త్వరలో మార్కెట్‌లోకి ఇంటి పనులు చక్కబెట్టే రోబోలు
దైనందిన కార్యకలాపాల్లో సాయం చేయనున్న ఏఐ ఆధారిత మరమనుషులు
సొంతంగా ఆలోచించి ప్రతిస్పందించగలగడం వాటి ప్రత్యేకత
అమెరికాలో జరిగిన కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ షో–2025లో ఆవిష్కృతమైన భవిష్యత్ ట్రెండ్
అంట్లుతోమడం మొదలు బట్టలు మడతపెట్టడం దాకా ఇల్లాలికి శ్రమలేకుండా ఇంటి పనులన్నీ చేసే రోబో ఒకటి! సరుకులు సహా మోత పనులను మీ బదులు అలవోకగా చేసిపెట్ట్టగల మరమనిషి మరొకటి!! పనివాళ్ల కొరతను తీరుస్తూ క్లబ్ హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌ను శుభ్రం చేసేందుకు ఇంకో రోబో! హాల్లో మీ కదలికలకు అనుగుణంగా లైట్‌ను ప్రసరించే రోబో ఇంకొకటి!! వీకెండ్‌లో కుటుంబమంతా కలిసి సినిమా చూద్దామనుకోగానే పరుగున వచ్చి తన కళ్లనే ప్రొజెక్టర్‌గా చేసి సినిమా చూపే హైఫై రోబో మరొకటి!! స్నేహితులతో ఇంట్లో చిల్ అవుతుంటే చిటికెలో కాక్‌టెయిల్‌ను సిద్ధం చేసి అందించే ఓ బార్‌టెండర్ రోబో!! ఓ బుజ్జాయిలా ఇంటిల్లిపాదినీ వచ్చిరాని మాటలతో అలరించే ఓ చిట్టి రోబో!! బాబోయ్.. ఇల్లంతా ఏమిటీ రోబోలమయమని అవాక్కవుతున్నారా? అమెరికాలోని లాగ్ వేగాస్ వేదికగా తాజాగా జరిగిన కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ షో వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా కనిపించబోయే ట్రెండ్‌ను కళ్లకు కట్టింది.
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటివరకు మనం హోటళ్లు, మాల్స్ వద్ద ఆతిథ్య సేవల్లో నిమగ్నమైన రోబోలను లేదా పరిశ్రమలు, వైద్య రంగంలో సేవలు అందించే రోబోలను మాత్రమే చూశాం. అయితే అవన్నీ ముందే సిద్ధం చేసిన ప్రోగ్రామ్‌లకు అనుగుణంగా మాత్రమే పనిచేస్తున్నాయి. అంటే ఒకే రకమైన పనిని మాత్రమే ఆ రోబోలు చేసిపెట్టగలవన్నమాట. కానీ త్వరలోనే మనతో మాటకలుపుతూ మన ఆదేశాలకు అనుగుణంగా పనులు చేసిపెట్టగల కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రోబోలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా మరమనిషి అనే రూపాన్ని తుడిచేస్తూ ఎన్నో ఆకారాలు, సైజుల్లో మనల్ని కనువిందు చేయనున్నాయి. రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని మన దైనందిన కార్యకలాపాలకు ఉపయోగపడేలా టెక్నాలజీ కంపెనీలు రోబోలను తీర్చిదిద్దుతున్నాయి.
ఆడమ్ నుంచి మిరుమి దాకా...
లాస్‌వెగాస్ కన్స్యూమర్ ఎల్రక్టానిక్స్ షోలో ఇంటి పనుల్లో సహకరించే హైటెక్ రోబోలు సందడి చేశాయి. ఇవి ఇంటిని శుభ్రం చేయడం, మొక్కలను అందంగా కత్తిరించడం, స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్, హాల్లో లైట్లకు బదులు వెలుతురు ప్రసరింపజేయడం వంటి సేవలు చేసిపెట్టగలవు. రిచ్‌టెక్ రొబోటిక్స్ అనే సంస్థ తయారు చేసిన బార్‌టెండర్ రోబో ‘ఆడమ్’ సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. అలాగే శిశువు ప్రతిరూపంలోని ‘మిరుమి అనే రోబో వీక్షకుల మాటలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తూ అలరించింది. టాంజిబుల్ ఫ్యూచర్ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ ఆధారిత ‘లూయి’, ఎన్‌చాన్టెడ్ టూల్స్ సంస్థ తయారు చేసిన ‘మిరోకై’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అంతేకాకుండా ఓపెన్‌డ్రాయిడ్స్ హోమ్–కోర్స్ అసిస్టెంట్ ‘ఆర్2డీ3’, జిజాయ్ రూపొందించిన అటానమస్ లాంప్ ‘మి–మో’, శామ్‌సంగ్ సృష్టించిన ‘బాల్లీ’ అనే ప్రొజెక్టర్ రోబోలు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ షోలో ప్రదర్శించిన రోబోలన్నీ సహజ భాషా ప్రాసెసింగ్ అల్గోరిథంతో మనకు సమానమైన వాయిస్ కమాండ్‌లకు అందించగలవు. ప్రతి ఒక్క రోబో ఆటోమేషన్‌ను మాత్రమే కాకుండా భావనలను వ్యక్తపరిచే ఇంటరాక్టివ్‌నెస్ స్థాయిని కూడా ప్రదర్శించాయి. మిరోకై రోబో యానిమేటెడ్ ముఖంతో మనిíÙలానే కనిపిస్తుంది. ‘ఇఫ్–దిస్–దెన్–దట్’ లాజిక్ ఆధారంగా ఏదైనా ‘పని’ని నేర్చుకోగలదు.
ఎంత ప్రియమో...
ఈ రోబోల్లో కొన్ని మార్కెట్‌లో ఇప్పటికే అందుబాటులోకి రాగా మరికొన్ని భవిష్యత్‌లో అందుబాటులోకి రానున్నాయి. మిరుమి త్వరలో 70 డాలర్ల (సుమారు రూ. 6 వేలు) రిటైల్ ధరకు అందుబాటులోకి రానుంది. లూయి ఇప్పటికే 169 డాలర్ల (సుమారు రూ. 14,500)కు అందుబాటులో ఉండగా మి–మో లాంప్ రోబో రిటైల్ ధర 3,500 డాలర్ల (సుమారు రూ. 3 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది. అయితే పూర్తి స్థాయి హ్యూమనాయిడ్ రోబోలు చాలా ఖరీదైనవి.
ముఖ్యంగా మిరోకై, ఆర్2డీ3 ధరలు 40 వేల డాలర్లు, 60 వేల డాలర్లు (సుమారు 34 లక్షల నుంచి రూ. 51 లక్షలు)గా ఉంది. ఈ దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా రోబోల మార్కెట్ ఏటా దాదాపు 20% వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో భారత మార్కెట్‌లోనూ అత్యాధునిక రోబోలు సందడి చేయవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా రోబోల విక్రయాలు పెరిగేకొద్దీ వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment