బడి తెరిచినా... భృతి లేదు | Academic Instructors Not Getting Salaries In AP | Sakshi
Sakshi News home page

బడి తెరిచినా... భృతి లేదు

Published Thu, Jun 13 2019 8:47 AM | Last Updated on Thu, Jun 13 2019 8:50 AM

Academic Instructors Not Getting Salaries In AP - Sakshi

విద్యార్థులకు బోధిస్తున్న అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌(ఫైల్‌)

సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం): ఇచ్ఛాపురం నియోజకవర్గం... ఈ నియోజకవర్గంలో ఉద్యోగులు విధులు నిర్వహించాలంటే పనిష్మెంట్గా భావిస్తారు. అందుకే ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సైతం స్థానికంగా నివాసం ఉండకుండా సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అందుకు కారణం ఈ ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధి తీవ్రంగా ఉండడమే. ఈ నేపథ్యంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో ఉన్న బడుల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గ ఉపాధ్యాయులు లేకపోవడంతో ప్రభుత్వ బడుల్లో విద్య పడకేసింది. గతేడాది ఆగస్టు నెలలో అప్పటి జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని స్థానిక విద్యావంతులు కోరారు. దీంతో స్పందించిన ఆయన కిడ్నీ వ్యాధి ప్రభావిత మండలాల్లో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేసి, అందుకు రూ.కోటి 46 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుందని ప్రకటించారు. అనుకున్న విధంగానే ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు సంబంధించి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 400 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేస్తున్నట్టు అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి సాయిరాం ఆదేశాలు జారీ చేశారు. దీంతో రోస్టర్‌ విధానంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే(ఎస్‌జీటీ, భాషా పండితులు) అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లకు రూ.5 వేలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే (స్కూల్‌ అసిస్టెంట్‌) అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల కు రూ.7 వేలు చొప్పున్న గౌరవ వేతనాలు ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసి గతేడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో విధుల్లోకి తీసుకున్నారు.

ఒక్క నెల కూడా అందని వేతనం 
తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ సమయంలో తమ భవిష్యత్‌ను లెక్కచేయకుండా ఆయా పాఠశాలల్లో విధులు నిర్వహించిన వీరికి జిల్లా విద్యాశాఖాధికారి చుక్కలు చూపించింది. సెప్టెంబర్‌ నుంచి విద్యా సంవత్సరం పూర్తయిన ఏప్రిల్‌ 23 వరకు విధులు నిర్వహించారు. విద్యా సంవత్సరం పూర్తయి మరలా బడులు తెరుచుకున్నప్పటికీ వీరికి ఒక్కనెల కూడా వేతనాలు అందకపోవడంతో గమనార్హం. తమకు వేతనాలు అందుతాయో లేదో అన్న సందేహంలో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు కొట్టిమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వేతనాలు అందించాలని అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు కోరుతున్నారు.

ఎవరూ పట్టించుకోవడం లేదు
మూత్రపిండాల వ్యాధి ప్రభావిత మండలాల్లో గతేడాది సెప్టెంబర్‌ నెలలో నియోజకవర్గంలో 400 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నియమించింది. మున్ముందు డీఎస్సీ ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యాసంవత్సరం పూర్తయిన ఏప్రిల్‌ 23 వరకు విధులు నిర్వహించాం. ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. మా గురించి ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.
– కె.మీనూ, అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్, కేశుపురం యూపీ స్కూల్, ఇచ్ఛాపురం మండలం

వేతనాలు విడుదల చేసి ఆదుకోండి
ఉద్దానం ప్రాంతంలో ఉన్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో 400 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను కలెక్టర్‌ చొరవతో విధుల్లో చేరారు. వీరి రాకతో పాఠశాలలు మరింత బలోపేతమయ్యాయి. ఇప్పటికి ఎనిమిది నెలలు దాటుతున్నా ఇంత వరకు ఒక్క నెల వేతనం కూడా రాకపోవడం దురదృష్టకరం. ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల ద్వారా వారికి త్వరగా వేతనాలు అందించాలని కోరుతున్నాము.
– బి.శంకరం, ఆపస్‌ మండల ప్రధాన కార్యదర్శి, ఇచ్ఛాపురం మండలం

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అధికారులు సైతం స్పందించారు. త్వరలో ప్రతీ అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌కు వేతనాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో కలెక్టర్‌ ఆదేశాలు మేరకు గతంలో పనిచేసిన విద్యా వలంటీర్లను ఈ నెల 12 నుంచి నియమించడం జరిగింది.
– కురమాన అప్పారావు, మండల విద్యాశాఖాధికారి, ఇచ్ఛాపురం మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement