మా వూళ్లో వొక నది వుంది. దాని పేరు పాపాఘ్ని. నదిని చూస్తూ వుండిపోవడమంటే నాకిష్టం అది నిండినా సరే, ఎండినా సరే! ఇసుకలో ఎగిరెగిరి ఆడుకుంటూ ఉన్నప్పుడు చనిపోయిన శవాన్ని పాడెగా మోసుకుంటూ యేట్లోకి వస్తున్నవాళ్లని చూసి భయంభయంగా కంపచెట్ల వెనుక దాక్కోవడం గుర్తు. ఇష్టంకు భయంకు మధ్య యేరు. ఎంతవాడైనా చేరాల్సిన చివరి మజిలి యేరే కదా! వేంపల్లిలో పాపాఘ్ని నదికి ఆనుకొని ఎత్తయిన కొండపైన కొలువైన ‘ఎద్దుల కొండ్రాయుడు’ మా ఇంటి దేవుడు. గుట్టపైనుంచి నదిని చూస్తే దాని వొంపు సొంపులన్నీ పచ్చటి వరిపైర్లతో కలిసి దివ్యలోక అనుభూతి కల్గుతుంది. పావురాళ్లగుట్ట దగ్గర బ్రిడ్జి దాటుకున్న తర్వాత గండి వీరాంజనేయస్వామిని దర్శించుకుంటే - అక్కడి బండరాళ్లు రాసుకునేవాళ్లకు రామాయణం అంత కత చెప్తాయి. కుడివైపు కొండల మోట్లో బైరాగుల తత్వాలు, సిద్ధుల మంత్రాలు, సన్యాసుల మృత్యు నిరీక్షణ జీవితం నేర్పిస్తాయి.
కురూపిగా కనరిల్లుతున్న వాళ్ల పాపాలు పోగొట్టి పవిత్రులుగా చేయగలిగిన యేరుగా పాపాఘ్ని (పాపాలు+అగ్ని)కి పేరు. ఎన్నో పాపాలు చేసి కురూపిగా మారిన ఒక రాజు ఇక్కడ తపస్సు చేయగా అతడి శాపాన్ని పోగొట్టి విముక్తం ప్రసాదించిన నదిగా ఒక ఐతిహ్యం. నంది కొండల్లో పుట్టి పెన్నా నదికి ఉపనదిగా మారుతూ కమలాపురం వద్ద దానితో జత కలుస్తుంది. మార్గ మధ్యంలో చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని దారుల వెంట ప్రయాణిస్తుంది. ఎంతో జీవాన్ని నింపి, జీవితాన్ని పండిస్తుంది.
నది దారెంబడి నాగరికతతో పాటూ ఇప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని రికార్డు చేయడం కోసం ఈ 30 కథలు రాశాను. ప్రొక్లెయినర్‌తో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించుకొని కాంక్రీటు రాజ్యాల నిర్మాణం జరుగుతోంది. కరువు మేఘాలు కమ్ముకున్న నేల ఎలా వుంటుందో చెప్పడానికి ఈ కథలు రాశాను. కడప మాండలికాన్ని విస్తృత స్థాయిలో ఆవిష్కరించాలనే నా ప్రయత్నం ఇలా సాకారమైంది.
- డాక్టర్ వేంపల్లి గంగాధర్
ఫోన్: 9440074893
ఎందుకు రాశానంటే?
పాపాఘ్ని కథలు; పేజీలు: 152; వెల: 110, ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్,
బండ్లగూడ(నాగోల్), జి.ఎస్.ఐ. పోస్టు, హైదరాబాద్-68; ఫోన్: 24224458
- వేంపల్లి గంగాధర్
కూలీలకే వీరస్వర్గం
- కళింగ నానీలు
కళింగ యుద్ధం
పద్మనాభ యుద్ధం
బొబ్బిలి యుద్ధం
కూలీలకే వీరస్వర్గం
కరిగి నీరవుతోంది
యారాడ కొండ
శ్రీశ్రీ లేడన్న చింత
భలే చిత్రం
మానవజీవితం
కర్రమంచం నుంచి
కర్రలమంచం మీదికి
భూమి బల్లపరుపే
పతంజలి పోయినా
గోపాత్రుళ్లు పోలేదు
- డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు
ఫోన్: 8187897201
అచ్చతెలుగు అన్నమయ్య
అన్నమయ్య సంకీర్తనల్లోని అచ్చతెలుగును తెలియజెప్పే పుస్తకం ‘అన్నమయ్య అచ్చతెలుగు’ (పేజీలు: 152; వెల: 80). క్షీరాన్నాన్ని పాలకూడు అంటాడు అన్నమయ్య. శుభవార్తను మేలుసుద్ది చేస్తాడు. ప్రతిబింబాన్ని నీడరూపుగానూ, శూరుడిని పోటుబంటుగానూ వ్యవహరిస్తాడు. డబుల్ బెడ్‌ను జమిలి పాన్పు చేస్తాడు. అగ్రిమెంట్‌ను బాసపత్రిక అని రాస్తాడు.
‘ఒకవైపు ప్రబంధ కవులు సంస్కృత బహుళమైన దీర్ఘసమాస రచనను ఆదరిస్తూ రచనలు చేస్తున్న కాలంలో ధైర్యంతో అచ్చ తెలుగుకూ, మాండలికానికీ, వ్యావహారానికీ పట్టంకట్టి తన సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన మహానుభావుడు అన్నమయ్య’. అలాంటి అన్నమయ్య సంకీర్తనల్లోని అచ్చతెలుగు మాటలను ఒక చోట కూర్చారు ఆచార్య రవ్వా శ్రీహరి, అన్నమయ్య సంకీర్తన వాఙ్ఞయ పదకోశానికి పని చేసిన అనుభవంతో. అదే అనుభవంతో అన్నమయ్య ఎన్ని రకాల చూపుల్నీ, ఎన్ని రకాల సిగ్గుల్నీ, ఎన్ని రకాల వలపుల్నీ వర్ణించాడో పట్టిక చేస్తూ ‘అన్నమయ్య నవ్వులు’(పేజీలు: 72; వెల: 40) గా మరో పుస్తకాన్నీ తెచ్చారు.
పలుచని నవ్వు, పాలవంటి నవ్వు, పున్నమ వెన్నెల నవ్వు, బింకపు నవ్వు, ముత్యపు నవ్వు, ముగ్గుల నవ్వు, నెయ్యపు నవ్వు, చిక్కటి నవ్వు, చిందేటి నవ్వు, కులుకు నవ్వు, కప్పురపు నవ్వు, పచ్చి నవ్వు, కమ్మటి నవ్వు... ఇట్లా ఆయా సందర్భాల్లోని భేదాన్ని ‘సుమారు 240 రకాలు’గా వర్ణించాడు అన్నమయ్య. అలాగే, తలపోత సిగ్గు, తెగరాని సిగ్గు, నాటకపు సిగ్గు, నినుపు సిగ్గు, లేత సిగ్గు, వాటపు సిగ్గు... అన్ని నవ్వులు, సిగ్గులు తెలియకపోయినా కనీసం ఎన్ని ఉండేవో తెలుసుకోవచ్చు ఈ చిరుపొత్తంతో (ప్రతులకు: నవోదయ పబ్లికేషన్స్, హైదరాబాద్; ఫోన్: 040-24652387)!
- శేషసాయి
పాపాఘ్ని కథలు
Published Sun, Jul 12 2015 4:24 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement