వెంగాపురంలో ఒకటో తరగతిలో ఉన్న ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు
విజయనగరం, బలిజిపేట: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య కొత్త కుండలో పాత నీరు అన్నచందంగా మారింది. విద్యా సంవత్సరం ఆరంభంలో బీరాలు పలికిన విద్యాశాఖ వాటి అమలులో కొత్తదనం చూపించలేకపోవడంతో ఆకట్టుకోలేకపోయింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ముందుగా ఏయే పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తారన్న వివరాలు సేకరించి ప్రయోగాత్మకంగా ఇంగ్లిష్ మీడియం విద్య ప్రారంభించినా అనుకున్న లక్ష్యం నేరవేరడం లేదు.
ఇంగ్లిష్ మీడియం ప్రారంభించినప్పటికీ కొత్త ఉపాధ్యాయులను నియమించలేదు సరికదా.. ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వలేదు. దీంతో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్య అందకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తామన్న పాలకులు, అధికారుల హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి మూడు నెలలు గడిచిపోతున్నా కనీసం 1వ తరగతికి అవసమైన పాఠ్య పుస్తకాలు అందించలేకపోయారు. అలాగే ఉపాధ్యాయులను కూడా నియమించలేకపోయారు. ఎటువంటి కొత్తదనం ప్రణాళికలు లేకుండా ఆచరణలోకి దిగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పటిష్ఠపరిచేందుకు కృషి..
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాం. దీనిని నిరంతరం కొనసాగిస్తాం. బాలారిష్టాలను తొలగించి పటిష్ఠపరిచేందుకు కృషి చేస్తున్నాం.
– శ్రీనివాసరావు, ఎంఈఓ, బలిజిపేట.
Comments
Please login to add a commentAdd a comment