No salary
-
సారూ..జీతాలెప్పుడు?
-
జీతాల్లేవ్.. మూణ్నెళ్లు ఇంటి దగ్గరే ఉండండి
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు ఫర్లాఫ్ చేయాలని నిర్ణయించింది. అంటే మూడు నెలలపాటు పని లేదని, జీతాలు ఇవ్వలేమని, ఉద్యోగులు విధుల్లోకి రావద్దని ప్రకటించింది.ఆర్థిక ఇబ్బందులు, చట్టపరమైన సమస్యలతో సతమతమవుతున్న స్పైస్‌జెట్ తక్కువ సంఖ్యలో విమానాలతో పనిచేస్తోంది. ప్రస్తుతం కేవలం 22 విమానాలను మాత్రమే నడిపిస్తోంది. సంస్థలోని మొత్తం 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు వేతనం లేకుండా సెలవుపై పంపనున్నట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తాజాగా తెలిపారు. అంతకుముందు రోజు, ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ స్పైస్‌జెట్‌పై నిఘాను మరింత పెంచినట్లు తెలిపింది."స్పైస్‌జెట్ 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు ఫర్లాఫ్లో ఉంచడానికి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లీన్ ట్రావెల్ సీజన్, తగ్గిన విమానాల పరిమాణానికి ప్రతిస్పందనగా, సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది" అని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫర్లాఫ్ కాలంలో, క్యాబిన్ క్రూ సభ్యులు స్పైస్‌జెట్ ఉద్యోగులుగానే కొనసాగుతారని, అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఆర్జిత సెలవులు చెక్కుచెదరకుండా ఉంటాయని చెప్పారు. -
మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజూ బండెడు చాకిరీ.. పురుషులు మాత్రం!
అహ్మదాబాద్ : మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటిపనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్ యూజ్ డేటా : ఏ టూల్ ఫర్ జెండర్డ్ పాలిసీ అనాలిసిస్’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే , మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్ నమ్రత చందార్కర్ తెలిపారు. -
జీతాలివ్వండి మహాప్రభో..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం.. అని ప్రభుత్వం బీరాలు పలికిందే తప్ప కనీసం సమయానికి జీతాలివ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ ఉన్న తరుణంలో తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటో తారీఖు దాటిపోయి పది రోజులవుతున్నా జీతాలు చెల్లించకపోవడంతో సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సోమవారం నిరసన చేపట్టారు. జీతాలు పెంచుతున్నట్లు జనాల్లో అపోహలు సృష్టిస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఇంకా ఒక్క రూపాయి కూడా చేతికి రాకపోవడంతో పండగ ఎట్లా జరుపుకునేదని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పడేట్లు చూడాలని కోరుతున్నారు. (చదవండి: మేం మారం.. మార్చం!) 5న జీతాలివ్వండి సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో లోన్ల విషయంలో చాలా ఇబ్బంది అవుతోంది. పెనాల్టీలు పడుతున్నాయి. కుటుంబాన్ని పోషించుకోలేని దుఃస్థితికి వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా మీద దయ చూపి కనీసం ఐదో తారీఖున జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలి. - పాపన్నగారి దేవయ్య, ఆర్టీసీ కండక్టర్, సిరిసిల్ల డిపో -
బడి తెరిచినా... భృతి లేదు
సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఇచ్ఛాపురం నియోజకవర్గం... ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు విధులు నిర్వహించాలంటే పనిష్మెంట్గా భావిస్తారు. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సైతం స్థానికంగా నివాసం ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు కారణం ఈ ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రంగా ఉండడమే. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ఉన్న బడుల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గ ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ బడుల్లో విద్య పడకేసింది. గతేడాది ఆగస్టు నెలలో అప్పటి జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని స్థానిక విద్యావంతులు కోరారు. దీంతో స్పందించిన ఆయన కిడ్నీ వ్యాధి ప్రభావిత మండలాల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేసి, అందుకు రూ.కోటి 46 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుందని ప్రకటించారు. అనుకున్న విధంగానే ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 400 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేస్తున్నట్టు అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రోస్టర్ విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే(ఎస్జీటీ, భాషా పండితులు) అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే (స్కూల్ అసిస్టెంట్) అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల కు రూ.7 వేలు చొప్పున్న గౌరవ వేతనాలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసి గతేడాది సెప్టెంబర్ మొదటి వారంలో విధుల్లోకి తీసుకున్నారు. ఒక్క నెల కూడా అందని వేతనం తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ సమయంలో తమ భవిష్యత్‌ను లెక్కచేయకుండా ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహించిన వీరికి జిల్లా విద్యాశాఖాధికారి చుక్కలు చూపించింది. సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం పూర్తయిన ఏప్రిల్ 23 వరకు విధులు నిర్వహించారు. విద్యా సంవత్సరం పూర్తయి మరలా బడులు తెరుచుకున్నప్పటికీ వీరికి ఒక్కనెల కూడా వేతనాలు అందకపోవడంతో గమనార్హం. తమకు వేతనాలు అందుతాయో లేదో అన్న సందేహంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కొట్టిమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందించాలని అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు కోరుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు మూత్రపిండాల వ్యాధి ప్రభావిత మండలాల్లో గతేడాది సెప్టెంబర్ నెలలో నియోజకవర్గంలో 400 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నియమించింది. మున్ముందు డీఎస్సీ ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయిన ఏప్రిల్ 23 వరకు విధులు నిర్వహించాం. ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. మా గురించి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. – కె.మీనూ, అకడమిక్ ఇన్స్ట్రక్టర్, కేశుపురం యూపీ స్కూల్, ఇచ్ఛాపురం మండలం వేతనాలు విడుదల చేసి ఆదుకోండి ఉద్దానం ప్రాంతంలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో 400 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను కలెక్టర్ చొరవతో విధుల్లో చేరారు. వీరి రాకతో పాఠశాలలు మరింత బలోపేతమయ్యాయి. ఇప్పటికి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా రాకపోవడం దురదృష్టకరం. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ద్వారా వారికి త్వరగా వేతనాలు అందించాలని కోరుతున్నాము. – బి.శంకరం, ఆపస్ మండల ప్రధాన కార్యదర్శి, ఇచ్ఛాపురం మండలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అధికారులు సైతం స్పందించారు. త్వరలో ప్రతీ అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌కు వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో కలెక్టర్ ఆదేశాలు మేరకు గతంలో పనిచేసిన విద్యా వలంటీర్లను ఈ నెల 12 నుంచి నియమించడం జరిగింది. – కురమాన అప్పారావు, మండల విద్యాశాఖాధికారి, ఇచ్ఛాపురం మండలం -
వేతనాలు లేని కొలువులు
సాక్షి, మార్టూరు(ప్రకాశం): భూ సర్వేకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. నిరుద్యోగులుగా ఉన్న అర్హులైన వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా తీసుకుని మండలాల్లో నియమించడం జరిగింది. వీరికి వేతనాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకుండా సర్వే కోసం అర్జీదారుల చలానా రూపములో చల్లించే 500 రూపాయలను వీరికి చల్లించేలా ప్రకటించి ఆమొత్తాన్ని వీరి ఖాతాల్లో నేరుగా చెల్లిస్తామంటూ వీరి బ్యాంకు ఖాతాల వివరాలను రెండేళ్ల క్రితమే తీసుకున్నట్లు చెప్తున్నారు. కానీ ఇంతవరకు వీరి ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గతంలో సర్వే కోసం అర్జీదారులు చెల్లించాల్సిన చలాన 250 రూపాయలు కాగా వీరికి వేతనానికి బదులు ఇవ్వవలసిన భత్యం కోసం చలానా రుసుమును 500 రూపాయలకు పెంచి రైతులపై భారమైతే వేశారు కానీ వీరికి ఇవ్వకపోవడం విశేషం. సంవత్సరాల తరబడి వీరి పోరాటంలో ఫలితంగా సంబంధిత మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి గత సంవత్సరం మే 9వ తేదీ లైసెన్స్డు సర్వేయర్లను అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమిస్తానని ప్రకటించి విధివిధాలను రూపొందించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమములో అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ప్రకాశం జిల్లాకు 112 మందికి అదనంగా టాస్క్ఫోర్సు విభాగానికి ఐదుగురు కలిపి 117 మంది అవసరమని రాష్ట్రవ్యాప్తంగా 1405 మందిని అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమించాల్సిసిన అవసరం ఉందని నివేదికను రూపొందించారు. కనీసవేతనంగా 21,534 రూపాయలుగా రూపొందించిన నివేదికను చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతనెల 6వ తేదీ పంపిన యూనియన్ నాయకులు చెప్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు పద్ధతిన లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి కనీస వేతనంగా రూ. 18 వేలు ఇస్తున్నట్లు వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న తమకు ఎన్నికల తరణంలోనైనా వేతనాలు ప్రకటిస్తే జీఓ విడుదల చేయాలని వీరు కోరుతున్నారు. సంవత్సరాల తరబడి వేతనాలు లేవు సంవత్సరాల తరబడి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. పనిభారం చాలా ఎక్కువగా ఉన్నా.. విధులు నిర్వహిస్తున్నాం. ఎన్నికల సమయంలోనైనా సమస్య పరిష్కారమవుతుందని ఎదురు చూస్తున్నాం. - భాస్కర్‌రెడ్డి, లైసెన్స్డ్ సర్వేయర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు సమస్యలు త్వరగా పరిష్కరించాలి రెండు సంవత్సరాలకు పైగా పైసా వేతనం లేదు. చలానా రుసుమును ఖాతాలో జమచేస్తామన్నారు. అదీలేదు. ఇప్పటికైనా సమస్యలు త్వరగా పరిష్కరించాలి. - వెంకటేష్, లైసెన్స్డ్ సర్వేయర్ మార్టూరు -
వయోజన ‘మిథ్య’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వయోజనులకు విద్యా బుద్ధులు నేర్పేందుకు కేంద్ర ప్రభుత్వం 2010 నుంచి కొనసాగించిన సాక్షర భారత్ కార్యక్రమం ఇప్పుడు నిలిచిపోయి క్షేత్రస్థాయిలో అనుకున్న లక్ష్యం సాధ్యం కావట్లేదు. ఈ ప్రక్రియ ఆగిపోయి ఏడాది కావస్తున్నా..ఇందులో పనిచేసిన మండల కోఆర్డినేటర్లు, గ్రామానికి ఇద్దరి చొప్పున విలేజ్ కోఆర్డినేటర్లకు వేతనాల చెల్లింపు ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేదు. గౌరవ వేతనాలు అందక ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఏళ్లుగా ఇందులోనే కొనసాగిన వారి పరిస్థితి గందరగోళంగా మారింది. దీనిని కొనసాగిస్తారేమోననే ఆశను వదలుకోలేక, ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తారా..? లేదా..? అనే విషయాలపై ఎంతకీ స్పష్టత రాక అవస్థ పడుతున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బృహత్తర లక్ష్యంతో ప్రవేశపెట్టిన సాక్షర భారత్ కొండెక్కింది. అక్షరాస్యతా శాతాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2010లో సాక్షరభారత్‌ను ప్రవేశపెట్టి..నిరక్షరాస్యులైన వయోజనులకు విద్యను అభ్యసించే అవకాశం కల్పించారు. గ్రామాల్లో కూలీలు, సామాన్యులు పగటి వేళల్లో పనులకు వెళ్తుంటారని, సాయంత్రం సమయంలో వీరికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలనేది దీని ప్రధాన ఉద్దేశం. పథకం లక్ష్యం 2017 సెప్టెంబర్ వరకుగా నిర్ణయించి, 2018 మార్చి వరకు పొడిగించారు. అయితే లక్ష్యం ఘనమైనా ఆచరణలో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. నూరుశాతం అక్షరాస్యతను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఈ పథకం ద్వారా తీరలేదు. అక్షరాస్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వయోజన విద్య శాఖ ద్వారా సాక్షరభారత్ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగట్లేదు. కొన్నేళ్లుగా జిల్లాలో అమలవుతున్న సాక్షరభారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి. అయితే పర్యవేక్షణ లోపం..ఇతర కారణాలతో ఈ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో కూడా వయోజన విద్య కేంద్రాలు అంతంతమాత్రంగానే నడిచాయని తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే అక్షరాస్యతకు చేరువవుతున్న దశలో ప్రభుత్వం సాక్షరభారత్‌ను నిలిపివేసే ఆలోచనలో ఉండటం పథకం లక్ష్యాలను దెబ్బతీసేలా ఉంది. అందరికీ విద్యను అందించాలంటే సాక్షరభారత్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని పలువురు కోరుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకం కొనసాగింపుపై కేంద్రాన్ని కోరాలని అంటున్నారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో సాక్షరభారత్ కేంద్రం సాక్షరభారత్ సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకం.. సాక్షరభారత్ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందా..? లేదా..? అనే విషయం తేలకపోవడంతో ఇందులో పనిచేస్తున్న ఎంసీవోలు, వీసీవోల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36 మండలాల్లోని 631 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పథకంలో మండలానికి ఒక కో ఆర్డినేటర్ (ఎంసీఓ), గ్రామానికి ఇద్దరు విలేజ్ కో ఆర్డినేటర్లు (వీసీఓ) ఉంటారు. మొత్తం 631 గ్రామ పంచాయతీల్లో 1262 మంది విలేజ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. మండలానికి ఒక కో ఆర్డినేటర్ చొప్పున 36 మంది మండల కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. ఒకవైపు పథకం పొడిగిస్తారో లేదో అనే అనుమానాలతోపాటు గత కొన్ని నెలలుగా సిబ్బందికి వేతనాలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విలేజ్ కో ఆర్డినేటర్లకు రూ.2వేల గౌరవ వేతనం, మండల కో ఆర్డినేటర్లకు రూ.6వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. అయితే వీసీవోలకు 7 నెలలు, ఎంసీవోలకు 6నెలల గౌరవ వేతనం ఇంకా అందాల్సి ఉంది. ప్రతి ఆరునెలలకోసారి వీరికి జీతాలు రావాలి. అదే సమయానికి పథకం పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వీరికి వేతనాలు అందలేదు. అయితే ప్రభుత్వం వీరిని అనేక పనులకు వినియోగించుకుంది. పథకం పొడిగించేది..? లేనిది కేంద్రం స్పష్టం చేసి తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని వారు కోరుతున్నారు. పొడిగింపుపై స్పష్టత లేదు.. సాక్షర భారత్ కార్యక్రమం 2018 మార్చితో ముగిసింది. ప్రభుత్వం నుంచి మాకు దీనిని పొడిగిస్తున్నట్లు కానీ..లేదా ఇతర ఏ సమాచారమూ రాలేదు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం మేం విధులు నిర్వహించనున్నాం. – ధనరాజ్, డిప్యూటీ డైరెక్టర్, సాక్షర భారత్, ఖమ్మం -
పండుగ పూటా పస్తులే...
–విడుదలకు నోచుకోని రూ.5కోట్లు –ఆరు నెలలుగా జీతాల్లేవ్ –4వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల వేదన –10వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదీ అదే తీరు –కలెక్టర్ మాటలకు విలువ ఇవ్వని ఉన్నతాధికారులు –ఏజెన్సీ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం ఏలూరు (మెట్రో) ‘జిల్లాలో ప్రతి ఒక్క కాంట్రాక్టు ఉద్యోగికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. నెల నెలా జీతాలు ఇస్తుంటే పనిచేయడానికి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా జీతాలు విడుదల కాకుంటే నా దష్టికి తీసుకురండి తక్షణమే వారి జీతాలు విడుదలకు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటా. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటా’ ఇవి జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలికిన మాటలు. వాస్తవానికి మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులు కరువుతో అలమటిస్తున్నారు. ఒక్కనెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా ఐదు నెలలుగా జీతాలు లేక విలవిల్లాడిపోతున్నారు. ఏజన్సీ ఉద్యోగులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధికారులతో చెప్పుకోలేక, విధులకు గైర్హాజరు కాలేక అప్పులు చేసుకుంటూ విధులకు హాజరవుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంతోనే నియమింప బడిన కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 4వేలమంది ఉన్నారు. వీరు కాకుండా వివిధ ఏజన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో మరో 10వేల ఉద్యోగులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వంతో నియమింప బడిన కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఐదునెలల నుండి జీతాలు లేకుండా వీరు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం విధులకు హాజరయ్యేందుకు కూడా అప్పులు చేసుకుని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖలో 600 మంది ఉద్యోగులు ః జిల్లాలో కీలకమైన శాఖ వైద్యారోగ్యశాఖ. ఈ శాఖలో పనిచేసే 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. ఇటీవల వ్యాధులతో కనీసం ఒక్క రోజుకూడా సెలవు ఇవ్వకుండా ఉన్నతాధికారులు సిబ్బందిని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ దసరా పురస్కరించుకుని ఒక్క నెల జీతం కూడా ఇవ్వకుండా వీరికీ మొండి చేయ్యే చూపారు. ఏజన్సీ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం ః వాహన సదుపాయం కూడా లేని ఏజన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డోలుగండి, రెడ్డిగూడెం, కొయిదా వంటి మరెన్నో ప్రాంతాలకు కనీసం వాహన సదుపాయం కూడా ఉండని పరిస్థితుల్లోనే ఆయా గ్రామాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమింప బడిన వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికీ 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండానే అధికారులు విధులు చేయించుకుంటున్నారు. డాక్టర్లు, ఫార్మసిస్టులు, హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, డ్రై వర్లు, ఇలా సుమారు 60 మంది సిబ్బంది మారుమూల ప్రాంతాలకు సొంత వాహనాలు, కిరాయి వాహనాలు పెట్టుకుని విధులు నిర్వహించేందుకు వెళుతున్నా కనీసం దసరా సందర్భంగానైనా జీతాలు ఊసు ఎత్తలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అంతే ః వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ద్వారా నియమితులైన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకూ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. వివిధ హాస్టళ్లలో విధులు నిర్వహించే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేవు. అదే విధంగా 104 వాహనాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి 4 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విడుదల కాని రు.5 కోట్లు ః జిల్లా వ్యాప్తంగా ఒక్క వైద్యారోగ్యశాఖలో ఐదు నెలల జీతాల బకాయిలు చెల్లించేందుకు సుమారు రు.2కోట్లు విడుదల కావాల్సి ఉంది. మిగిలిస శాఖలతో కలిపితే ఈ మొత్తం రు.5కోట్లకు చేరనుంది. ఆయాశాఖల అధికారులు కలెక్టర్ ధష్టికి తీసుకెళ్లి ఆయాశాఖల అధికారులతో మాట్లాడినా పండుగ పూటైనా జీతాలు చెల్లించేందుకు అవకాశం ఏర్పడేది. ఆ విధంగా ఏ ఒక్కశాఖలోనూ చేయకుండా పండుగ పూటకూడా కాంట్రాక్టు ఉద్యోగులను పస్తులు ఉంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బోనస్‌లు... కాంట్రాక్టు ఉద్యోగులకు కానరాని అడ్వాన్సులుః జీతాలు రాకుంటే రెండు నెలల వరకైనా అడ్వాన్సు రూపంలో చెల్లించే అవకాశం ఆయాశాఖల ఉన్నతాధికారుల చేతిలో ఉన్నప్పటికీ ఆమేరకు ప్రయత్నాలు చేసిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌లతో దసరా బొనాంజాలు ఇస్తుంటే జిల్లాలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం అప్పుల దసరాను జిల్లా అధికారులు చూపిస్తున్నారు. కనీసం అడ్వాన్సులైనా ఇవ్వాలి డిఎన్‌విడి ప్రసాద్, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు దసరా పండుగ అంటే బోనస్‌ల కోసం ప్రతి ఒక్క ఉద్యోగీ ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే జిల్లాలో పనిచేసే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం అడ్వాన్సులైనా ఇస్తారేమో అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదారు నెలలుగా జీతాలు రాక అవస్తలు పడుతున్న ఉద్యోగులకు కనీసం అడ్వాన్సులైనా ఇవ్వాలి ఆరు నెలలుగా జీతాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నాం జఫ్ర#ల్లా, హెల్త్ అసిస్టెంట్, చింతలపూడి నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా ఆరు నెలలుగా జీతాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నాం. అప్పులు చేసుకుంటూ విధులకు వెళుతున్నాం. కనీసం దసరాకైనా జీతాలు వస్తాయని ఎదురు చూసాం. కానీ ఒక్క నెల కూడా జీతాలు విడుదల చేయలేదు. -
పండగొస్తోంది.... జీతం కావాలంటోంది.!
అష్టకష్టాలు పడుతున్న కేజీహెచ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఆరు నెలలుగా జీతాలు బంద్ సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్, నర్సుల పస్తులు పట్టించుకోని కాంట్రాక్టర్లు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదారుుని కేజీహెచ్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది పస్తులుంటున్నారు. ఆర్నెల్లగా జీతాలు అందక పోవడంతో పిల్లలకు స్కూళ్ల ఫీజులు కట్టలేక, రేషన్, ఇంటి అద్దెలు చెల్లించలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్టర్ కూడా వీరిని పట్టించుకోవడం లేదు. కనీసం చాలా మంది సిబ్బందికి కాంట్రాక్టర్ కూడా ఎవరో తెలియదు. సూపర్వైజర్లే మొత్తం కథ నడిపిస్తున్నారు. నిబంధనల ప్రకారం కనీస వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించాలి. ఆరు నెలలుగా పనిచేస్తున్న సిబ్బంది ఈ నంబర్లు కూడా రాలేదు. ఒకవేళ మధ్యలో ఉద్యోగం వదలి వెళ్లిపోతే.. ఇంతకాలం పనిచేసిన కాలానికి జీతం చెల్లించరని వాపోతున్నారు. మరో వైపు పండగొస్తోంది. జీతాలు లేక ఎలా పండగ జరుపుకోవాలని వారంతా ఆవేదన చెందుతున్నారు. - కేజీహెచ్ ఇదీ పరిస్థితి.. కేజీహెచ్‌లో జేబీ సెక్యూరిటీ ఆధ్వర్యంలో 172 మంది గార్డులు, సూపర్ వైజర్లు పనిచేస్తున్నారు. కొత్తగా నిర్వహణ బాధ్యతలను తీసుకున్న ఈ సంస్థ 12 శాతం తక్కువకు పనులను చేజిక్కించుకుం ది. మే నుంచి గార్డులను సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి నేటి వరకు గార్డులకు జీతం కింద చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. కాంట్రాక్టు తీసుకున్నప్పుడు పని చేస్తున్న వారికి ఒకటి లేదా రెం డు నెలల జీతాలు ముందుగా కాంట్రాక్టర్ చెల్లించాలి. ప్రస్తుతం కేజీహెచ్‌లో వారిని పట్టించుకున్న నాథుడే లేడు. హౌస్ కీపింగ్ కింద కేజీహెచ్‌లో 230 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా ముంబైకి చెందిన సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. వీరికి కూడా గడిచిన నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. వీరికి ప్రతినెలా రూ.41.92 లక్షల జీతాలు చెల్లించాల్సి ఉంది. బిల్లులు పాసైతే వీరికి జీతాలు. లేదంటే ఎన్ని నెలలు అరుునా పస్తులుండాల్సిందే. ఈ ఏడాది మార్చి నుంచి కాంట్రాక్టు పద్ధతిలో 160 మంది వరకు నర్సులను విధుల్లోకి తీసుకున్నారు. వీరికి ఇప్పటి వరకు రెండు నెలల జీతాలు మాత్రమే అందాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్ సిబ్బంది ప్రతి నెల 11న జీతాల బిల్లులు పెడితే.. ట్రెజరీ నుంచి విడుదలయ్యే నిధులను సిబ్బంది అకౌంట్‌కు జమ చేయాలి. ఈ రెండు సంస్థలు సకాలంలో బిల్లులు పెట్టడం లేదని వైద్యాధికారులు తెలిపారు. వారు బిల్లులు పెట్టకపోతే జీతాల నిధులు ఎలా మంజూరు చేస్తామని చెబుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ దేవుడెరుగు! కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి ఈఎస్ఐ, పీఎఫ్‌లు చెల్లించాలి. వారి పేర్ల మీద అకౌంట్లు తెరచి, సొమ్ములను జమ చేయాలి. ప్రస్తుతం కేజీహెచ్‌లో ఏ కార్మికుడికి కూడా ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కార్మిక శాఖ అధికారులు ఆరా తీసిన దాఖలాలు కూడా లేవు. అటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదని కాంట్రాక్ట్ సిబ్బంది వాపోతున్నారు. జీతాలు చెల్లించాలని కోరుతున్నాం కేజీహెచ్‌లో పనిచేస్తున్న నర్సులకు సకాలంలో జీతాలు చెల్లించాలి. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాం. - భాగ్యలక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రభుత్వ నర్సుల సంఘం సకాలంలో జీతాలు చెల్లించాలి కేజీహెచ్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ సిబ్బందికి ప్రతి నెలా జీతాలు చెల్లించాలి. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం. - శ్రీను, ఐఎన్టీయూసీ నాయకుడు జీతాలు చెల్లిస్తాం కేజీహెచ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందిని సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లలు సకాలంలో బిల్లులు పెట్టకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నాం. - డాక్టర్ అర్జున్, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
జీతాలివ్వండి మహాప్రభో!
► ఐదునెలలుగా ఎంపీఈఓలకు జీతాలు కరువు ► తీవ్ర ఇబ్బందుల్లో ఉద్యోగులు శింగనమల : నియోజక వర్గంలో శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో 48 మంది ఎంపీఈఓలు వ్యవసాయశాఖలో పని చేస్తున్నారు. అందులో 24 మంది ఏప్రిల్ నుంచి కొత్తగా విధులలోకి చేరారు. ఎంపీఈఓలకు వ్యవసాయ శాఖలో పరిధిలో వేరుశనగ విత్తనాలు పంపిణీæ, క్రాఫ్ బుకింగ్, గ్రామ స్కెచ్‌లు తయారు చేయడం, రైతులతో సమావేశాలు నిర్వహించడం, వారికి అవగాహన కల్పించడం ,మట్టి నమునాలు సేకరించడం, వాటిని రైతులకు అందజేయడం వంటి పనులు చేస్తున్నారు అందని జీతాలు పాత ఎంపీఈఓలకు ఫిబ్రవరి నుంచి, కొత్త వారికి ఏప్రిల్ నుంచి జీతాలు రాలేదు. శింగనమల, గార్లదిన్నె మండలాల్లోని 14 మందికి మాత్రమే జీతమిచ్చారు. బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో పని చేస్తున్న 34 మందికి జీతాలు రాలేదు. వీరిలో పాత వారు 17 మంది ఉంటే కొత్తగా చేరినవారు 17 మంది ఉన్నారు. నాలుగు మండలాల్లో పని చేస్తున్న ఎంపీఈఓలకు రూ. 10.88 లక్షలు జీతాలు రావాల్సి ఉంది. పాత వారికి ఒక్కొక్కరికీS రూ.40 వేలు, కొత్త వారికి ఒక్కొక్కరికీ రూ.24 వేలు జీతాలు రాలేదు. జీతాలు ఇవ్వకపోవడంతో ప్రయాణ ఖర్చులతో పాటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని పలువురు ఎంపీఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీఈఓల జీతాలు ట్రెజరీకి అందించాం ఎంపీఈఓల జీతాల విషయాన్ని ఏడీ దృష్టికి తీసుకెళ్లాం. అక్కడి నుంచి వారి బిల్లులు ట్రెజరీకి పంపించారు. ఈనెలాఖరులోపు వారి బ్యాంక్ ఖాతాలకు జీతాలు జమ అవుతాయి. – ఆంజినేయులు, ఏఓ,యల్లనూరు -
ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయనకంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ.62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనతంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్విట్టర్‌కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. అయితే ఫేస్‌బుక్‌కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లున్నారు. దాంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్విట్టర్ కంటే ఫేస్బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లుండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్విట్టర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్విట్టర్లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సీ అన్నారు. దీనివల్లే ట్విట్టర్‌కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు.