నర్సరీ నుంచి ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే
♦ తప్పనిసరి చేయనున్న ఎస్‌సీఈఆర్‌టీ
♦ ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలు వినియోగిస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: నర్సరీ విద్యార్థికి బ్యాలెన్స్‌డ్ డైట్‌పై ప్రాజెక్టు వర్క్... ఎల్‌కేజీ విద్యార్థికి జనరల్ నాలెడ్జిపై మరో ప్రాజెక్టు. మాటలే సరిగ్గా రాని వయసులో అశాస్త్రీయ పద్ధతిలో విద్యా బోధన. ఇష్టారాజ్యంగా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలతో కుస్తీలు. ఆట, పాటలు, అలవాట్లు నేర్పించాల్సిన వయస్సులో ఇష్టారాజ్యంగా చదువులు... పిల్లలపై మానసిక ఒత్తిడి. ఇదీ రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు, ప్లే స్కూళ్లలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా విధానం.
స్వయంగా విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) అధికారుల పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు. అందుకే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇష్టారాజ్యంగా సిలబస్‌ను అమలును కట్టడి చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ కసరత్తు ప్రారంభించింది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లోనూ ప్రభుత్వం సూచించే సిలబస్‌నే బోధించేలా చర్యలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చింది.
80 శాతం మెదడు అభివృద్ధి చెందే వయసు పిల్లలకు వినడం.. పరిశీలించడం.. మాట్లాడించడం నేర్పించాలన్న మాంటిస్సోరీ విధానాన్ని పక్కనబెట్టి అశాస్త్రీయ విధానాలతో.. అనవసరపు ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీకి బోధించాల్సిన సిలబస్ రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం రూపొందించే సిలబస్‌లోనే అన్ని ప్రైవేటు పాఠశాలల్లో బోధన కొనసాగించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూన్) దీనిని పక్కాగా అమలు చే యనుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరించే ప్లే స్కూళ్లు, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగించే పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతోంది.
వచ్చే నెలాఖరుకు సిలబస్ రెడీ...
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్లేస్కూల్ లిఫ్ట్‌లో విద్యార్థి పడి మరణించిన నేపథ ్యంలో విద్యాశాఖ ప్లే స్కూళ్లు, ప్రీప్రైమరీ విద్యాబోధన, ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలపై తీవ్రంగా స్పందించింది. ఇందులో భాగంగాా ప్రతి ప్లేస్కూలూ గుర్తింపు పొందాల్సిందేనని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లో ఆశాస్త్రీయ విధానంలో విద్యా బోధన కొనసాగుతుందని, అది విద్యార్థులపై ఒత్తిడిని పెంచడమే కాకుండా వారి మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న విషయాన్ని గుర్తించింది.
అవసరమైన సిలబస్‌ను రూపొందించాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే వివిధ వర్గాలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో వర్క్‌షాప్ నిర్వహించనుంది. అలాగే ప్రస్తుతం వివిధ ప్లేస్కూళ్లు, ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్న పబ్లిషర్ల పుస్తకాలను పరిశీలించేందుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు కర్ణాటకలో ప్రీప్రైమరీకి బోధించేందుకు రూపొందించిన సిలబస్‌ను కూడా పరిశీలించి, శాస్త్రీయ పద్ధతిలో సిలబస్‌ను రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మొత్తానికి వచ్చే నెలాఖరులోగా సిలబస్‌ను సిద్ధం చేసి, పుస్తకాల ముద్రణకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తద్వారా వచ్చే జూన్ 13న పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి శాస్త్రీయ విధానంలో రూపొందించిన పుస్తకాలను అందుబాటులోకి తే సుకువచ్చేందుకు ఎస్‌సీఈఆర్‌టీ చర్యలు చేపడుతోంది. వాటి అమలు పర్యవేక్షణ బాధ్యతలను డీఈవోలు తీసుకోవాలని, అమలు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు చేపట్టేలా నిబంధనలు తీసుకురాబోతోంది.