పండుగ పూటా పస్తులే... | no salary for 6 months | Sakshi
Sakshi News home page

పండుగ పూటా పస్తులే...

Published Sat, Oct 8 2016 6:27 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

పండుగ పూటా పస్తులే... - Sakshi

పండుగ పూటా పస్తులే...

–విడుదలకు నోచుకోని రూ.5కోట్లు
–ఆరు నెలలుగా జీతాల్లేవ్‌
–4వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల వేదన
–10వేల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులదీ అదే తీరు
–కలెక్టర్‌ మాటలకు విలువ ఇవ్వని ఉన్నతాధికారులు
–ఏజెన్సీ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం
ఏలూరు (మెట్రో)
‘జిల్లాలో ప్రతి ఒక్క కాంట్రాక్టు ఉద్యోగికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. నెల నెలా జీతాలు ఇస్తుంటే పనిచేయడానికి ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికైనా జీతాలు విడుదల కాకుంటే నా దష్టికి తీసుకురండి తక్షణమే వారి జీతాలు విడుదలకు ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటా. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటా’ ఇవి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఇటీవల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలికిన మాటలు. 
వాస్తవానికి మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులు కరువుతో అలమటిస్తున్నారు. ఒక్కనెల కాదు, రెండు నెలలు కాదు, ఏకంగా ఐదు నెలలుగా జీతాలు లేక విలవిల్లాడిపోతున్నారు. ఏజన్సీ ఉద్యోగులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అధికారులతో చెప్పుకోలేక, విధులకు గైర్హాజరు కాలేక అప్పులు చేసుకుంటూ విధులకు హాజరవుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంతోనే నియమింప బడిన కాంట్రాక్టు ఉద్యోగులు సుమారు 4వేలమంది ఉన్నారు. వీరు కాకుండా వివిధ ఏజన్సీల ద్వారా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో మరో 10వేల ఉద్యోగులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వంతో నియమింప బడిన కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఐదునెలల నుండి జీతాలు లేకుండా వీరు కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం విధులకు హాజరయ్యేందుకు కూడా అప్పులు చేసుకుని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
వైద్యారోగ్యశాఖలో 600 మంది ఉద్యోగులు ః 
జిల్లాలో కీలకమైన శాఖ వైద్యారోగ్యశాఖ. ఈ శాఖలో పనిచేసే 600 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఐదు నెలలుగా జీతాలు లేవు. ఇటీవల వ్యాధులతో కనీసం ఒక్క రోజుకూడా సెలవు ఇవ్వకుండా ఉన్నతాధికారులు సిబ్బందిని తీవ్ర ఇబ్బందులు పెట్టారు. అయినప్పటికీ దసరా పురస్కరించుకుని ఒక్క నెల జీతం కూడా ఇవ్వకుండా వీరికీ మొండి చేయ్యే చూపారు.
ఏజన్సీ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయం ః
వాహన సదుపాయం కూడా లేని ఏజన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డోలుగండి, రెడ్డిగూడెం, కొయిదా వంటి మరెన్నో ప్రాంతాలకు కనీసం వాహన సదుపాయం కూడా ఉండని పరిస్థితుల్లోనే ఆయా గ్రామాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన నియమింప బడిన వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికీ 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండానే అధికారులు విధులు చేయించుకుంటున్నారు. డాక్టర్లు, ఫార్మసిస్టులు, హెల్త్‌ అసిస్టెంట్లు, ల్యాబ్‌ అసిస్టెంట్‌లు, డ్రై వర్లు, ఇలా సుమారు 60 మంది సిబ్బంది మారుమూల ప్రాంతాలకు సొంత వాహనాలు, కిరాయి వాహనాలు పెట్టుకుని విధులు నిర్వహించేందుకు వెళుతున్నా కనీసం దసరా సందర్భంగానైనా జీతాలు ఊసు ఎత్తలేదు.
అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పరిస్థితి అంతే ః
వివిధ కాంట్రాక్టు ఏజన్సీల ద్వారా నియమితులైన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకూ జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. వివిధ హాస్టళ్లలో విధులు నిర్వహించే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు లేవు. అదే విధంగా 104 వాహనాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి 4 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
విడుదల కాని రు.5 కోట్లు ః
జిల్లా వ్యాప్తంగా ఒక్క వైద్యారోగ్యశాఖలో ఐదు నెలల జీతాల బకాయిలు చెల్లించేందుకు సుమారు రు.2కోట్లు విడుదల కావాల్సి ఉంది. మిగిలిస శాఖలతో కలిపితే ఈ మొత్తం రు.5కోట్లకు చేరనుంది. ఆయాశాఖల అధికారులు కలెక్టర్‌ ధష్టికి తీసుకెళ్లి ఆయాశాఖల అధికారులతో మాట్లాడినా పండుగ పూటైనా జీతాలు చెల్లించేందుకు అవకాశం ఏర్పడేది. ఆ విధంగా ఏ ఒక్కశాఖలోనూ చేయకుండా పండుగ పూటకూడా కాంట్రాక్టు ఉద్యోగులను పస్తులు ఉంచుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం బోనస్‌లు... కాంట్రాక్టు ఉద్యోగులకు కానరాని అడ్వాన్సులుః
జీతాలు రాకుంటే రెండు నెలల వరకైనా అడ్వాన్సు రూపంలో చెల్లించే అవకాశం ఆయాశాఖల ఉన్నతాధికారుల చేతిలో ఉన్నప్పటికీ ఆమేరకు ప్రయత్నాలు చేసిన పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌లతో దసరా బొనాంజాలు ఇస్తుంటే జిల్లాలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం అప్పుల దసరాను జిల్లా అధికారులు చూపిస్తున్నారు. 
 
కనీసం అడ్వాన్సులైనా ఇవ్వాలి
డిఎన్‌విడి ప్రసాద్, కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు
దసరా పండుగ అంటే బోనస్‌ల కోసం ప్రతి ఒక్క ఉద్యోగీ ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే జిల్లాలో పనిచేసే కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మాత్రం అడ్వాన్సులైనా ఇస్తారేమో అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదారు నెలలుగా జీతాలు రాక అవస్తలు పడుతున్న ఉద్యోగులకు కనీసం అడ్వాన్సులైనా ఇవ్వాలి
 
ఆరు నెలలుగా జీతాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నాం
జఫ్ర#ల్లా, హెల్త్‌ అసిస్టెంట్, చింతలపూడి
నెల కాదు, రెండు నెలలు కాదు ఏకంగా ఆరు నెలలుగా జీతాలు లేకుండానే విధులు నిర్వహిస్తున్నాం. అప్పులు చేసుకుంటూ విధులకు వెళుతున్నాం. కనీసం దసరాకైనా జీతాలు వస్తాయని ఎదురు చూసాం. కానీ ఒక్క నెల కూడా జీతాలు విడుదల చేయలేదు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement