కంప్యూటర్లు, టీవీలకు అతుక్కుపోకండి
స్కూల్ లేదు.. హోంవర్క్ గోల అంతకంటే లేదు.. అసైన్‌మెంట్లు చేయాల్సిన అవసరం అసలే లేదు.. పుస్తకాలు ముందేసుకుని చదవాల్సిన పని లేదు.. ఎందుకంటే సమ్మర్‌లో సెలవులు ఇచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా.. ఎంచక్కా సెలవుల్లో కంప్యూటర్లకు, టీవీలకు అతుక్కుని కూర్చుందామనుకునే పిల్లలపై పెద్దలు ఓ లుక్కేయాల్సిందే. లేకుంటే మీ పిల్లలను అందరూ ‘లడ్డూ’ అని పిలవాల్సి వస్తుంది. రోజుకు మూడు నాలుగు గంటలు టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడం, సరైన వ్యాయామం లేకపోవడంతో.. పిల్లలు బెలూన్లలా ఉబ్బిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రెండు గంటల కంటే ఎక్కువగా టీవీ చూస్తే కంటి జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తించాలి.
ఒంటికి వ్యాయామం అవసరం
ఎలాగూ సెలవులే కదా అని అస్తమానం రిమోట్ పట్టుకుని వీడియో, ఇండోర్ గేమ్స్ ఆడటం.. విసుగనిపిస్తే నెట్‌బ్రౌజింగ్ చేయడం, సినిమా సీడీలతో కాలక్షేపం మితిమీరితే ఇబ్బందేమరి. ఇరవై నాలుగ్గంటలూ కుర్చీలు, సోఫాలకు అత్తుక్కుపోయి టీవీలు, కంప్యూటర్ల ఆటలకే పరిమితం కావొద్దు. ఒంటికి కాస్త వ్యాయామం కూడా ఇవ్వాలి. ఫ్రిజ్ నిండా వేసవి రుచులు నింపుకొని, టీవీలు, కంప్యూటర్లతో ఆటలాడుతూ మధ్యమధ్యలో ఎంచక్కా చిరుతిళ్లు లాగించేస్తే ఆరోగ్యం పాడవడంతో పాటు లావెక్కిపోతారు. దీంతో స్కూళ్లు మొదలవగానే తోటి విద్యార్థులు ఎగతాళి చేసే ప్రమాదం ఉంది. శరీరానికి శ్రమ ఇవ్వాలి. అప్పుడప్పుడు బయటకు వెళ్లి పరుగెత్తాలి, నడవాలి, పిల్లలతో కలిసి సరదాగా ఆడుకోవాలి.
- సాక్షి, విజయవాడ