చేయాల్సింది ఎంతో ఉంది
రాష్ట్రపతి భవన్‌పై ప్రణబ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో ఇంకా తాను చేయాల్సింది ఎంతో ఉందని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆయన మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎస్టేట్‌లోపల ‘ఆయుష్ వెల్‌నెస్ సెంటర్’ను ప్రణబ్ శనివారం ప్రారంభించారు. ప్రజలకవసరమైన ప్రాథమిక అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్నది తన ఆలోచనగా పేర్కొన్నారు.
అందుకే రాష్ట్రపతి ఎస్టేట్‌లో స్వచ్ఛ భారత్, భేటీ బచాబో, భేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని భావించినట్టు తెలిపారు. ‘నామినేషన్ పత్రాలు(రాష్ట్రపతి పదవికోసం) దాఖలు చేసేటప్పుడు ఓ సహచరుడు మాట్లాడుతూ సుదీర్ఘకాలంపాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన నేను అక్కడ(రాష్ట్రపతి భవన్‌లో) ఏం చేయగలనని అన్నారు. క్రియాశీలకమైన జీవితం నుంచి నిస్సారమైన జీవితంతో కూడిన ప్రదేశంలోకి అడుగుపెడుతున్నారని నన్ను ఉద్దేశించి అన్నారు. కానీ ఆయన చెప్పిన రీతిలో పరిస్థితి లేదని నేను తెలుసుకున్నా.
ఇక్కడ ఎంతో చేయవచ్చు. ఇక్కడ(రాష్ట్రపతి ఎస్టేట్) ఏడువేల మంది, వారి కుటుంబాలు ఉంటున్నాయి. వారికోసం ఎన్నో వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. అందువల్లే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వెనువెంటనే దానిని రాష్ట్రపతి భవన్‌లో అమలు చేయాలని నిర్ణయించానని తెలిపారు.
ప్రణబ్‌కు మోదీ అభినందనలు..
రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రణబ్ అపార అనుభవం, తెలివితేటలు దేశానికి ఎంతో లబ్ధి చేకూర్చాయని ట్విట్టర్‌లో ఆయన ప్రశంసలు కురిపించారు.