అమ్మలా ఉండకూడదు | I need to read well if my objective is to be fulfilled | Sakshi
Sakshi News home page

అమ్మలా ఉండకూడదు

Published Wed, Jun 12 2019 1:42 AM | Last Updated on Wed, Jun 12 2019 1:42 AM

I need to read well if my objective is to be fulfilled - Sakshi

‘భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి’. పదమూడూ పద్నాలుగేళ్ల వయసులో యాన్‌ ఫ్రాంక్‌ తన డైరీలో రాసుకున్న ఒక వాక్యం ఇది!

చిన్నారి యాన్‌ ఫ్రాంక్‌ చనిపోయి డెబ్బైనాలుగేళ్లు అవుతోంది. చనిపోయేటప్పుడు పదిహేనేళ్లు ఆ పాపకు. ‘ఎంత కష్టంలో కూడా మనిషి మరణాన్ని కోరుకోకూడదు’ అని యాన్‌ తన డైరీలో రాసుకుంది! పదమూడవ యేట డైరీ రాయడం విశేషం కాకపోవచ్చు. ఆ వయసుకు అంత పెద్దమాట రాసుకోవడం ఆశ్చర్యమే! యాన్‌ ఫ్రాంక్‌ చనిపోలేదు. చనిపోయి ఉంటే ఆమె ఎప్పుడు చనిపోయిందీ చరిత్రలో ఉండేదే. జర్మన్‌ నాజీల నిర్భంధ శిబిరంలోని అమానుష పరిస్థితులు ఆమెను చంపేశాయి. ఫిబ్రవరిలో, మార్చిలోనో యాన్‌ చనిపోయిందన్నంత వరకే ప్రపంచానికి తెలుసు. యాన్‌ పుట్టింది జూన్‌ 12, 1929. డచ్‌ సంతతి యూదుల అమ్మాయి యాన్‌.

ఆమె పదమూడవ  ఏట ఆమె తండ్రి ఒక డైరీని ఆమెకు కానుకగా ఇచ్చాడు. అది అతడికి వచ్చిన ఆలోచన కాదు. నిజానికి అది డైరీ కూడా కాదు. ఆటోగ్రాఫ్‌ బుక్‌. పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు ఆమ్‌స్టర్‌డామ్‌లో తండ్రీ కూతుళ్లు షాపింగ్‌కి వెళితే యాన్‌కి అక్కడ తెలుపు, ఎరుపు రంగుల చదరపు పలకల వస్త్రంతో బౌండ్‌ చేసిన నోట్‌బుక్‌ కనిపించింది. అది ఆటోగ్రాఫ్‌ బుక్‌ అని యాన్‌కి తెలియదు. ‘‘నాకు అది కావాలి నాన్నా’’ అని తండ్రిని అడిగింది. ‘నీ పుట్టిన రోజుకు కొనిస్తాలే’ అని మాట ఇచ్చాడు. మాట ప్రకారం కొనిచ్చాడు. ఆ పుస్తకాన్ని ఎంతో ఆపురూపంగా చూసుకుంది యాన్‌. అందులో డైరీ రాయడం మొదలుపెట్టింది. రోజూ రాసింది. తేదీలు ముద్రించి ఉండని పుస్తకం అది. తనే తేదీలు వేసుకుని తన ఆలోచనలు రాసుకుంది. నాజీలకు ఆ కుటుంబం పట్టుబడడానికి మూడు రోజుల ముందువరకు యాన్‌ డైరీలు రాసింది.

ఆమె తండ్రి దగ్గర మీప్‌కీస్‌ అనే వియన్నా యువతి టైపిస్టుగా పనిచేసేవారు. ఇటీవలే 2010తో తన నూరవ ఏట ఆమె మరణించారు. మీప్‌కీస్‌ యాన్‌కు సన్నిహితురాలు. మీప్‌కి, యాన్‌కి వయసులో ఇరవై ఏళ్ల వ్యత్యాసం. యాన్‌ ఆమెతో అనేక ఆలోచనలు పంచుకునేది. మీప్‌ కూడా యాన్‌ డైరీల కోసం తెల్లకాగితాలు అమర్చిపెట్టేవారు. అసలు మీప్‌ వల్లనే యాన్‌ డైరీలు వెలుగు చూశాయి. నిర్బంధ శిబిరంలో యాన్‌ చనిపోయిందని తెలిసినప్పుడు మీప్‌ కుప్పకూలిపోయారు. యాన్‌ నింపిన తెల్ల కాగితాలను గుండెకు హత్తుకున్నారు. వాటన్నిటినీ కలిపి యాన్‌ డైరీగా ముద్రించారు.‘ది డైరీ ఆఫ్‌ ఎ యంగ్‌ గర్ల్‌’ అనే పేరుతో ఇప్పుడా పుస్తకం ప్రతిదేశంలోనూ అందుబాటులో ఉంది. తెలుగులో కూడా కొన్ని అనువాదాలు న్నాయి. యాన్‌ తన డైరీని డచ్‌ భాషలో రాశారు.

డచ్‌లో ‘రహస్యగృహం’ అనే పేరుతో ఆమె డైరీ అచ్చయింది. జర్మన్లు డచ్‌ని (నెదర్లాండ్స్‌ని) ఆక్రమించినప్పుడు నాజీలకు దొరక్కుండా ఉండడం కోసం ప్రతి యూదుల ఇల్లు ఒక రహస్యగృహాన్ని ఏర్పాటు చేసుకుంది. యాన్‌ అలాంటి గృహంలో కూర్చునే డైరీ రాసేది. యాన్‌ ఫ్రాంక్‌ డైరీ తొలిసారి 1946లో మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు ‘ఆ.. చిన్న పిల్ల రాసేదేముంటుందిలే’ అని ఎవరూ అనుకోలేదు. ఆ కాలంనాటి పరిస్థితులు ప్రత్యేకమైనవి. అయితే యాన్‌ రాసిన కొన్ని విషయాలు ఇంకా ప్రత్యేకమైనవి! ఆ పసిదానిలో అంత లోతైన భావనలున్నాయా.. అని పాఠకులు విస్మయం చెందారు. ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా యాన్‌ భావాలు ఈ కాలానికీ వర్తించేలా ఉన్నాయి! 1944 ఏప్రిల్‌ 5, బుధవారం ఆమె రాసిన డైరీ ఇలా సాగింది : ‘మొత్తానికి నేనొకటి తెలుసుకున్నాను.

నా లక్ష్యం నెరవేరాలంటే నేను బాగా చదువుకోవాలి. జర్నలిస్టును కావడం నా లక్ష్యం. నేను రాయగలనని నాకు తెలుసు. కానీ బాగా రాయగలనా అన్నది సందేహం. ఒకవేళ నాకు బుక్స్‌ గానీ, వార్తాపత్రికలకు వ్యాసాలు గానీ రాసే ప్రావీణ్యం లేకున్నా.. నా కోసం నేను రాసుకుంటాను. అయితే అంతకంటే కూడా ఎక్కువగా నేను సాధించాలి. అమ్మలా నేను జీవించలేను. అమ్మలా, మిసెస్‌ వాన్‌డాన్‌లా, ఇంకా చాలామంది ఆడవాళ్లలా శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకుండా నేను పని చేయలేను. భర్తకు, పిల్లలకు జీవితాన్ని అంకితం చేయడం కన్నా ఇంకా ఎక్కువగా నాకు నా జీవితం కావాలి. సమాజానికి నేనేదైనా చేయాలి. మనుషుల సంతోషానికి నేనొక కారణం కావాలి. అసలు నేనెవరో తెలియనివాళ్ల సంతోషానికి కూడా.

చనిపోయాక కూడా నేను జీవించే ఉండాలి. నా లోపల ఉన్నదాన్ని బయటికి వ్యక్తపరిచే రచనాశక్తిని దేవుడు నాకు ప్రసాదించినందుకు ఆయనకు నా కృతజ్ఞతలు. రాసేటప్పుడు అన్ని విచారాలనూ వదిలేస్తాను. నా దుఃఖం మాయమైపోతుంది. నా మనసు పునరుజ్జీవనం పొందుతుంటుంది. అయితే ఒక సందేహం. ఎప్పటికైనా నేను ఒక గొప్ప విషయాన్ని రాయగలనా? ఒక గొప్ప జర్నలిస్టును గానీ, రచయిత్రిని గానీ కాగలనా?..’ అని ఆ వేళ్టి డైరీని ముగించింది యాన్‌ ఫ్రాంక్‌. అయితే యాన్‌ ఒక విషయం తెలుసుకోకుండానే ఈ లోకాన్ని శోకమయం చేసి వెళ్లిపోయింది. అమె గొప్ప జర్నలిస్టు, గొప్ప రచయిత్రి అయినా కాకున్నా గొప్ప మానవతావాదిగా నిలిచిపోయింది. అందుకు ఆమె డైరీలే సజీవ సాక్ష్యాలు. యాన్‌ తండ్రి తన కూతురికి డైరీని కానుకగా ఇవ్వలేదు. కూతుర్నే డైరీకి కానుకగా ఇచ్చాడు. మానవాళికి ఇది ఒక అందమైన, అపురూపమైన రోజు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement