రెణ్ణిమిషాల జాబితా
ప్రార్థన
వరుసగా ‘ఐదు రోజులు’ సెలవులు రావడంతో- పిల్లలు ఊరెళ్లారు. పుస్తకాలు రంజింపజేయలేని ఒంటరితనం! ఈ ఆదివారపు నిరర్థకమైన పగటిపూటకు నన్ను అక్కున చేర్చుకోగలిగేవారెవరు? లక్కీగా అజయ్ ఖాళీగావున్నాడు. పైగా ఇలాంటి పిలుపుకోసమే ఎదురుచూస్తున్నాడు. ఇంకేం! ఇద్దరమూ అనంతగిరి వెళ్లిపోయాం.
వికారాబాద్ ఎర్రటినేలలు, కడిగినట్టున్న నల్లటి రోడ్లు, పచ్చటి ఆకులు, మసక మసక కొండల అంచులు, ఊయలలూగనిచ్చే గిల్లీ తీగలు, గుహను తొలిచిన మున్యాశ్రమం, కోనేటిపక్కన వాల్చిన నడుము, అడ్డంగా పరుగెత్తిన ముంగిస, సాగినంత నడక, పీల్చుకోగలిగినంత గాలి, వర్షం పడీపడనట్టున్న సుతిమెత్తటి వాతావరణం... మేము ఆశించినదానికంటే దొరికింది చాలా ఎక్కువ!
దానికి ‘కృతజ్ఞతగా’ మెట్లు ఎక్కీ దిగీ ఆలయంలోకి వెళ్లాం. సన్నని ద్వారంగుండా దిగువకు, లోపలికి ప్రవేశించాం. పలుచటి జనంతో అనంతపద్మనాభ స్వామి!
పూజారి - మంత్రాలేవో చదువుతున్నాడు. ముందున్నవాళ్లు శ్రద్ధగా వింటున్నట్టున్నారు. నా పక్కనున్న అజయ్ దండం పెట్టుకోవడానికి చేతులు ముడుస్తున్నాడు. అయితే, దేవుడి దగ్గర తనకు అహం ఏమీలేదన్నమాట!
నేనేం చేయను? ఒకటేదో కోరుకోవాలి; నాకు సంబంధించినవాళ్లందరికీ శుభం కలగాలి.
రెండు నిమిషాలు(!) కళ్లు మూసుకున్నాను. అమ్మ, బాపు, తమ్ముడు, పిల్లలు, చెల్లి, వాళ్ల పిల్లలు- వారిని పట్టించే ఆహార్యాలతో నా లోపల కదలాడారు. బంధువులు- మేనత్తలు, మామయ్యలు, వాళ్ల కుటుంబం, మా అత్తవాళ్లు, వదినలు... మా ఆఫీసు సహచరులు- ఎం, వై, 1, 2, 3, 4, 5... అక్క, బావ... ఐదో తరగతి దోస్తులు- రా, బా, ఎ, కె... ఆ వీళ్లు- నీ, పు, అ, కి... టెన్తు ఫ్రెండ్సు- శి, ప్ర, క్రా, సు, సా... డిగ్రీ, పాతాఫీస్, అక్కడ, అరే ఇటు, అటు... స్థలాన్ని దాటి కాలపు వేగంతో పేర్లు నాకు తగులుతూవున్నాయి. రా, సం, కు, మ, శ్రీ, భ... పేరునుంచి మరో పేరుకూ, ఊరినుంచి మరో ఊరికీ, పట్నం నుంచి నగరానికీ స్మరణ దూకుతూవుంది. ఇంకా ఎవరు? ఎల్, జె, బి, పి, ఎస్... ఇంకా ఎవర్ని మిస్సయ్యాను! నిజంగా నేను కోరుకోవడం వల్లే వాళ్లందరికీ మంచి జరిగేట్టయితే, నేను వాళ్లపేరు తలుచుకోకపోవడం న్యాయం కాదు కదా!
పేర్లను తలుచుకుంటున్నప్పుడు కూడా కాలాన్ని లెక్కగట్టడం ఆపలేదు. రెణ్నిమిషాల అంచనాతో కళ్లు తెరిచాను. దేవుడు నన్ను సూటిగా చూస్తున్నట్టున్నాడు! ఇంకా ఎన్నో పేర్లు స్ఫురిస్తున్నాయి. మామూలుగా రోజూ మాట్లాడేవాళ్లు ఇందాక గుర్తురాలేదు. డి, ఐ, జె, వి, బి, ఎన్... ఇంకా, వెళ్తున్నప్పుడు ఉప్పు రాసి జామకాయలమ్మిన ముసలాయన... మమ్మల్ని ఆటోలో అంతదాక మోసుకెళ్లిన అమ్జాద్... అక్కడే డిపార్టుమెంటులో పనిచేసే యాదగిరి... నేను కోరుకోవడం వల్లే మంచి జరిగేట్టయితే- ఏ ఒక్కరినీ వదలకూడదని కదా నా ఆలోచన!
నా స్మరణ ఎంత వేగంగా జరిగినప్పటికీ, కొన్ని పదులకొద్దీ పేర్లను తలచుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో పేర్లు నేను ఆ క్షణంలో మరిచిపోయాను. అలాంటిది, ఈ భూమ్మీది కోటానుకోట్ల మనుషుల్నీ, మనుషుల్నే కాకుండా సకల చరాచర జీవరాశుల్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? ఒకవేళ మరిచిపోతే? గుర్తుపెట్టుకుంటేగనక ఆయన కచ్చితంగా దేవుడే అయ్యుండాలి!
- పూడూరి రాజిరెడ్డి