'దాద్రి'పై మౌనం వీడిన మోదీ
ముంగర్ (బీహార్): గోమాంసం విషయమై జరిగిన 'దాద్రి' హత్య ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు మౌనం వీడారు. ''హిందువులు, ముస్లింలు ఇలా పరస్పరం కోట్లాడుకుంటారా? లేక పేదరికంపై పోరాడుతారా?' అని ఆయన ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవాడాలో జరిగిన సభలో ప్రధాని మోదీ గురువారం ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించినవిధంగా భారత మూల సూత్రాలైన భిన్నత్వాన్ని, సహనాన్ని దేశ ప్రజలు పాటించాలని ఆయన కోరారు.
హిందువులు, ముస్లింలు పరస్పరం కోట్లాడుకోవద్దని, వారు పేదరికంపై పోరాటం చేయాలని గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా తాను పేర్కొన్న విషయాన్ని మోదీ గుర్తుచేశారు. " రాజకీయాలు, అల్పమైన ప్రయోజనాల కోసమే కొందరు వ్యక్తులు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని సీరియస్గా తీసుకోవద్దు. అలాంటి వ్యాఖ్యలను నరేంద్రమోదీ చేసినా వాటిని వినిపించుకోకండి. మీరు వినాలనుకుంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న చేసిన ప్రసంగాన్ని వినండి. అంతకన్నా గొప్ప సందేశం ఏమీలేదు. మనం నడవాల్సిన మార్గాన్ని రాష్ట్రపతి చూపించారు. ఆ మార్గంలో నడిస్తేనే మనం ప్రపంచ అంచనాలను అందుకోగలుగుతాం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.