ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ | Shishu Maapan is an AI powered tool to assist ASHA workers in monitoring ​health of newborns | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్లకు చేదోడుగా ఏఐ

Published Wed, Mar 19 2025 2:46 PM | Last Updated on Wed, Mar 19 2025 3:38 PM

Shishu Maapan is an AI powered tool to assist ASHA workers in monitoring ​health of newborns

దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య సంరక్షణ అవసరాలు తీర్చడం నిత్యం సవాలుగా మారుతోంది. గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు (ఆశా కార్యకర్తలు) మాతా శిశు ఆరోగ్యానికి జీవనాధారంగా నిలుస్తున్నారు. అపారమైన అంకితభావంతో ఉన్న ఈ ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్లు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమర్థంగా నిధులు నిర్వర్తిస్తున్నారు. నవజాత శిశువుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన వాధ్వానీ ఏఐ అభివృద్ధి చేసిన ‘శిశు మాపన్’ను వినియోగిస్తూ సమర్థవంతమైన సేవలందిస్తున్నారు.

శిశువుల ఆరోగ్య పర్యవేక్షణ

శిశు మాపన్ అనేది నవజాత శిశువుల ఆంత్రోపోమెట్రిక్ కొలతలు(ఎత్తు-నిలబడినప్పుడు కుర్చునప్పుడు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్, నడుము చుట్టుకొలత..)ను రికార్డ్ చేయడంలో ఆశా వర్కర్లకు సహాయపడటానికి రూపొందించిన అత్యాధునిక పరిష్కారంగా ఉంది. ఈ కొలతలు పిల్లల ఆరోగ్యం, సంరక్షణకు కీలకమైన సూచికలుగా ఉంటాయి. సాంప్రదాయకంగా ఈ కొలతలను సేకరించడానికి ప్రత్యేక శిక్షణ, పరికరాలు అవసరం అవుతాయి. కానీ దీనివల్ల సేకరించే డేటాలో కచ్చితత్వం లోపిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరగడంతో ‘శిశు మాపన్’ ద్వారా ఈ సవాళ్లను అధిగమించే ప్రయత్నం చేశారు.

ఎలా పని చేస్తుందంటే..

ఆశా వర్కర్లు బేసిక్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి నవజాత శిశువుకు చెందిన చిన్న వీడియోను రికార్డ్ చేస్తారు. రియల్ టైమ్‌లో కచ్చితమైన కొలతలను అందించడానికి ఇందులోని ఏఐ వీడియోను ప్రాసెస్ చేస్తుంది. బేసిక్ కెమెరా సామర్థ్యాలతో పాత స్మార్ట్‌ఫోన్లలోనూ పనిచేసేలా ఈ యాప్‌ను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది భారతదేశం గృహ ఆధారిత నవజాత శిశు సంరక్షణ (హెచ్‌బీఎన్‌సీ) కార్యక్రమానికి అనుసందానం అయి ఉంటుంది. దాంతో ఆరోగ్య కార్యకర్తలు నిరంతరాయంగా శిశువు సంరక్షణ చర్యలు ట్రాక్‌ చేసేందుకు వీలవుతుంది.

శిశు మాపన్ మొబైల్‌ అప్లికేషన్‌లో ఆశా వర్కర్లు కచ్చితమైన, స్థిరమైన కొలతలను రికార్డ్‌ చేస్తున్నారు. ఏఐ ఆధారిత టూల్ శిశువుల నుంచి వెంటనే ఫీడ్ బ్యాక్‌ను అందిస్తుంది. సంభావ్య ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుంది. అందుకు సంబంధించిన మెడికేషన్‌ కోసం ప్రాథమికంగా తోడ్పడుతుంది. ఈ ప్రక్రియల క్రమబద్ధీకరణ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నవజాత శిశువులు, వారి కుటుంబాలకు అందించే ఆరోగ్య సేవల నాణ్యతను కూడా పెంచుతుంది.

ఆశా వర్కర్లకు సాధికారత

శిశు మాపన్ యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించడానికి 450 మంది ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చిన దాద్రా నగర్ హవేలీ, డామన్-డయ్యూ వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం గణనీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ ఆశావర్కర్లకు వారి దినచర్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది. ఈ ఏఐ ఆధారిత టూల్‌ను తమ పనిలో అనుసంధానించడం ద్వారా నవజాత శిశువుల సంరక్షణలో మెరుగైన ఫలితాలను అందించడానికి ఆశావర్కర్లు సన్నద్ధమయ్యారు.

ఇదీ చదవండి: దాచుకోవాల్సిన డబ్బులు.. వాడేసుకుంటున్నారు!

ఏఐలో నిత్యం వస్తున్న ఆవిష్కరణలు విభిన్న రంగాల్లో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మారుమూల ప్రాంతాల్లోని సమస్యలకు పరిష్కారాలు అందుతున్నాయి. దాంతోపాటు పనులు సులువుగా, కచ్చితత్వంతో పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. ఏఐ కేవలం టెక్‌ నిపుణులకు మాత్రమే అందుబాటులో ఉంటుందనే అపోహలకు దూరంగా, స్మార్ట్‌ పరికరాలపై కొంత అవగాహన ఉన్న సామాన్యులకు కూడా చేరువవుతోంది. ఈ విభాగంలో మరిన్ని ఆవిష్కరణలు వచ్చి, మరింత మందికి సర్వీసులు అందించేలా కంపెనీలు, వ్యవస్థలు కృష్టి చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement