
భారత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో స్వావలంబన దిశగా భారతఏఐ మిషన్ భారత పార్లమెంటుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. చాట్ జీపీటీని పోలిన లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం)తో సహా స్వదేశీ కృత్రిమ మేధ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పార్లమెంటు విస్తృతమైన బహుభాషా డేటాసెట్లను ఉపయోగించుకోవాలని ఈ సహకారం లక్ష్యంగా పెట్టుకుంది. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలను సృష్టించే అవసరాలను నొక్కి చెబుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ‘రైసినా డైలాగ్ 2025’ సందర్భంగా ఈమేరకు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘ఇండియా ఏఐ మిషన్ దేశం ప్రత్యేక అవసరాలను తీర్చే ఏఐ సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. ఓపెన్ ఏఐ వంటి గ్లోబల్ సంస్థల నుంచి ఓపెన్ సోర్స్ టెక్నాలజీల వాడకం దీర్ఘకాలంలో నిలకడగా ఉండకపోవచ్చు. సొంత దేశీయ ఎల్‌ఎల్‌ఎంను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పార్లమెంటుతో భాగస్వామ్యం డేటా సెట్లకు అవకాశం కల్పిస్తుంది. ఇది కృత్రిమ మేధ నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి కీలకమైన వనరుగా పనిచేస్తుంది. దూరదర్శన్, ఆలిండియా రేడియో వంటి సంస్థల నుంచి అదనపు డేటాసెట్లు ఈ చొరవకు మరింత తోడ్పాడు అందుతుంది’ అని చెప్పారు.
లాభాపేక్షలేని సంస్థ నుంచి లాభాపేక్ష సంస్థగా ఓపెన్ఏఐని మార్చడంపై ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి లాభాపేక్ష సంస్థగా మారితే ఓపెన్ఏఐ తన పేరును కూడా మార్చుకోవాలని వైష్ణవ్ పేర్కొన్నారు. దేశంలో సొంత జీపీయూ (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) చిప్‌ను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని, దీనిపై ప్రభుత్వం ఇప్పటికే పరిశ్రమతో కలిసి పనిచేయడం ప్రారంభించిందని మంత్రి చెప్పారు. స్వదేశీ జీపీయూ సామర్థ్యాన్ని సాధించేందుకు పట్టే కాలపరిమితి గురించి అడిగినప్పుడు వైష్ణవ్ మాట్లాడుతూ మూడు నుంచి ఐదేళ్లలో సహేతుకమైన మంచి సామర్థ్యాన్ని పొందడానికి వీలైన జీపీయూ సాధిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఫస్ట్‌టైమ్ బంగారం ధర ఎంతకు చేరిందంటే..
ఇండో-యూఎస్ వెంచర్ పార్ట్‌నర్స్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ పార్ట్‌నర్ వినోద్ ధామ్ మాట్లాడుతూ జీపీయూ అభివృద్ధికి మంత్రి ఇచ్చిన గడువు చాలా సహేతుకంగా ఉందన్నారు. భారత్ తన సొంత ఏఐ మోడల్‌ను నిర్మించుకోవడానికి ఓపెన్‌ఏఐ వంటి ఓపెన్‌సోర్స్ మోడల్స్‌ను ఉపయోగించుకోవాలని, కానీ రహస్య కార్యకలాపాలకు పాశ్చాత్య ఏఐ నమూనాలను ఉపయోగించరాదని ఆయన అన్నారు. భవిష్యత్తులో కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతాయని చెప్పారు. అందుకోసం జీపీయూ వృద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ తరహా ఫండింగ్‌ను ఈ విభాగంలో ప్రవేశపెట్టాలని సూచించారు. వచ్చే 2-3 ఏళ్ల పాటు ఏఐకు ఇదే తరహా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment