
పుస్తకం ఒక ఊహాచిత్రం. చదివేవారి ఊహాశక్తిని బట్టిఎన్ని ఊహలో అన్ని సినిమాలు.. ఒక్క పుస్తకంలో. మనలో ఉన్న సృజనకు కారణం ఊహే. అక్షరాలు చదువుతుంటేమనసు తెరమీద బొమ్మలు ఆడుతుంటాయి. ఇప్పుడు ఎవరూ చదవటం లేదు కదా! రండి.. పుస్తకాలు చూద్దాం.
కాలింగ్ సెహ్‌మత్
ప్రమాదమని తెలిసినా జీవితాన్ని పణంగా పెట్టి శత్రుదేశం వెళ్లింది ఓ దేశభక్తురాలు. ఆ దేశం డిఫెన్స్ ఆఫీసర్‌ను వివాహం చేసుకుంది. అక్కడి నుంచి రహస్యాలను భారతదేశం పంపింది. ఈ పాయింట్‌తో 1971 ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనంతో రూపొందిన సినిమా ‘రాజీ’. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ముఖ్యపాత్రను ఆలియా భట్ పోషించారు. ఈ సినిమా హరీందర్ సిక్కా రాసిన ‘కాలింగ్ సెహ్‌మత్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. ఓ కాశ్మీరి యువతి యదార్థ గాథ ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారట సిక్కా. ఈ శుక్రవారం ‘రాజీ’ విడుదలైంది.
జోయా ఫ్యాక్టర్
అమ్మాయితో బ్రేక్‌ఫాస్ట్ చేసే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తే లక్‌తో లక్కీగా ఓటమి నుండి తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాడు ఓ క్రికెటర్. ఆ సెంటిమెంట్‌తో రెండు మూడు సార్లు గెలిచాడు కూడా. కానీ బ్రేక్‌ఫాస్ట్ వ్యవహారం బెడిసి కొట్టింది. నెక్ట్స్ ఏంటీ అంటే.. నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సిందే. దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ తొలిసారి జంటగా అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘జోయా ఫ్యాక్టర్’. క్రికెటర్ నిఖిల్ ఖుడా జోయా సింగ్ సోలంకీ అనే నిజ జీవిత పాత్రల ఆధారంగా రచయిత్రి అనూజా చౌహాన్ పదేళ్ల కిత్రం ‘జోయా ఫ్యాక్టర్’ పుస్తకం రాశారు. దాని ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
థగ్స్ ఆఫ్ హిందోస్తాన్
దయదాక్షిణ్యాలు ఉండవు దోపీడీదారులకు. వాళ్లకు కావాల్సిన దానికోసం ప్రజల ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడరు. 19వ శతకంలో ఫిలిప్ మేడో టైలర్స్ అనే బ్రిటిష్ రచయిత భారతదేశంలోని ధగ్గులు అనే బందిపోట్ల గురించి ‘థగ్గి’ కల్చర్ పై అనే ‘ద కన్ఫెషన్ ఆఫ్ ఎ థగ్’ పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఎంత ప్రాచుర్యం పొందిందంటే అప్పట్లో క్వీన్ విక్టోరియా ఆ పుస్తకం గురించి తెలుసుకున్నారట. ఈ పుస్తకం ఆధారంగా రూపొందుతున్న సినిమాయే ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది నవంబర్‌లో రిలీజ్ కానుంది.
ఇందిర– మోస్ట్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్
ఒక శక్తివంతమైన మహిళగా ఇందిరా గాంధీ భారత రాజకీయాల్లో ఎంత క్రియాశీలకంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. దేశ ప్రధానిగా రాజకీయాల్లో ఇందిరాగాంధీ తనదైన ముద్రను వేశారు. ఆమె జీవితం ఆధారంగా అనేక పుస్తకాలు వచ్చినా పాత్రికేయురాలు సాగరిక ఘోష్ రాసిన ‘ఇందిర: ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్’ ఎక్కువ మందిని ఆకర్షించింది. ఇప్పుడా పుస్తకం రైట్స్‌ను బాలీవుడ్ నటి విద్యాబాలన్ సొంతం చేసుకున్నారట. ‘ఇందిరా గాంధీ పాత్రలో నటించాలన్న ఇంట్రెస్ట్ నాకు ఉంది. ఈ రోల్ చేయడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను’ అని ఈ మధ్య ఓ సందర్భంలో విద్యాబాలన్ అన్నారు. కనుక ఇందిరాగాంధీని తెర మీద చూసే రోజులు త్వరలోనే రానున్నాయన్న మాట.
ద గాళ్ ఆన్ ది ట్రైన్
ట్రైన్‌లో విండో సీట్ దొరికితే ఫుల్ హ్యాపీ. జర్నీని ఎంజాయ్ చేయొచ్చు అనే ఊహతోనే ట్రైన్ ఎక్కింది ఓ అమ్మాయి. కానీ ఓ దంపతులను చూసి సమస్యలో పడింది. ఎందుకంటే ఆ అమ్మాయి చూసిన భార్యాభర్తల్లో ఒకరు మిస్సింగ్. నెక్ట్స్ ఏంటీ? పౌలా హాకిన్ రాసిన ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ నవల ఉత్కంఠగా ఉంటుంది. ఈ ఉత్కంఠను సిల్వర్ స్క్రీన్‌పై హిందీలో చూడాలంటే కొంతటైమ్ పడుతుంది. ఈ పుస్తకం ఆధారంగా రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టైటిల్ రోల్లో ఓ సినిమా రూపొందనుంది. అయితే ఇదే కాన్సెప్ట్ ఆధారంగా హాలీవుడ్‌లో రూపొందిన సినిమా రెండేళ్ల కిత్రం విడుదలైంది.
ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్‌లాడెన్
ఒసామా బిన్‌లాడెన్.. ఉగ్రవాద ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. 2001లో సెప్టెంబర్ 11న జరిగిన యూఎస్ ఎటాక్స్‌కు ఒసామా బిన్‌లాడెన్ కారకుడని ప్రపంచం కోడై కూసింది. అమెరికా ప్రభుత్వం కూడా లాడెన్‌ను మట్టుబెట్టాలని అనేక ప్లాన్స్ వేసింది. ఆ మధ్య బిన్‌లాడెన్ హతమయ్యాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బిన్‌లాడెన్‌పై ఆండ్రియన్ లెవీ ఖ్యాతీ స్కాట్‌క్లార్క్స్ రాసిన పుస్తకం ‘‘ది ఎక్సైల్: ది ఫ్లైట్ ఆఫ్ ఒసామా బిన్‌లాడెన్’’. ఈ పుస్తకం ఆధారంగా ఓ సినిమా రూపొందనుంది. ఈ బుక్ రైట్స్‌ను జంగిల్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. విశాల్ భరద్వాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని టాక్.
ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్
ప్రేమికులిద్దరూ క్యాన్సర్ పేషెంట్స్. గుర్తొచ్చింది కదూ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమా. ఈ సినిమాకు రీమేక్ కాదట కానీ.. బీటౌన్‌లో ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్‌తో ఓ సినిమా రూపొందనుంది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, సంజనా సంఘీ జంటగా నటించనున్నారు. ముఖేష్ చబ్రా దర్శకుడు. జాన్‌గ్రీన్స్ రాసిన రొమాంటిక్ డ్రామా ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జోష్ భూన్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ మూవీ ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’కు రీమేక్ ఇది.
సీరియస్ మెన్
తన కొడుకు గొప్ప ప్రయోజకుడు కావాలని తండ్రి కలలు కనడంలో తప్పు లేదు. కానీ తన కొడుకును గొప్ప తెలివైనవాడిగా అందరికీ చెప్పుకున్నాడు ఓ క్లర్క్. కానీ వాళ్ల అబ్బాయి అంత ప్రతిభావంతుడేం కాదట. మరి.. ఆ పరిస్థితులను ఆ పదేళ్ల అబ్బాయి ఎలా ఫేస్ చేసాడు? ఇలాంటి ఆసక్తికర అంశాల ఆధారంగా జర్నలిస్ట్ మను జోసెఫ్ రాసిన పుస్తకం ‘సిరీయస్ మెన్’. మరో జర్నలిస్ట్–నిర్మాత సెజల్ షా ఈ పుస్తక హక్కులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగా సినిమాను తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని బీటౌన్ టాక్.
టిక్లీ అండ్ లక్ష్మీబాంబ్
పరిస్థితుల ప్రభావం వల్ల ఇద్దరు మహిళలు సెక్స్ వర్కర్స్‌గా మారాల్సి వచ్చింది. దళారుల ధనదాహానికి దేహం బలి అవుతున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. అందుకే సొంతంగా వారే బిజినెస్ చేద్దాం అనుకున్నారు. తర్వాత ఏమైందనేది కథ. ‘టిక్లీ అండ్ లక్ష్మిబాంబ్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. చిత్రాంగద, సుచిత్రా పిళ్లై, ఉపేంద్ర లిమె, సహర్ష్ కుమార్ శుక్లా నటించనున్నారు. ఈ సినిమాతో ఆదిత్యా కృప్‌లానీ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ద కన్ఫెషన్ ఆఫ్ సుల్తానా డాకు
యునైటెడ్ ప్రావిన్స్ (ఇప్పటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాంఖడ్)ను గజగజలాడించాడు ఓ బందిపోటు సుల్తానా డాకు. తుదకు బ్రిటిస్ ఆఫీసర్లకు పట్టుబడి ఉరిశిక్ష అనుభవించాడు. తొమ్మిదేళ్ల కిత్రం సుజిత్ సారాఫ్ రాసిన నవల ‘ద కన్ఫెషన్ ఆఫ్ సుల్తానా డాకు’లో ఈ బందిపోటు గురించి లోకానికి తెలియచేసింది. దాని ఆధారంగా ముధురిత ఆనంద్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. రణ్‌దీప్ హుడా నటిస్తున్నారు.
ఆర్యావతార క్రానికల్ సిరీస్
అమరత్వం గోవింద, కౌరవ, కురుక్షేత్ర.. ఈ మూడు భాగాలను కలిపి ఆర్యావతార క్రానికల్ సిరీస్‌గా రిలీజ్ చేశారు రచయిత కృష్ణ ఉదయశంకర్. వారియర్ అశ్వద్ధామ జీవితం ఆధారంగా ఈ పుస్తకం కథనం ఉంటుంది. ఈ పుస్తకం హక్కులను హిందీ నిర్మాణ సంస్థ పాంథమ్ ఫిలిమ్స్ సొంతం చేసుకుంది. త్వరలో ఈ హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. అలాగే ఇండో–అమెరికన్ రచయిత కరణ్ బజాజ్స్ బుక్ ‘జానీ గాన్ డౌన్’ పుస్తకం ఆధారంగా కూడా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందనుందని టాక్. బుక్స్ ఆధారంగా తెరకెక్కే చిత్రాలు ఇప్పటికే కొన్ని సెట్స్‌పైకి వెళ్లాయి మరికొన్ని ఆన్ ద వేలో ఉన్నాయి. ఇంకొన్ని చర్చల్లో ఉన్నాయి. మరి.. ముందు ముందు ఇంకెన్ని పుస్తకాలు సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తాయో వెయిట్ అండ్ సీ.
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్
దేశప్రధానిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలను నిర్వర్తించినప్పుడు కొందరు మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ఆయన పదవీకాలం ముగిసిన చాన్నాళ్ల తర్వాత ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడని మరికొందరు అర్థం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుగా ఉన్న సంజయ్ బారు రాసిన ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ పుస్తకం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా బాలీవుడ్‌లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రాన్ని విజయ్ గెట్టే తెరకెక్కిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పాత్రలో అనుపమ్‌ఖేర్ నటిస్తున్నారు. డిసెంబర్‌లో రిలీజ్.