రాష్ట్రపతికి కోపం తెప్పించిన ఎంపీలు
న్యూఢిల్లీ: పార్లమెంటులో ప్రతిష్టంభన పరిస్థితులపట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అసంతృప్తి, ఓకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమయాన్ని వృధా చేయడం ఇరుపక్షాల సభ్యులకు ఏమాత్రం భావ్యంకాదని, ఇది అంగీకరించకూడని విషయం అని అన్నారు. ‘ ఎంపీలు.. మీ పని మీరు చేయండి. పార్లమెంటు నడిచేందుకే మీరు అక్కడ ఉన్నారు. పార్లమెంటును కార్యకలాపాలను భంగపరచడం అంగీకరించకూడని విషయం’ అని ఆయన అన్నారు.
గురువారం ముఖర్జీ డిఫెన్స్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పది హేను రోజులుగా పార్లమెంటులో పరస్పర దూషణలతోనూ, వాయిదాలతోనూ సమయమంతా వృధాగా పోతున్న విషయం తెలిసిందే. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, దానిపై చర్చ జరగాలని, ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతుండగా, అందుకు ససేమిరా అంటూ, తాము తీసుకుంది సరైన నిర్ణయమే అంటూ అధికార పక్షం చెబుతోంది.
ఈ సమాధానాలతో సంతృప్తి చెందని విపక్షాలు పార్లమెంటును ప్రతి రోజు స్తంభింప చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు మిగితా విషయాలు పక్కన పెట్టి వారిపని వారు చేయాలని సూచించారు. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ కూడా పార్లమెంటు పరిస్ధితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.