అనుక్షణికం (వడ్డెర చండీదాస్)
ఆత్మన్యూనతా భావంతో కొట్టుమిట్టాడుతున్న నన్ను శ్రీపతి, గంగినేని రవి, మోహన్‌రెడ్డి, గాయత్రి, స్వప్నరాగలీన పాత్రలు సేదతీర్చాయని చెప్పడానికి సిగ్గుపడను. రచయిత ఎక్కడా కనబడకుండా పాత్రలతో పలికించిన అనేక భావాలు, ఆ వెల్లడించిన తీరు జీవితంలో నాకెంతో ధైర్యాన్నీ, సంఘం మీద ఒక అవగాహననూ ఇచ్చాయి. అందుకే చండీదాస్ మీద కృతజ్ఞతగా నా కుమార్తె పేరు ‘హిమజ్వాల’ అని పెట్టుకున్నాను.
చివరకు మిగిలేది(బుచ్చిబాబు)
‘‘చివరకు మిగిలేది’ చదివే నేను డిగ్రీలోనూ, పీజీలోనూ ఫిలాసఫీ చదివాను’ అంటాడు చండీదాస్. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే రేడియోలో విన్నట్లు గుర్తు. తర్వాత రెండేళ్లకు పుస్తకంగానూ చదివాను. ఏదో తెలియని బాధ, అశాంతి, ఒక రకమైన వేదన అనుభవించాను. ఆ తర్వాత ఎన్నోసార్లు చదివాను. ఆ గాఢత తగ్గింది లేదు. ఇప్పటికీ మొదలుపెడితే ఆపలేను. దయానిధి, అమృతం, కోమలి కళ్లెదురుగా కదలాడుతున్నట్లే వుంటుంది.
పథేర్ పాంచాలి (బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ)
పశ్చిమ బెంగాల్‌లోని ఒక పల్లెలో ఆ పేద బ్రాహ్మణ కుటుంబం, కట్టెలా వుండే ఆ ముసలమ్మ, ఆ ఇల్లాలు బిడ్డలకు ఆహారం పెట్టడానికి పడే తపన, వంట సామగ్రిని విధిలేక విక్రయించడం, అక్క దుర్గ, తమ్ముడు అపు కొత్తగా వచ్చే రైలును వింతగా చూడటం, ఆ ఇంటి యజమాని ఎక్కడో వైదికం చేసుకుంటూ ఇంటికి వచ్చి కూతురి కోసం వెతకడం, భార్య ‘ఇంకెక్కడి కూతురు... జ్వరంతో కాలంచేసిం’దని పొగిలి పొగిలి ఏడవడం, చివరికి వారు ఆ వూరు విడిచి వెళ్లిపోవడంతో క«థ ముగిసేటప్పటికి గుండె బరువెక్కి ఓ పదిరోజులు బ్రతుకు భారంగా గడిచింది.
అన్నా కరేనినా (లియో టాల్‌స్టాయ్)
ప్రపంచ సాహిత్యంలో టాల్‌స్టాయ్ ఎంత గొప్ప రచయితో ‘వార్ అండ్ పీస్’ చదివిన వాళ్లకు తెలుసు. కాని ఒక జీవితం, ఒక సంసారం, ఒక సమాజం అంటే ఏమిటో నాకు తెలియజెప్పిన నవల మాత్రం ‘అన్నా కరేనినా’. ఇంటర్మీడియెట్‌లో ఉన్నప్పుడే పెద్దగా ఇంగ్లిష్ రాకపోయినా నిఘంటువు పక్కన పెట్టుకుని చదివాను. అన్నాను పీటర్స్‌బర్గ్ స్టేషన్‌లో చూసింది మొదలు వ్రోన్‌స్కీ పడే తపన ఆ తర్వాత జరిగిన కథ ఎంతో పరిణతితో రాశాడు రచయిత. అన్నా కళ్ళలో ఆ గ్రేస్‌నెస్, ఆ సౌందర్యంలో వుండే నిగూఢమైన ఆకర్షణ, ఆ వివరించిన పద్ధతి అనితర సాధ్యం.
చిత్రసుందరి (అఖిలన్)
ఈ తమిళ నవలను మధురాంతకం రాజారాం అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. అన్నామలై మేనమామ సహాయంతో చదువుకొని, తన ఇష్టాలను కాదనుకొని, కోర్కెలతో అర్రులుచాచే మేనమామ కుమార్తె సుందరిని పెళ్ళాడి, ఆమె అనుమానాలు సాధింపులు పట్టింపులు భరించలేక క్రుంగిపోతాడు. అతడి మీద కసితీర్చుకోవాలని సుందరి ఆత్మహత్యతో అంతమౌతుంది. అన్నా కరేనినాకూ చిత్రసుందరికీ పోలికలున్నాయని అనిపిస్తుంది.
డి.రామచంద్రరాజు
9908324214