉన్నాయా?
సందీప్ : పేరుకు చాలానే ఉన్నాయ్ సార్.. కానీ ఏ ఒక్కటీ పనిచేయడం లేదు.
ఎంపీ: అందేంటీ? ఉన్నాయంటున్నావ్.. ఎందుకు పనిచేయడం లేదు?
సందీప్ : అప్పుడెప్పుడో నిర్మించిన ఈ మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు సార్.. ఉపయోగించక పూర్తిగా పాడైనయ్. చెత్తా చెదారంతో నిండిపోయినయ్.
ఎంపీ: మీరంతా ఎక్కడ స్నానాలు చేస్తున్నారు? కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు?
సందీప్: స్నానాలు ఆరుబయట ఉన్న నల్లా కింద చేస్తున్నం. మరుగుదొడ్లు లేకపోవడంతో బయటకి వెళ్తున్నాం. రాత్రివేళలో చాలా ఇబ్బందిగా ఉంది సార్..
ఎంపీ: మీరంతా ఆటలు ఆడుకునేందుకు స్థలం ఉందా?
మహిపాల్: వసతి గృహంలో ఎలాంటి ఆటవస్తువులు లేవండి. ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు.
ఎంపీ: మరి మీరంతా ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు?
మహిపాల్: స్కూల్ నుంచి వచ్చినంక చదువుకునేటోళ్లు చదువుకుం టరు. మిగతా వాళ్లు ఖాళీగానే ఉంటరు.
ఎంపీ: వసతి గృహానికి ట్యూటర్ (టీచర్) వస్తున్నాడా? అన్ని సబ్జెక్టులకు ఉన్నారా?
బాలునాయక్: ప్రస్తుతం ట్యూటర్ రావడంలేదు సార్.. మొదట్లో కొన్ని రోజులు వచ్చారు.. మళ్లీ రావడంలేదు.
ఎంపీ: హాస్టల్లో రాత్రి వేళ కరెంట్ ఉంటుందా? ఏమైనా ఇబ్బందులున్నాయి?
శ్రీకాంత్ : రాత్రివేళలో కరెంట్ ఉంటుంది. కానీ హాస్టల్లో వైరింగ్, లైట్లు, ప్యాన్లు సరిపడా లేవు. రాత్రిపూట కరెంట్ పోతే మాకు భయం వేస్తోంది.
ఎంపీ : ఎందుకు భయం వేస్తుంది. అందరూ కలిసే ఉంటారు కదా?
శ్రీకాంత్: మా హాస్టల్ గ్రామానికి దూరంగా గట్టుపై ఉండడంతో చుట్టూ ఎవరూ ఉండరు. దీనికి తోడు రాత్రి వేళ బాత్రూంకు పోవాలంటే బయటకు వెళ్లాలి.. అందుకే భయం.
ఎంపీ: ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
విష్ణు: హాస్టల్‌కు ప్రహరీ లేకపోవడంతో పాములు వస్తున్నాయ్ సార్..
ఎంపీ : పాములు వస్తున్నాయా..? ఎప్పుడైనా లోపలికొచ్చాయా?
విష్ణు: ఓ సారి గదిలోకి వచ్చింది. అందరం బయపడిపోయి బయటకు పరుగు తీశాం. వాచ్‌మన్ వచ్చి చూసి పాము పోయిందని చెప్పిన తర్వాత లోపలికొచ్చాం.
ఎంపీ: హాస్టల్ గదులను శుభ్రం చేసేవాళ్లు వస్తున్నారా? రోజూ శుభ్రం చేస్తారా?
మహేందర్: మా గదులను మేమే శుభ్రం చేసుకుంటాం సార్.. ఎవరూ రారు.
ఎంపీ: హాస్టల్లో ఏమైనా సమస్యలుంటే ఎవరికి చెబుతారు?
శ్రీనివాస్: వార్డెన్‌కు చెబుతాం.
ఎంపీ: వర్షం వస్తే గదులు కురుస్తాయా?
గోవింద్: అవును సార్.. గదుల పరిస్థితి బాగాలేదు. వర్షం వస్తే కురుస్తాయి. డోర్స్ కూడా బాగాలేవు. చలి కాలం..
ఇబ్బంది పడుతున్నాం.
ఎంపీ: నీటి సమస్య ఉందా? నీళ్లు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి?
రజినీకాంత్: హాస్టల్‌కు ప్రత్యేకంగా బోరు లేదు సార్.. గ్రామ పంచాయతీకి సరఫరాచేసే పైపు నుంచే నీళ్లు వస్తాయి.
ఎంపీ: నీటి నిల్వకు ట్యాంకులున్నాయా?
రజనీకాంత్: లోపల ట్యాంకులు ఉన్నా.. అవి నిరుపయోగంగా ఉన్నాయి. ఆరు బయట వస్తున్న నల్లా నీటితోనే స్నానం చేస్తాం.
ఎంపీ: ఇంకా ఇతర సమస్యలు చెప్పండి?
సునీల్ : హాస్టల్ లోపల ఫ్లోరింగ్ లేదు సార్.. దుమ్ములోనే కూర్చుని భోజనం చేస్తున్నాం..
వెంకటేశ్: మా హాస్టల్లో అనేక సమస్యలున్నాయ్ సార్.. మీరే వాటిని పరిష్కరించాలి.
ఎంపీ: తప్పకుండా పరిష్కరిస్తా.. మీరంతా ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారా?
వినయ్‌చారి: కొందరం ప్రభుత్వ పాఠశాలలో, మరి కొందరు మోడల్ స్కూల్లో చదువుకుంటున్నం.
ఎంపీ: హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా? లేరా?
కార్తిక్:మా వార్డెన్ మ్యాట్రిన్ లావణ్యగారు.. రోజూ వస్తారు.
ఎంపీ : బాగా చదువుతున్నారా? గత ఏడాది మార్కులెలా వచ్చాయ్?
సరేందర్: అందరికీ గత ఏడాది మంచి మార్కులే వచ్చాయ్సార్..
ఎంపీ: ఈ ఏడాది టెన్త్‌లో అందరూ పాసవుతారా?
అర్జున్: అందరం తప్పకుండా పాసవుతాం సార్.
ఎంపీ: వెరీ గుడ్. బాగా చదువుకొని హాస్టల్లో ఉన్న వారంతా ఫస్టు గ్రేడ్‌లో పాసవ్వాలి.