సొంతంగా దున్నేస్తుంది | John Deere unveils its first Driverless tractor | Sakshi
Sakshi News home page

సొంతంగా దున్నేస్తుంది

Published Mon, Jan 10 2022 6:14 AM | Last Updated on Mon, Jan 10 2022 6:14 AM

John Deere unveils its first Driverless tractor - Sakshi

పొలం దున్నుతున్న ట్రాక్టర్‌(ఇన్‌సెట్లో) స్టీరింగ్‌ వద్ద అమర్చిన కంప్యూటర్లు

రైతన్న కాయకష్టాన్ని తగ్గించేందుకు శాస్త్ర విజ్ఞానం తొలినుంచి కృషి చేస్తూనే ఉంది. సైన్సు కృషి వల్లనే నాగలి నుంచి ట్రాక్టర్ల వరకు అనేక ఆవిష్కరణలు రైతుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రైతుకు మరింత సాయం చేసే నూతన ఆవిష్కరణను జాన్‌ డీర్‌ కంపెనీ తీసుకువచ్చింది. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను కంపెనీ రూపొందించింది. 8–ఆర్‌ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్‌ ఎలక్ట్రానిక్‌ షోలో ప్రదర్శించింది.

కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్‌ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్‌లాగా అప్‌గ్రేడ్‌ చేయవచ్చని తెలిపింది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తొలుత యూఎస్‌లో 20 కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని, వీటికి లభించే స్పందన ఆధారంగా ఉత్పత్తి పెంచాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో ఒక్క ఆపరేటర్‌ వేలాది రోబోలతో సాగుపని చేయించే దిశలో.. ఇది ముందడుగని యూకే జాతీయ రైతు సంఘం నేత టామ్‌ కొనియాడారు.

ప్రత్యేకతలు..
► ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్‌ ఉంటాయి.  
► కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది.
► పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది.
► దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్‌ నిలిచిపోతుంది.  
► ఈ కెమెరాలను, కంప్యూటర్‌ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్‌గా అప్‌గ్రేడ్‌ చేయవచ్చు.  
► రైతు చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌లో వీడియో ద్వారా ట్రాక్టర్‌ కదలికలను పర్యవేక్షించవచ్చు.  
► దున్నాల్సిన భూమి కోఆర్డినేషన్స్‌ను (జీపీఎస్‌ ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి నిర్ధారించిన కమతం హద్దులను), డైరెక్షన్స్‌ను ముందుగా ఫీడ్‌ చేయాలి, అనంతరం తదనుగుణంగా ట్రాక్టర్‌ పని చేస్తుంది.
► దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.  
► ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement