
అమెజాన్ కన్నా అతనే బెటర్
మనకు మార్కెట్‌లో అందుబాటులోలేని పుస్తకమేకాదు, ప్రపంచంలో ఓ మారు మూల ప్రాంతానికి పరిమితమైన పుస్తకమైనాసరే,
కోల్‌కతా: మనకు మార్కెట్‌లో అందుబాటులోలేని పుస్తకమేకాదు, ప్రపంచంలో ఓ మారు మూల ప్రాంతానికి పరిమితమైన పుస్తకమైనాసరే, కొత్తగా అప్పుడే మార్కెట్‌లోకి వచ్చిన పుస్తకమే కాదు, ఎప్పుడో కనుమరుగైనా పుస్తకమైనా సరే, చివరకు నిషేధించినదైనాసరే, అవుటాఫ్ స్టాక్ పుస్తకమైనా సరే, మనం కోరుకుంటే ‘అమెజాన్’ కంటే వేగంగా, నమ్మకంగా మనకు తెచ్చిస్తాడు తరుణ్ కుమార్ షా.
సాహిత్యం నుంచి సైన్స్ మాగజైన్ వరకు, సిడ్నీ షెల్డన్ నుంచి ఆండ్రీగైడ్ వరకు ఏ పుస్తకమంటే ఆ పుస్తకంతో మనముందు ప్రత్యక్షమవుతాడు తరుణ్ షా. ఇంట్లోనో, ఆషీసులోనోకాదు, గోల్ఫ్‌కోర్టులో, క్లబ్‌లో, విమానాశ్రయం లాంజిలో మనం ఎక్కడున్నా అక్కడికి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనం అడిగిన పుస్తకాన్ని అందజేస్తాడు. అందుకనే అతన్ని అందరూ తరుణ్ షా అని పిలుస్తారు. అమెజాన్ వెళ్లని చోటుకు తరుణ్ షా వెళతాడని అంటారు.
ఇద్దరు నోబెల్ అవార్డు గ్రహితలు, ఎంతో మంది జ్ఞానపీఠ్ అవార్డు, మరెంతో మంది సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలున్నా కోల్‌కతా నగరంలో తరుణ్ దా అంటే తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ మీడియా కార్యాలయాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వరకు, ఇతరులకు ప్రవేశంలేని అలిపోర్ నుంచి బల్లీగంజ్ బంగ్లా వరకు, హాలివుడ్ లైబ్రరీల నుంచి అకాడమిక్ సంస్థల వరకు ఆయన చొచ్చుకుపోని చోటంటూ ఉండదు.
ఎంజే అక్బర్‌తో సహా ఎంతోమంది ఎడిటర్లు, రితిపర్ణో ఘోష్ లాంటి సినీ దర్శక నిర్మాతలు ఎంతో మందికి ఆయన సుపరిచితం. నాలుగేళ్ల క్రితమే మరణించిన రితిపర్ణో ఘోష్‌కు పుస్తకాలంటే పంచ ప్రాణాలట. ఆయనకు ఎన్నో పుస్తకాలు సేకరించి అందజేశారట. ఆయన చనిపోయిన తర్వాత రెండువేల పుస్తకాలను వారి కుటుంబ సభ్యులు మన తరుణా దా సమక్షంలోనే సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌కు ఇచ్చారట.
ప్రస్తుతం 53వ ఏట అడుగుపెట్టిన తరుణ్ షా గత మూడు దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఇదే వ్యాపారం చేస్తున్నారు. ఆయన తండ్రి గోపాల్ లాల్ షాకు 30 ఏళ్ల క్రితం బుక్‌స్టాల్ ఉండేది. నాటి తరం నుంచే పుస్తకాలు చదివే సంస్కతి అంతరించిపోతుండడంతో పుస్తకాలు కొనేవాళ్లు లేక ఆయన బుక్‌స్టాల్‌ను మూసేశారు. ముందుగా మిగిలిపోయిన పుస్తకాలను ఇల్లిల్లు తిరిగి విక్రయించడంలో భాగంగా బయల్దేరిన తరుణ్ దాకు రకరకాల మనస్తత్వం కలిగిన, భిన్న అభిరుచులు కలిగిన పుస్తక అభిమానులు తారసపడ్డారు. వారికి అనుకూలమైన పుస్తకాలను సూచించడంతోపాటు వారికి అవి ఎక్కడున్నా తెచ్చి అమ్మేవారు. పుట్టిన రోజు నుంచి పెళ్లి వేడుకల వరకు ఎలాంటి పుస్తకాలు గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుందో నగర ప్రజలు ఆయన్ని వాకబు చేసి మరీ తెప్పించుకుంటున్నారు.
సింగపూర్‌లో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న తన కుమారుడు సహాయంతో తరణ్ షా వివిధ రకాల పుస్తకాలను తెప్పించుకునేందుకు ఇంటర్నెట్ ద్వారా ఓ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన వ్యాపారానికి పెద్దన్నయ్యను కూడా తోడాగా తెచ్చుకున్నారు. ఎక్కడికైనా తరుణ్ షా స్కూటర్‌పైనే పుస్తకాలను డెలివరి చేస్తారు. ఒక్క ఆంగ్ల, బెంగాలీ పుస్తకాలను మాత్రమే ఆయన విక్రయిస్తున్నారు. అందుకు కారణం పాఠకుల నుంచి వాటికి మాత్రమే డిమాండ్ ఉండడం. సాహిత్యానికి, పాఠకులకు పుట్టిల్లుగా ప్రసిద్ధి చెందిన కోల్‌కతాలో పఠనాసక్తిని తరుణ్ దా బతికిస్తున్నాడని చెప్పవచ్చు.