సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు జడ్జీలు!
న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి చేరనుంది. జడ్జీల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకాలు చేశారని, త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నవీన్ సిన్హా, కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహన్ ఎం.శాంతనగౌడర్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ గుప్తా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించినట్లు సమాచారం.
సుప్రీంకోర్టులో 31 మంది జడ్జీలు ఉండాల్సిఉండగా, ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్‌లు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు.