
ఇక యాప్‌తో ఉచితంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు
న్యూఢిల్లీ: ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతిలోపు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ఇక జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) పుస్తకాలను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్టడీ మెటీరియల్‌ను కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ డేటాబేస్‌ను సృష్టించడమే కాకుండా డౌన్‌లోడ్‌కు వీలుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే యాప్‌ను రూపొందించింది. స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఈ యాప్ ద్వారా కావాల్సిన పుస్తకాన్ని లేదా పాఠ్యాంశాన్ని, స్టడీ మెటీరియల్‌ను (ఇంగ్లీషు లేదా హిందీ భాషల్లో) డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా, ఇదే ప్లాట్‌ఫామ్‌పై విద్యార్థులు ఓ బృందంగా ఏర్పడి సబ్జెక్ట్ గురించి, అందులోని డౌట్స్ గురించి చర్చించే అవకాశం కూడా ఉంది.
ఈ యాప్‌ను జూన్ రెండో వారం నుంచి అందుబాటులోని తెస్తున్నట్టు ఎన్‌సీఈఆర్‌టీ యాక్టింగ్ డెరైక్టర్ వినోద్ కుమార్ త్రిపాఠి శనివారం మీడియాకు తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు, ట్యూషన్లకు వెళ్లి చదువుకోలేని పేద విద్యార్థులకు, టీచర్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఉపయోగించకుండా ఇతర పుస్తకాలను ఉపయోగిస్తున్న పాఠశాలలను దృష్టిలో పెట్టుకొని కూడా తాము మరో డేటాబేస్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఆ పాఠశాలలు ఉపయోగిస్తున్న పుస్తకాలను, పాఠ్యాంశాలను డేటాబేస్‌లోకి ఎక్కిస్తున్నామని త్రిపాఠి తెలిపారు. ఈ కార్యక్రమం కూడా జూన్ రెండోవారంలోగా పూర్తవుతుందని, ఇదే యాప్‌ను ఉపయోగించి జూన్ మూడవ వారం నుంచి ఆ పుస్తకాలను కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఈ యాప్ ద్వారా భాష, తరగతి, సబ్జెక్ట్, టాపిక్, చాప్టర్లను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉందని ఆయన చెప్పారు. ఇలస్ట్రేషన్లు, డయాగ్రామ్స్‌తో ఎప్పటికప్పుడు తాము డేటాబేస్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.