బాలీవుడ్‌ ‘నమో’ స్మరణ! | Bollywood Campaigned for Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ ‘నమో’ స్మరణ!

Published Sun, Mar 31 2019 5:28 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Bollywood Campaigned for Prime Minister Narendra Modi - Sakshi

సినీ రంగంలో రాజకీయ నాయకుల జీవిత చిత్రాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇదే పరంపరలో ప్రధాని మోదీ బయోపిక్‌లు నిర్మితమయ్యాయి. ఎన్నికల వేళ మోదీ పట్ల బాలీవుడ్‌ ఇలా తన విధేయత చాటుతూ అనధికార ప్రచారం చేస్తోందని వినిపిస్తోంది. ఈ ఏడాది తొలినాళ్లలో మోదీతో బాలీవుడ్‌ ప్రముఖులు సమావేశమై జాతి నిర్మాణంలో సినిమాల పాత్రపై చర్చలు జరిపిన తరువాత బాలీవుడ్‌–మోదీ బంధం మరింత బలపడిందని భావిస్తున్నారు.

ఆ మరసటి రోజే ‘ఉడీ: సర్జికల్‌ స్ట్రైక్స్‌’ అనే చిత్రం విడుదలైంది. ఇందులో రంజిత్‌ కపూర్‌ మోదీ పాత్రలో కనిపించారు. అదే రోజున మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆత్మకథతో వచ్చిన ‘యాక్సిడెంటల్‌ ప్రైమ్‌మినిస్టర్‌’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికల క్రతువు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రధాని క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్న కొన్ని చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల విశేషాలు..  

పీఎం నరేంద్ర మోదీ
వివేక్‌ ఒబెరాయ్‌ బాలీవుడ్‌ సినిమాలో సోలో హీరోగా నటించి 5 ఏళ్లు పూర్తయింది. అప్పటి నుంచి దక్షిణాది పరిశ్రమపై దృష్టిపెట్టి సహాయ లేదా విలన్‌ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రంతో మళ్లీ బాలీవుడ్‌లో కథానాయకుడిగా తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ అయిన ఆయన తండ్రే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి మోదీకి అభిమాని అయిన ఒబెరాయ్‌ 2014 ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏప్రిల్‌ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలున్నాయి.

మోదీ– ఏ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌
‘నియంతలకు మతాలు లేవు. కనీసం మృతులనైనా హిందూ, ముస్లింలని వేరుచేయకండి’..మంటల్లో రైలు బోగి దగ్ధమవుతున్న(2002 నాటి గోద్రా అల్లర్లు ప్రస్తావిస్తూ) సమయంలో మోదీ పాత్రధారి ఆశిష్‌ శర్మ ట్రైలర్‌లో అన్న మాటలివి. ఈ వెబ్‌ సిరీస్‌ వచ్చే నెలలో ఈరోస్‌ నౌలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. బాల్యంలో టీ విక్రేతగా పనిచేయడం, ఇందిరా గాంధీని వ్యతిరేకించడం, పాకిస్తాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం లాంటి మోదీ గుణాలన్నింటిని చూపాలంటే ఈ సిరీస్‌ను కనీసం పది భాగాల పాటు కొనసాగించాలని నిర్మాతలు భావిస్తున్నారు.  

మోదీ కాకా కా గావ్‌
మోదీ మానసపుత్రికలైన స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్, డిజిటల్‌ ఇండియా, సర్జికల్‌ దాడులు, పెద్దనోట్ల రద్దు లాంటి వాటిని ఈ చిత్రంలో ప్రధానంగా ప్రస్తావించారు. 2017, డిసెంబర్‌ 8న గుజరాత్‌ ఎన్నికలకు ఒకరోజు ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదే ఏడాది డిసెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  
– సాక్షి నేషనల్‌ డెస్క్‌
నమో సౌనె గామో
గుజరాతీలో తీసిన ఈ చిత్రం 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడుదలైంది. గుజరాత్, ముంబైలలో ఒకరోజు ఆడిన తరువాత ఎన్నికల సంఘం చిత్ర ప్రదర్శనను నిలిపేసింది. నరేంద్ర మోదీకి సంబంధించి ఈ చిత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదని నిర్మాతలు వాదించినా సినిమా పేరు, హీరో పాత్ర తదితరాలు అసలు విషయమేంటో స్పష్టం చేశాయి. ఈ మార్చిలో సినిమాను తిరిగి విడుదల చేయాలనుకున్నా సాధ్యం కాలేదు.

– సాక్షి నేషనల్‌ డెస్క్‌


– సాక్షి నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement