అతను ఓ యువకుడు. ఆ నోటా ఈ నోటా విని ఆ గురువుగారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడే ఉండి వైరాగ్యం, సన్న్యాసం గురించి తెలుసుకోవాలనుకున్నాడు యువకుడు. కానీ ఆ గురువుగారు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు. శిష్యుడు ఏదైతే తెలుసుకోవాలనుకున్నాడో అది తప్ప మిగిలినవి చెప్పసాగారు గురువుగారు. ఆయన చెప్పే విషయాలు అతనిని ఏమాత్రం ఆకట్టుకోలేదు. అవి అంత ప్రాధాన్యమైనవిగా కూడా అనిపించలేదు. దాంతో శిష్యుడికి గురువుగారి మీద ఒకింత కోపమొచ్చింది. నిరాశానిస్పృహలూ కలిగాయి. అప్పటికీ కొంత కాలం ఉండి ఇక లాభం లేదనుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు.
కానీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఓ సంఘటన జరిగింది. ఆ తర్వాత అతను అక్కడినుంచి వెళ్ళనే లేదు. ఇంతకూ ఆ రోజు జరిగిన సంఘటన ఏమిటో చూద్దాం...
ఆ రోజు మరొక యువకుడు ఆ గురువుగారి దగ్గరకు వచ్చాడు. అతను ఓ సాధువు. అక్కడున్న వారికి తన గురించి పరిచయం చేసుకున్న ఆ కొత్త సాధువు అందరితోనూ అవీ ఇవీ మాట్లాడుతూ వారి మాటలు వింటూ కొత్త కొత్త విషయాలను ఆసక్తికరంగా చెప్పసాగాడు. ఆధ్యాత్మిక అంశాలపై కనీసం రెండు గంటలపాటు ఆ యువసాధువు మాట్లాడాడు. అందరూ గుడ్లప్పగించి విన్నారు. గురువుగారు కళ్ళు మూసుకుని ఆ యువకుడి మాటలను వినసాగారు. అప్పటికే అక్కడున్న పాత శిష్యుడు ఆ కొత్త సాధువు మాటలు విని తానింతకాలమూ ఆశించింది ఇటువంటి విషయాలనే కదా అని మనసులో అనుకున్నాడు. గురువు అనే వాడు ఇలా ఉండాలని, ఆ కొత్త సాధువుతో వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకున్నాడు.
అక్కడున్న వారందరూ అతని మాటలను ఎంతగానో మెచ్చుకున్నారు. తమకున్న సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఓ రెండు గంటల తర్వాత ఆ కొత్త సాధువు తన ప్రసంగం ఎలా ఉందని గురువుగారిని అడిగాడు ఒకింత గర్వంతో. గురువుగారు కళ్ళు తెరచి ‘‘నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు... నేను రెండు గంటలుగా చూస్తున్నాను. నువ్వేం మాట్లాడావు...’’ అని అన్నారు.‘‘అదేంటీ అలా అంటారు... అలాగైతే ఇప్పటి వరకూ మాట్లాడిందెవరని అనుకుంటున్నారు...’’ అని కొత్త సాధువు ప్రశ్నించాడు. ‘‘శాస్త్రాలు మాట్లాడాయి... నువ్వు చదువుకున్న పుస్తకాలు మాట్లాడాయి... నువ్వు నీ స్వీయానుభవం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు... అటువంటప్పుడు నీ ప్రసంగంపై నా అభిప్రాయం ఏం చెప్పగలను?’’ అని గురువుగారు ప్రశ్నించారు. ఎప్పటికైనా స్వీయానుభవమే నిజమైనది. దోహదపడేది కూడానూ. – యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment