బడికి సెలవు.. బతుకులో కూడా ..
బడికి సెలవు.. బతుకులో కూడా ..
Published Sat, Apr 22 2017 11:35 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
వేసవి సెలవులకు ఇంటికి వస్తూ మృత్యుఒడికి
రోడ్డు ప్రమాదంలో గిరిజన విద్యార్థి దుర్మరణం
బడికి సెలవులిచ్చేశారు.. ఇంటికెళ్లి అమ్మ చేతి వంట కడుపారా తిని, చెల్లితో సరదాగా ఆడుకోవాలి అనుకుంటూ ఆ బాలుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నాన్న వస్తాడా.. ఇంటికెళ్లిపోదామా అనుకుంటూ మనసునిండా ఆనందంతో ఉబ్బితబి్బబ్బవుతున్నాడు. నాన్న రానే వచ్చాడు..ఇంటికి బయలుదేరాడు.. ఇంతలో ప్రమాదం ఆ బాలుడిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లిపోయింది. ఈ విషాదకర ఘటన రాజవొమ్మంగి మండలం మర్రిపాలెం వద్ద శనివారం సంభవించింది. ఈ హృదయ విదారక ఘటన చూసిన వారిని కలచివేసింది.
– రాజవొమ్మంగి (రంపచోడవరం)
రాజవొమ్మంగి మండలం చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన గూడెం గణేశ్‌కుమార్ (13) అడ్డతీగల గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి వేసవి సెలవులు ఇవ్వడంతో కుమారుడిని తీసుకువచ్చేందుకు తండ్రి రాజబాబు పాఠశాలకు వెళ్లాడు. అదే సమయంలో తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి అతడి కుమారుడిని తీసుకెళ్లేందుకు అదే పాఠశాలకు వచ్చాడు. ‘ మా కుమారుడిని కూడా మీతో పాటు తీసుకెళ్లండి, నేను వెనకాల ఆటోలో వస్తానని రాజబాబు చెప్పాడు. ఆ వ్యక్తి అతడి కుమారుడితో పాటు గణేష్‌కుమార్‌ను కూడా మోటారు సైకిల్ ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. మర్రిపాలెం ప్రధాన రోడ్డు వద్దకు వచ్చేసరికి అక్కడ ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. తారుపరిచే యంత్రాన్ని తప్పించే క్రమంలో మోటారు సైకిల్ అదుపుతప్పింది. ముగ్గురూ కిందపడిపోయారు. మోటార్‌సైకిల్ వెనుక భాగంలో కూర్చున్న గణేష్‌కుమార్ తూలి తారుపరిచే యంత్రం దిగువన ఉండే ఇనుప కన్వేయర్ బెల్టు కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి యంత్రం బెల్ట్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్‌కుమార్ వస్తాడని ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లి కాసులమ్మతో పాటు చెల్లి లోవ, నానమ్మ, తాతయ్యలకు ప్రమాదం వార్త తెలియడంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఆ వెనుకనే వస్తున్న తండ్రి రాజబాబు కుమారుడి మృతదేహం వద్దకు చేరుకుని గుండెలవిసేలా రోదించాడు. మోటారు సైకిల్‌పై ఉన్న మరో విద్యార్థి శివశంకర్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు డీడీ సుజాత, ఎంపీడీవో కేఆర్ విజయ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు అడ్డతీగల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కోటం రవిలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జడ్డంగి హెచ్‌సీ రామకృష్ణ కేసు నమోదు
చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement