Consumer Electronics Show
-
సొంతంగా దున్నేస్తుంది
రైతన్న కాయకష్టాన్ని తగ్గించేందుకు శాస్త్ర విజ్ఞానం తొలినుంచి కృషి చేస్తూనే ఉంది. సైన్సు కృషి వల్లనే నాగలి నుంచి ట్రాక్టర్ల వరకు అనేక ఆవిష్కరణలు రైతుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రైతుకు మరింత సాయం చేసే నూతన ఆవిష్కరణను జాన్ డీర్ కంపెనీ తీసుకువచ్చింది. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను కంపెనీ రూపొందించింది. 8–ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తొలుత యూఎస్‌లో 20 కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని, వీటికి లభించే స్పందన ఆధారంగా ఉత్పత్తి పెంచాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో ఒక్క ఆపరేటర్ వేలాది రోబోలతో సాగుపని చేయించే దిశలో.. ఇది ముందడుగని యూకే జాతీయ రైతు సంఘం నేత టామ్ కొనియాడారు. ప్రత్యేకతలు.. ► ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్ ఉంటాయి. ► కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. ► పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది. ► దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్ నిలిచిపోతుంది. ► ఈ కెమెరాలను, కంప్యూటర్ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ► రైతు చేతిలోని స్మార్ట్ ఫోన్లో వీడియో ద్వారా ట్రాక్టర్ కదలికలను పర్యవేక్షించవచ్చు. ► దున్నాల్సిన భూమి కోఆర్డినేషన్స్ను (జీపీఎస్ ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి నిర్ధారించిన కమతం హద్దులను), డైరెక్షన్స్‌ను ముందుగా ఫీడ్ చేయాలి, అనంతరం తదనుగుణంగా ట్రాక్టర్ పని చేస్తుంది. ► దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ► ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా. -
ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా!
ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా! అని పాడుకుంటూ హడావుడి చేస్తోంది ఒక రోబో! ఎలాంటి వస్తువునైనా, ఎలాంటి ఉపరితలాలపైనైనా కిందపడకుండా తీసుకుపోయేందుకు ఉపయోగపడే మోబ్ఎడ్(మొబైల్ ఎసెంట్రిక్ డ్రాయిడ్) రోబోను హ్యుండాయ్ అభివృద్ధి చేసింది. పార్సిళ్లు, పానీయాల ట్రేలనే కాకుండా చిన్న పిల్లలను సైతం ఎలాంటి కుదుపులు లేకుండా మోసుకుపోవడం దీని ప్రత్యేకత. కంపెనీ విడుదల చేసిన వీడియోలో ఈ రోబో ఒక బేబీని మోస్తూ కనిపించింది. అలాగే గ్లాసులతో పేర్చిన పిరమిడ్ ఆకృతి చెదరకుండా ఒక ఎత్తయిన ప్రాంతాన్ని దాటింది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. వచ్చే జనవరిలో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)2022లో దీన్ని ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్థిరమైన, యుక్తి అవసరమైన పనులు చేసేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశామని పేర్కొంది. నాలుగు చక్రాలున్న ఈ రోబోకి ఫ్లాట్ బాడీని అమర్చారు. మెరుగైన సస్పెన్షన్ వల్ల ఎలాంటి కుదుపులు లేకుండా బరువులు మోయడం సాధ్యమవుతుంది. ప్రయాణ మార్గానికి అనుగుణంగా తనపై ఉన్న బరువు కిందపడకుండా తగినట్లు అడ్జెస్ట్ చేసుకుంటూ సాగిపోవడం దీని ప్రత్యేకత. ఇందులో మూడు చక్రాలకు మూడు మోటార్లున్నాయి. మరికొన్ని విశేషాలు.. ► పొడవు: 26 అంగుళాలు ► వెడల్పు: 23 అంగుళాలు ► ఎత్తు 13: అంగుళాలు ► బరువు: 50 కిలోలు ► వీల్ బేస్: హైస్పీడ్ డ్రైవింగ్‌లో 25 అంగుళాల వరకు విస్తరిస్తుంది, లోస్పీడ్ డ్రైవింగ్‌లో 17 అంగుళాలకు తగ్గుతుంది. ► వేగం: గంటకు 30 కిలోమీటర్లు ► బ్యాటరీ సామర్థ్యం: 2 కిలోవాట్లు ► బ్యాటరీ రన్నింగ్ సమయం: 4 గంటలు ► ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ వీల్ డ్రైవింగ్, హైటెక్ స్టీరింగ్, బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. -
సాంకేతిక సంరంభం
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2020 ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సీఈఎస్‌లో వివిధ సంస్థలు వేలాదిగా ప్రదర్శించిన వస్తువుల్లో కొన్ని సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన ఆ వస్తువులు వార్తల్లోనూ విశేషంగా నిలిచాయి. సీఈఎస్–2020లో ప్రదర్శించిన పలు వస్తువులు మన సాంకేతిక భవితవ్యానికి నిదర్శనంగా కనిపించాయి. కన్జూమర్ టెక్నాలజీ అసోసియేషన్ (సీటీఏ) అమెరికాలో ఏటా నిర్వహించే సీఈఎస్ విశేషాలపై ప్రత్యేక కథనం మీ కోసం... కన్జూమర్ టెక్నాలజీ అసోసియేషన్ (సీటీఏ) 1967 నుంచి అమెరికాలో ఏటా కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో ప్రదర్శించిన వస్తువులు అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి, సాంకేతిక పురోగతిని శరవేగంగా మార్చాయి. తొలి సీఈఎస్ న్యూయార్క్‌లో జరిగింది. తొలి ప్రదర్శనలో ప్రదర్శించిన పాకెట్ సైజు రేడియోలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ టీవీ సెట్లు విశేషంగా నిలిచాయి. అనతికాలంలోనే ఇవి జనాలకు అందుబాటులోకి వచ్చాయి. 1960 దశకంలో వీసీఆర్‌లను కేవలం టీవీ స్టేషన్స్‌లో మాత్రమే ఉపయోగించేవారు. వాటి ధర కూడా అప్పట్లో 50 వేల డాలర్లకు పైగా ఉండేది. అయితే, ఫిలిప్స్ సంస్థ 1970లో జరిగిన సీఈఎస్‌లో తొలిసారిగా ఇళ్లలో వాడుకునేందుకు అనువైన వీసీఆర్‌ను ప్రదర్శించింది. దాని ధర 900 డాలర్లు కావడంతో వీసీఆర్ అనతి కాలంలోనే ఇళ్లలో వాడటం మొదలైంది. దశాబ్ది గడిచే సరికి మరింత మెరుగైన వీసీఆర్‌లు మరింత తక్కువ ధరకే తయారై, మధ్యతరగతి జనాలకూ అందుబాటులోకి వచ్చాయి. షికాగోలో 1982 జూన్‌లో జరిగిన సమ్మర్ సీఈఎస్‌లో కామ్‌డోర్ సంస్థ తొలి హోమ్ కంప్యూటర్ ‘కామ్‌డోర్–64’– 8 బిట్ కంప్యూటర్ను ప్రదర్శించింది. కంప్యూటర్ల యుగంలో అత్యధికంగా అమ్ముడైన సింగిల్ మోడల్ కంప్యూటర్‌గా ఇది గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం. ఇదే ఏడాది జనరల్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ (జీసీఈ) సంస్థ ‘వెక్ట్రెక్స్’ వెక్టర్ డిస్ప్లే బేస్డ్ హోమ్ వీడియోగేమ్ పరికరాన్ని ప్రదర్శించింది. ఇది జరిగిన అనతికాలంలోనే వీడియోగేమ్స్ బహుళ వ్యాప్తిలోకి వచ్చాయి. లాస్‌వెగాస్‌లో 1993లో జరిగిన సీఈఎస్‌లో ‘కాప్కార్న్’ సంస్థ ‘మెగా మ్యాన్ ఎక్స్’ యాక్షన్ బేస్డ్ వీడియోగేమ్‌ను ప్రదర్శించింది. దీని రాకతో వీడియోగేమ్స్‌లో కొత్త శకం మొదలైంది. ఇక నవ సహస్రాబ్ది మొదలైనప్పటి నుంచి సీఈఎస్‌లో ఏడాదికేడాది ప్రదర్శించే వస్తువులు సందర్శకులను అబ్బురపరుస్తూ వస్తున్నాయి. 2002 సీఈఎస్‌లో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ ఎక్స్పీ’ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రదర్శించింది. ‘బ్లూ రే గ్రూప్’ 2004 సీఈఎస్‌లో తొలిసారిగా బ్లూరే డిస్క్‌ను ప్రదర్శించింది. బ్లూరే డిస్క్ రాకతో వినోదరంగంలో ఒక కొత్త మార్పు మొదలైంది. 2005 సీఈఎస్‌లో శామ్సంగ్ 102 అంగుళాల ప్లాస్మా టీవీని ప్రదర్శించింది. శామ్సంగ్కు దీటుగా పానసోనిక్ 2008 సీఈఎస్‌లో 150 అంగుళాల భారీ ప్లాస్మా టీవీని ప్రదర్శించింది. దీని మందం కేవలం 0.46 అంగుళాలే కావడంతో ఇది జనాలను విశేషంగా ఆకట్టుకుంది. 2009 సీఈఎస్‌లో ‘మినొరు త్రీడీ వెబ్‌కామ్’ విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచంలోనే తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ వెబ్‌కామ్ ఇదే కావడం విశేషం. ఇదే ఏడాది కంప్యూటర్ల తయారీ సంస్థ ‘డెల్’ తొలి సబ్నోట్బుక్ను ప్రదర్శించింది. ఇది సాధారణ లాప్టాప్ల కంటే చిన్నసైజు లాప్టాప్ కంప్యూటర్. గడచిన దశాబ్దకాలంగా సీఈఎస్ మరింతగా పుంజుకుంది. మరిన్ని విలక్షణమైన వస్తువులతో ఏడాదికేడాది జనాలను ఆకట్టుకుంటోంది. తాజాగా సీఈఎస్–2020లో ప్రదర్శించిన వాటిలో కొన్ని విలక్షణ వస్తువులు... తొలిసారిగా ఇండియా టెక్‌పార్క్ సీఈఎస్–2020లో తొలిసారిగా ఔత్సాహిక భారత పారిశ్రామికవేత్తలు ‘ఇండియా టెక్‌పార్క్’ ఏర్పాటు చేయడం విశేషం. ‘ఇండియా టెక్‌పార్క్’ భారత్‌కు చెందిన ఔత్సాహిక స్టార్టప్ సంస్థలకు వేదికగా నిలిచింది. సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన ఆశా జడేజా మోత్వానీ సీఈఎస్–2020లో ‘ఇండియా టెక్‌పార్క్’ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత ఏడాది సీఈఎస్‌కు వచ్చినప్పుడు ఇక్కడ భారత్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకమైన వేదిక ఏదీ లేకపోవడాన్ని గుర్తించానని, ఇది తనకు మనస్తాపం కలిగించిందని, అందుకే ఈసారి ఇక్కడ ‘ఇండియా టెక్‌పార్క్’ వేదికను ఏర్పాటు చేశానని ఆశా జడేజా మోత్వానీ తెలిపారు. సెగ్వే ఎస్–పాడ్ చూడటానికి వీల్‌చైర్‌లా కనిపించే ఈ ‘సెగ్వే ఎస్–పాడ్’ నిజానికి కొత్త తరహా ఎలక్ట్రిక్ వాహనం. అన్ని ఎలక్ట్రికల్ వాహనాల మాదిరిగానే ఇది కూడా చార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వాహనం. ఇందులో కూర్చుంటే ఏమాత్రం ఒంటికి శ్రమ లేకుండా ప్రయాణించవచ్చు. దీనితో పాటే ఇచ్చే ఒక జాయ్‌స్టిక్‌తో దీనిని నియంత్రించవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 38 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మలుపులు తీసుకునే ప్రదేశాల్లో ఎదురుగా వాహనాలు లేదా మనుషులు వచ్చేటట్లయితే, ఇందులోని సెన్సర్ల ద్వారా ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ పనిచేసి, వాహనం నిలిచిపోతుంది. అడ్డంకులేవీ లేకుంటేనే ముందుకు సాగుతుంది. ఇందులోని ఎక్స్టీరియర్ లైట్లు ఇండికేటర్లుగా పనిచేస్తాయి. వికలాంగులు కూడా దీనిలో కూర్చుని సునాయాసంగా ప్రయాణాలు చేయడానికి అనువుగా దీనిని రూపొందించారు. లెనోవో థింక్‌ప్యాడ్ ఎక్స్1 ఫోల్డ్ మడతపెట్టుకోగల మొబైల్ఫోన్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. లెనోవో సంస్థ తొలిసారిగా మడతపెట్టుకోవడానికి అనువైన లాప్టాప్ ‘థింక్‌ప్యాడ్ ఎక్స్1 ఫోల్డ్’ను రూపొందించింది. విండోస్–10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ 13.3 అంగుళాల లాప్టాప్ ‘సై్టలస్ ఇన్పుట్’, ‘విండోస్ ఇంక్’కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఈ లాప్‌టాప్‌పై డిజిటల్ పెన్‌తో కూడా తేలికగా పని చేసుకోవచ్చు. ఏదైనా టైప్ చేసుకోవాలనుకుంటే, ఇందులోని మాగ్నెటిక్ కీబోర్డును ఆన్ చేసుకుని టైప్ చేసుకోవచ్చు. పవర్ ఎగ్ ఎక్స్ పవర్ విజన్ సంస్థ రూపొందించిన ‘పవర్ ఎగ్ ఎక్స్’ విలక్షణమైన ద్రోన్ కెమెరా. ఇది కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్. హోరువాన కురుస్తున్న సమయంలో కూడా ఆరుబయట చక్కర్లు కొడుతూ చక్కని స్పష్టతతో కూడిన ఫొటోలు, వీడియోలు తీయగలదు. దీనితో చిత్రించిన వీడియోలకు కోరుకున్న గొంతును డబ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉండటం విశేషం. ఈ ద్రోన్ కెమెరా రీచార్జబుల్ బ్యాటరీలు, రిమోట్ సాయంతో పనిచేస్తుంది. పూర్తిగా చార్జ్ చేసిన బ్యాటరీతో ఏకధాటిగా అరగంట సేపు ఎగురుతూ వీడియోలు చిత్రించగలదు. ఫిస్కర్ ఓషన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తాజాగా రూపొందించిన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) ఇది. బ్యాటరీతో పనిచేసే ఈ ఎస్యూవీ పూర్తిస్థాయి పర్యావరణ అనుకూల వాహనమని ‘ఫిస్కర్’ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులోని సీటు కవర్లకు జంతుచర్మాన్ని కాకుండా, మొక్కల నుంచి సేకరించిన పదార్థాలతో తయారు చేసిన వీగన్ లెదర్‌ను ఉపయోగించారు. వాహనం నడుస్తుండగా, బ్యాటరీ చార్జ్ కావడానికి వీలుగా వాహనం టాప్‌పైన సోలార్ ప్యానల్‌ను అమర్చారు. కాబట్టి కాస్త ఎండగా ఉన్నప్పుడు బ్యాటరీ రీచార్జింగ్ గురించి ఆలోచించకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఈ వాహనంలో మరో విశేషం కూడా ఉంది. స్టీరింగ్ వద్ద ఉండే ‘కాలిఫోర్నియా మోడ్’ బటన్‌ను ఆన్ చేసుకుంటే, కిటికీలు మూసి ఉంచినా, ఓపెన్ ఎయిర్‌లో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. లెనోవో థింక్‌బుక్ ప్లస్ ‘లెనోవో’ ఈ ఏడాది తీసుకువచ్చిన మరో విలక్షణమైన లాప్టాప్ ‘థింక్‌బుక్ ప్లస్’. దీని ప్రత్యేకత ఏమిటంటే, పదమూడు అంగుళాల ఈ లాప్‌టాప్‌ను మూసేసిన తర్వాత కూడా దీనిని భేషుగ్గా ఉపయోగించుకోవచ్చు. దీని మూతపై ఉండే 10.8 అంగుళాల ఈ–ఇంక్ డిస్ప్లే ద్వారా మూసేసిన తర్వాత కూడా దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. మూతపై ఉండే డిస్ప్లేలో క్యాలెండర్ అపాయింట్మెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే, ఇది కిండిల్ యాప్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. లాప్టాప్లో టైపింగ్, ఇతర పనులు పూర్తయ్యాక, దీనిని మూసేసిన తర్వాత మూతపై ఉండే డిస్ప్లేలో ఇంచక్కా ఈ–బుక్స్, డిజిటల్ పేపర్స్ వంటివి చదువుకోవచ్చు. జూలియా స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ మీకు వంట పెద్దగా రాకపోయినా, వంటింట్లో ఈ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్ ఉంటే కాకలు తీరిన షెఫ్‌లకు దీటుగా కోరుకున్న వంటకాలను ఇట్టే వండేయగలరు. ఇది ఆలిన్ వన్ స్మార్ట్ కుకింగ్ సిస్టమ్. దీనిపైన ఉండే ఎనిమిదంగుళాల స్మార్ట్ డిస్ప్లేను ‘స్మార్ట్ కిచెన్ హబ్’గా పేర్కొంటున్నారు దీని తయారీదారులు. ఇందులో డిజిటల్ రెసిపీ బుక్, అప్లయన్స్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో రెసిపీని ఎంపిక చేసుకుని, అందులోని సూచనల మేరకు వంటకానికి కావలసిన పదార్థాలను ఇందులోని నిర్ణీత పాత్రల్లో వేసుకుని ఆన్ చేస్తే చాలు. మిగిలిన పనంతా ఈ స్మార్ట్ కుకింగ్ సిస్టమే చేసుకుపోతుంది. ఇందులో మూడులీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ బౌల్, పదార్థాల కొలతలను సరిచూసుకునే ఎలక్ట్రానిక్ త్రాసుతో పాటు తరగడం, తురమడం, చిలకడం, పిండి కలపడం, స్టీమ్ చేయడం, వేయించడం వంటి పన్నెండు రకాల ప్రక్రియలకు చెందిన మోడ్స్ ఉంటాయి. వంటకానికి కావలసిన పదార్థాలను వేశాక, దానికి తగిన మోడ్ ఎంపిక చేసుకుంటే చాలు. దీనిని శుభ్రం చేయడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఇందులో సెల్ఫ్ క్లీన్ ఆప్షన్ ఎంచుకుని, డిష్‌సోప్ వేసుకుంటే చాలు. దానంతట అదే శుభ్రం చేసుకుంటుంది. దీనిని ఆండ్రాయిడ్ ట్యాబ్ ద్వారా కూడా ఆపరేట్ చేసే వెసులుబాటు అదనపు విశేషం. సోలార్ ట్రైసికిల్ ఫ్రెంచి స్టార్టప్ కంపెనీ ‘వెల్‌లో’ రూపొందించిన ఈ వాహనం ఎలక్ట్రిక్ సైకిల్‌కు ఎక్కువ, ఎలక్ట్రిక్ కారుకు తక్కువలా కనిపించే ఈ వాహనం ట్రాఫిక్ రద్దీ నగరాల్లో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. దీని టాప్‌పైన ఉన్న సోలార్ ప్యానెల్ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇది గరిష్ఠంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముందువైపు రెండు చక్రాలు, వెనుక వైపు ఒక చక్రం ఉన్న ఈ ట్రైసైకిల్‌లో ముందువైపు ఒకరు, వెనుక వైపు ఇద్దరు కూర్చుని ప్రయాణించవచ్చు. – పన్యాల జగన్నాథదాసు -
లాస్ వెగాస్ ‘అవతార్’ షో!
లాస్ వెగాస్: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ అదరగొట్టే ఆవిష్కరణలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. మెర్సిడెస్ బెంజ్ ’ఏఐ’ కాన్సెప్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్ ఉత్పత్తులతో రూపొందించారు. హ్యుందాయ్ ఎయిర్ ట్యాక్సీ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్–ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్ ‘డిజిటల్ అవతార్’ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభా షించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్లను సృష్టించవచ్చని, డిస్ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగానూ వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాంసంగ్ డిజిటల్ మనిషి -
కృత్రిమ మేధకు కొత్త రెక్కలు!
-
కృత్రిమ మేధకు కొత్త రెక్కలు!
కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్) అమెరికాలో ఏటా వారం రోజుల పాటు జరిగే హైటెక్ ప్రదర్శన. టెక్ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు తమ పరిశోధనల ఫలితాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. భవిష్యత్తులో రాబోయే వింతలకు ఈ ప్రదర్శనను సూచికగా చూస్తారు. ఈ ఏడాది ఇందులో దాదాపు 4 వేల కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ప్రదర్శితమైన కొన్ని సాంకేతికతల వివరాలు మీకోసం. –సాక్షి, హైదరాబాద్ అందరికీ అందుబాటులోకి ఏఐ! కృత్రిమ మేధను నిన్న మొన్నటివరకూ సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి వాడటం చూశాం. ఇకపై అలా ఉండదు.. వాచీల్లో, స్మార్ట్ఫోన్లలో, టీవీల్లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. అమేజాన్ తన అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ మొబైల్ కిట్‌ను డెవలపర్లకు అందుబాటులోకి తేనుంది. గూగుల్ కూడా తన గూగుల్ అసిస్టెంట్‌ను ప్రజలకు మరింత దగ్గర చేసే పనులు మొదలుపెట్టింది. ఒకట్రెండేళ్లలో ఇవే టెక్నాలజీలు గొంతును గుర్తించి ఇంటి తాళాలూ తీసిపెట్టొచ్చు.. ఫలానా రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, ఆఫీసుకు వేరే రోడ్డు ద్వారా వెళదామని మీ స్మార్ట్‌ఫోన్ నుంచే సూచనలు రావొచ్చు. బాధ అర్థం చేసుకునే రోబోలు.. మీరు కష్టాల్లో ఉంటే.. మీ స్నేహితుడో.. బంధువో ఎలా ఓదారుస్తారో కొత్త రకం రోబోలు కూడా పరిస్థితికి తగ్గట్లు వ్యవహరిస్తూ మీకు సాంత్వన చేకూరుస్తాయి. ఎల్జీ కంపెనీ షాపింగ్ మాల్స్‌లో, హోటళ్లలో ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలకు ఎసరుపెట్టే స్థాయిలో సేవలందించగలవని అంచనా. టైటాన్–ఏఐ రోబో మన ముఖ కవళికలను గుర్తించడమే కాకుండా అందుకు తగ్గట్లు స్పందిస్తుంది. కోపంగా ఉంటే ఇష్టమైన పాటలు వినిపిస్తుంది.. కామెడీ సీన్స్ చూపిస్తుంది. చెప్పిన పని చేసే రోబోలతో పోలిస్తే.. మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే రోబోలను తయారు చేయడం చాలా కష్టమని.. అయినా ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని నిపుణులు అంటున్నారు. కార్లకూ టెక్ హంగులు.. డ్రైవర్ రహిత కార్ల గురించి తరచూ వింటూనే ఉన్నా.. ఈ ఏడాది సీఈఎస్‌లో మరిన్ని కంపెనీలు ఇలాంటి వాటిని ముందుకు తీసుకొచ్చాయి. చైనీస్ కంపెనీ ‘బైటన్’ఓ ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. హెన్రిక్ ఫిస్కర్ డిజైన్ చేసిన ఈ కారు ఖరీదు దాదాపు రూ.30 లక్షలు. యమహా కంపెనీ డ్రైవర్ అవసరం లేని ఓ మోటర్‌బైక్‌ను ప్రదర్శించగా.. హ్యుందాయ్ ఫుయెల్సెల్ టెక్నాలజీతో పనిచేసే నెక్సోను ప్రదర్శనకు పెట్టింది. ప్రజా రవాణాతో పాటు రకరకాల అవసరాల కోసం ఒకే ప్లాట్ఫార్మ్ అనే కాన్సెప్ట్‌తో టయోటా ఓ సరికొత్త కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. చక్రాలు, ఛాసిస్ మాత్రమే స్థిరంగా ఉండే ఈ కాన్సెప్ట్‌లో పై భాగం అవసరాన్ని బట్టి మారుతుంటుంది. వీఆర్‌పై లెనవూ ఫోకస్.. చైనీస్ కంప్యూటర్ తయారీ సంస్థ లెనవూ సీఈఎస్‌లో ప్రదర్శించిన ఉత్పత్తుల్లో అధికం వర్చువల్ రియాలిటీ (వీఆర్), ఆగ్యుమెంటెడ్ రియాలిటీ (ఏఆర్)లకు సంబంధించినవే. మిరేజ్ సోలో, డే డ్రీమ్ పేర్లతో విడుదలైన వ్యవస్థలతో వర్చువల్ కంటెంట్‌ను చాలా తేలికగా సృష్టించొచ్చు. ఫొటోలు, వీడియోల ఆధారంగా డే డ్రీమ్ ఈ కంటెంట్‌ను సృష్టిస్తుంది. పదేళ్ల కిందటి మీ పెళ్లి వీడియోను ఇందులోకి ఎక్కిస్తే.. మీరు అక్కడున్న అనుభూతి పొందుతూ వర్చువల్ రియాల్టీలో చూడొచ్చన్నమాట. స్మార్ట్ఫోనే ల్యాప్‌టాప్.. ప్రాసెసింగ్ స్పీడ్ విషయంలో కంప్యూటర్లకు, స్మార్ట్ఫోన్లకు మధ్య అంతరం ఇప్పుడు దాదాపు లేదనే చెప్పాలి. ప్రాజెక్టు లిండా పేరుతో రేజర్ అనే కంపెనీ సీఈఎస్‌లో స్మార్ట్‌ఫోన్‌నే ల్యాప్‌టాప్‌గా ఎలా వాడుకోవచ్చో ప్రదర్శించింది. నిర్దిష్టమైన స్థానంలోకి చేర్చడం ద్వారా స్మార్ట్‌ఫోన్ తాలూకూ ప్రాసెసర్, సాఫ్ట్వేర్లతోనే ల్యాప్‌టాప్ తరహాలో పనిచేసుకునేందుకు వీలు కల్పిస్తుంది ఇది. -
నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు!
ఆరోగ్య పరిరక్షణలో టెక్నాలజీ వాడకం కొత్తేమీ కాదు. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొత్త, వినూత్న వైద్య పద్ధతులు అందుబాటులోకి వస్తూండటం విశేషం. అమెరికాలోని లాస్‌వేగస్‌లో ప్రస్తుతం జరుగుతున్న కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్ –2018)లో ఈ ఏడాది కనిపించిన టెక్నాలజీలే ఇందుకు తార్కాణం. ఒత్తిడిని తగ్గించే హెడ్‌బ్యాండ్, వయోవృద్ధులు మందులు సరిగా తీసుకుంటున్నారా? లేదా? అన్నది చెక్ చేసేందుకు కాలి సాక్స్‌లో దాగే సెన్సర్లు.. తుంటి ఎముకలకు రక్షణ కల్పించే వినూత్న బ్యాగ్ వంటివి మచ్చుకు కొన్నే.. ఒక్కోదాని వివరాలు చూసేద్దాం... నిద్ర సమస్యలకు హైటెక్ కళ్లజోడు! నిద్ర పట్టకపోయినా.. ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్ధకంగా అనిపిస్తున్నా తెల్లవారకముందే మెలకువ వచ్చేస్తున్నా.. ఈ హైటెక్ కళ్లద్దాలు వాడేయమంటోంది పెగాసీ గ్లాస్ అనే సంస్థ. ఫ్రేమ్ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్ల కారణంగా సుఖనిద్రకు కావాల్సిన మెలటోనిన్‌ను నియంత్రించవచ్చునన్నది కంపెనీ అంచనా. తద్వారా మన శరీరాల్లోని గడియారం సహజస్థితికి చేరుతుందని.. నిద్ర సమస్యలన్నీ దూరమవుతాయని కంపెనీ అంటోంది. ఒక్కో కళ్లజోడు ఖరీదు రూ.12 వేల వరకూ ఉంటుంది! ఒత్తిడికి విరుగుడు ఈ హెడ్‌బ్యాండ్ కెనడాకు చెందిన స్టార్టప్ ఇంటరెక్సాన్ ‘మ్యూజ్’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ హెడ్‌బ్యాండ్ మన మెదడులోని నాడుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒత్తిడిని తగ్గిస్తుందట. ధాన్యం చేసేటప్పుడు ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించేందుకు, అథ్లెటిక్స్ పోటీల్లో ఒత్తిడిని జయించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. దక్షిణ కొరియాకు చెందిన లూక్సిడ్ ల్యాబ్స్ కూడా ఇలాంటి పరికరాన్నే ప్రదర్శించినప్పటికీ ప్రస్తుతం తాము పరిశోధన దశలోనే ఉన్నామని కంపెనీ ప్రకటించింది. వృద్ధుల స్థితిగతులపై కన్నేసేందుకు.. మతిమరపు లేదంటే అయిష్టత కారణంగా వయసు మీదపడిన వారు మందులు తీసుకునేందుకు అంతగా ఇష్టపడరు. ఈ సమస్యకు పరిష్కారంగా వాషింగ్టన్ స్టార్టప్ కంపెనీ సెన్సోరియా పేరుతో ఓ వినూత్నమైన గాడ్జెట్‌ను సిద్ధం చేసింది. వ్యాయామ సమయంలో శరీర కదలికలను గుర్తించి.. తప్పుఒప్పులను సరిచేసేందుకు కొన్నేళ్ల క్రితం సిద్ధం చేసిన ఓ గాడ్జెట్నే ప్రస్తుతం వృద్ధులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేశారు. మన దుస్తులకు గానీ, సాక్స్కుగానీ ఈ గాడ్జెట్‌ను తగిలించుకుంటే.. వ్యాయామం సరిగా చేస్తున్నారా లేదా?, మందులు సక్రమంగా తీసుకుంటున్నారా? వంటి అంశాలన్నింటినీ వారికి గుర్తు చేస్తూంటుంది ఇది. తుంటి ఎముకలకు రక్షణ కవచం.. వృద్ధులు పొరబాటున జారిపడితే తుంటి ఎముకలకు నష్టం జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి వారి కోసమే ఫ్రాన్స్ కంపెనీ హెలైట్ తుంటిభాగానికి రక్షణ కల్పించే ఓ హైటెక్ సంచిని తయారు చేసింది. నడుముకు తగిలించుకుని వెళుతూంటే చాలు.. వాటిలోని మోషన్ సెన్సర్స్ మన కదలికలపై ఓ కన్నేసి ఉంచుతాయి. ప్రమాదవశాత్తూ పడిపోతే.. ఇవి వెంటనే స్పందిస్తాయి. గాలి బుడగలు విచ్చుకునేలా చేస్తాయి. ఫలితంగా సున్నితమైన తుంటి ఎముకలకు రక్షణ ఏర్పడుతుందన్నమాట. -
భారత్‌లో ‘నెట్‌ఫ్లిక్స్’ సర్వీసులు ప్రారంభం...
నెలవారీ ప్యాకేజీ ధర రూ. 500 -రూ. 800 న్యూఢిల్లీ: సినిమాలు, సీరియల్స్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో తన సర్వీసులను ప్రారంభించింది. నెలవారీ రూ. 500 నుంచి రూ. 800 దాకా అన్లిమిటెడ్ కంటెంట్ ప్యాకేజీలు ఉంటాయని సంస్థ తెలిపింది. లాస్ వెగాస్‌లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2016లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో రీడ్ హేస్టింగ్స్.. నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా 130 దేశాలకు కార్యకలాపాల విస్తరణను ప్రకటించారు. భారత్‌లో ప్రధానంగా మూడు రకాల నెలవారీ ప్యాకేజీలను నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది. బేసిక్ (రూ.500), స్టాండర్డ్ (రూ. 650), ప్రీమియం (రూ.800) వీటిలో ఉన్నాయి. యూజర్లకు నెల రోజుల పాటు ఉచితంగా ట్రయల్ ఆఫర్ కూడా కంపెనీ అందిస్తోంది. భారత్‌లో హంగామా, హుక్, హాట్‌స్టార్, స్పూల్ వంటి ప్రత్యర్థి సంస్థల సేవలతో నెట్‌ఫ్లిక్స్ పోటీపడనుంది. మార్వెల్కి చెందిన డేర్‌డెవిల్, జెస్సికా జోన్స్, ఆర్కోస్, సెన్స్8, గ్రేస్ అండ్ ఫ్రాంకీ, మార్కో పోలో వంటి సిరీస్‌లతో పాటు పలు టీవీ షోలు, సినిమాలు నెట్‌ఫ్లిక్స్ రాకతో భారత్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.