
నొప్పింపక తానొవ్వని పసిడి మనసులు
కాలక్రమంలో వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.
పుస్తక సమీక్ష
సమకాలీన సమాజంలోని అన్ని సమస్యాత్మకమైన కథావస్తువులను తనదైన శైలిలో ఆవిష్కరించి, అందులోని మంచిచెడులు పరిశీలించి, గుణగణాలు చర్చించి, నొప్పింపక తానొవ్వని పరిష్కారాల వైపు ముగించిన ఫీల్ గుడ్ కథలు – సి.ఎస్.రాంబాబు ‘పసిడి మనసులు’ సంపుటిలోని 20 కథలు. ఇతివృత్తం ఎలాంటిదైనా దానిని కథగా మలచి పాఠకుడితో ఆగకుండా చదివించగల కథన కౌశలం వీటి నిండా కనిపిస్తుంది.
కాలక్రమంలో వ్యవస్థలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు కొద్దిమందిని కలవరపరుస్తాయి. కొద్దిమంది కలతలు తీరుస్తాయి. మరికొద్దిమందికి కన్నీరు మిగులుస్తాయి. సరిగ్గా ఇక్కడే రచయిత తన హృదయాన్ని ఆవిష్కరిస్తాడు. కలతలు తీరిన వారిని అభినందిస్తూనే, కలవర పడే వారికి ధైర్యం చెబుతూ కన్నీరు తుడుస్తాడు. సమస్యలు అందరికీ ఎప్పుడూ ఉంటాయి, కానీ వాటిని పరిష్కరించుకోవడం వారి వారి ఆలోచనల మీద, వారి వారి చేతలలో వుంటుంది అని చెబుతుంటాయి, ఇందులోని ఆశావహ దృక్పథం కలిగిన పాత్రలు.
ఈ ఇరవై కథల్లోనూ మానవ సంబంధాలే ప్రధాన అంశం. తండ్రులూ కొడుకులూ (పితౄణం, తండ్రీ నిన్ను తలంచి), తల్లీ కొడుకులు, వృద్ధాశ్రమాలు (కాలధర్మం, నిర్ణయం,కోరిక), దయ, జాలి కలిగిన పరోపకారులు (కొత్త పరుగు, మౌనం మాట్లాడింది, ఇరుకు, సమిధలు, పసిడి మనసులు, విశాలాక్షి), సర్దుకు పోయే జీవిత భాగస్వాములు, ఒక మంచిమాటతో మారిపోయే మంచి మనుషులు ఈ కథలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. ఇవి ప్రధానంగా పట్టణ, నగర మధ్యతరగతి విద్యావంతుల కుటుంబాలలో వస్తున్న మార్పులను, మారుతున్న కాలంతోపాటూ మారే ఆలోచనా విధానాలను, తరాల మధ్య అంతరాలను, అందులోని వైరుధ్యాలను, వాటివల్ల కలిగే మానసిక సంఘర్షణను చిత్రీకరించిన కథలు.
కొత్త పరుగు, అబూమియా, తూరుపు పొద్దు, ఫిడేలు రాగాలు, స్వప్నగీత, ఋణానుబంధం కొంత వైవిధ్యమైన కథలు. మనుషుల్లోని కీర్తి కాంక్షను మంచిపని కోసం ఉపయోగించి విన్ –విన్ సిట్యుయేషన్‌ను సాధించడమే ‘కొత్త పరుగు’. ‘స్వప్నగీత’లో ఒక ఎన్‌ఆర్‌ఐ తన ఊరికోసం ఏదైనా చేయాలి అని పరివర్తన చెందడం ప్రధానం కాగా, ‘ఋణానుబంధం’ యాజమాన్యాల లాభాపేక్ష నిర్ణయాలకు బలైపోయిన కార్మికుని కథ. హైదరాబాద్ లోని మతసామరస్యాన్ని బలపరిచే కథ ‘అబూమియా’.
తన సంగీతం కొడుక్కి రాలేదని ‘ఫిడేలు రాగాల’ తండ్రి బాధ పడితే, తన ఇంగ్లీష్ పిచ్చి వల్లే కొడుకు పాడయ్యాడని ‘తూరుపు పొద్దు’ తండ్రి చింతిస్తాడు. ఈ రెండు కథల్లో అతిశయించిన నాటకీయత విజ్ఞులయిన పాఠకులను అంతగా ఆకట్టుకోదు. అయితే తూరుపు పొద్దు కథకు రచయిత ఎంచుకున్న కథావరణం భిన్నంగా వుంది. ఋణానుబంధం, ఫిడేలు రాగాలు కథలలో పాత్రలు చనిపోవడం కేవలం కరుణ రసాత్మకమైన ముగింపు కోసమే అన్నట్టు తోస్తాయి.
సరళమైన భాష, కథానుగుణమైన వర్ణనలు, సమయోచిత సంభాషణలు, మంచితనపు గుబాళింపులు ఈ సంపుటిలోని ప్రత్యేకతలు. సమస్యల లోతులను, మూలకారణాలను శోధిస్తూ, వైయక్తిక పరిష్కారాలతోపాటూ వ్యవస్థీకృతమైన పరిష్కారాల దిశగా అన్వేషిస్తూ ఈ రచయిత నుండి మరిన్ని మంచి కథలను ఆశించడం అత్యాశ కాదేమో!
పసిడి మనసులు(కథలు); రచన: సి.ఎస్.రాంబాబు; పేజీలు: 168; వెల: 100; ప్రతులకు: రచయిత, 202, కీర్తన హోమ్స్, 11–1–530, మైలార్‌గడ్డ, సీతాఫల్‌మండి, హైదరాబాద్–61; ఫోన్: 9490401005
- జి.ఉమ
9849802521