మూడు పంచాయతీల్లో ఉన్న తిప్పనపుట్టుగ గ్రామం
ఇచ్ఛాపురం రూరల్: ‘ఒక గ్రామం.. ఒక పంచాయతీ..’ అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం.. రెండు మండలాల్లో, మూడు పంచాయతీల్లో విస్తరించి ఉంది. ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ గ్రామంలో సుమారు 700కు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలోనే ఉన్న ఈదుపురం పంచాయతీలో తిప్పనపుట్టుగ గ్రామ పరిధి కొంత విస్తరించి ఉంది. అక్కడ 718 మంది ఓటర్లున్నారు. కవిటి మండలం డి.గొనపపుట్టుగ పంచాయతీ పరిధిలో.. తిప్పనపుట్టుగకు చెందిన కొన్ని వీధులుండగా, అక్కడ 134 మంది ఓటర్లున్నారు. అలాగే ఇచ్ఛాపురం మండలం కొఠారీ పంచాయతీ పరిధిలో కూడా తిప్పనపుట్టుగకు చెందిన 25 మంది ఓటర్లున్నారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారైనప్పటికీ.. వేరు వేరు పంచాయతీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
సన్యాసిపుట్టుగది అదే తీరు..
ఇచ్ఛాపురం, కవిటి మండలాల పరిధిలో ఉన్న సన్యాసిపుట్టుగ గ్రామానిదీ కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఈ గ్రామంలో సుమారు 1,600 మంది వరకు ఓటర్లున్నారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ పరిధిలో కూడా సన్యాసిపుట్టుగకు చెందిన కొంత భాగముంది. అందులో 740 మంది ఓటర్లున్నారు. కవిటి మండలం నెలవంక పంచాయతీ పరిధిలో సన్యాసిపుట్టుగకు చెందిన మరికొంత భాగముంది. అందులో 850 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ ఊళ్లో రెండు మండలాలు!
గుర్ల(చీపురుపల్లి): చూడ్డానికి ఒకే ఊరులా ఉన్నా రెండు వేర్వేరు పంచాయతీలున్నాయి. అంతేకాదు వేర్వేరు మండలాలు కూడా. విజయనగరం జిల్లాలోని లవిడాం, వెంకటపాత్రునిరేగ గ్రామాలు చూడ్డానికి ఒకే గ్రామంలా ఉంటాయి. అసలవి రెండు గ్రామాలంటే కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చినవారు అస్సలు నమ్మలేరు. గుర్ల మండలం, గరివిడి మండలాల పరిధిలో ఆ రెండు గ్రామాలున్నాయి. వీటి మధ్య ఓ రహదారి ఉంది. పంచాయతీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలసి ఉంటారు. అయితే చాన్నాళ్ల కిందట ఒకే ఊరిగా ఉండగా, చిన్న గొడవ కారణంగా రెండుగా విడిపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. లవిడాంలో 280 ఇళ్లు.. 734 మంది ఓటర్లు, వెంకటపాత్రునిరేగలో 320 ఇళ్లు.. 930 మంది ఓటర్లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment