mobile operator
-
సొంతంగా దున్నేస్తుంది
రైతన్న కాయకష్టాన్ని తగ్గించేందుకు శాస్త్ర విజ్ఞానం తొలినుంచి కృషి చేస్తూనే ఉంది. సైన్సు కృషి వల్లనే నాగలి నుంచి ట్రాక్టర్ల వరకు అనేక ఆవిష్కరణలు రైతుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే రైతుకు మరింత సాయం చేసే నూతన ఆవిష్కరణను జాన్ డీర్ కంపెనీ తీసుకువచ్చింది. డ్రైవర్‌తో అవసరం లేని ట్రాక్టర్‌ను కంపెనీ రూపొందించింది. 8–ఆర్ ట్రాక్టర్‌గా పిలిచే ఈ ఆధునిక వాహనాన్ని అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్ షోలో ప్రదర్శించింది. కేవలం పొలం దున్నడమే కాకుండా ఇందులో పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్కడినుంచైనా దీన్ని ఆపరేట్ చేయవచ్చని, ఇప్పటికే ఉన్న ట్రాక్టర్‌ను ఈ ట్రాక్టర్లాగా అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలిపింది. దీని ధరను ఇంకా నిర్ణయించలేదు, ఈ ఏడాది చివరకు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తొలుత యూఎస్‌లో 20 కొత్త ట్రాక్టర్లను విడుదల చేయాలని, వీటికి లభించే స్పందన ఆధారంగా ఉత్పత్తి పెంచాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌లో ఒక్క ఆపరేటర్ వేలాది రోబోలతో సాగుపని చేయించే దిశలో.. ఇది ముందడుగని యూకే జాతీయ రైతు సంఘం నేత టామ్ కొనియాడారు. ప్రత్యేకతలు.. ► ఈ వాహనం కృత్రిమ మేథ (ఏఐ) ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో 6 స్టీరియో కెమెరాలు, జీపీఎస్ ఉంటాయి. ► కెమెరాల్లో ట్రాక్టర్‌కు ముందు 3, వెనుక 3 ఉంటాయి. ప్రతి 100 మిల్లీ సెకన్లకు ఒకమారు వీటిని ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. ► పొలం దున్నే సమయంలో ఏవైనా జంతువులు ట్రాక్టర్‌కు దగ్గరకు వచ్చినా సెన్సర్ల ఆధారంగా గుర్తించి వెంటనే దానంతటదే ఆగిపోతుంది. ► దీంతో పాటు అంగుళం దూరంలో ఏదైనా తగిలే అవకాశం ఉన్నట్లు తెలిస్తే వెంటనే ట్రాక్టర్ నిలిచిపోతుంది. ► ఈ కెమెరాలను, కంప్యూటర్ను మామూలు ట్రాక్టర్‌కు అమర్చడం ద్వారా ఒక్కరోజులో సాధారణ ట్రాక్టర్‌ను 8–ఆర్గా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ► రైతు చేతిలోని స్మార్ట్ ఫోన్లో వీడియో ద్వారా ట్రాక్టర్ కదలికలను పర్యవేక్షించవచ్చు. ► దున్నాల్సిన భూమి కోఆర్డినేషన్స్ను (జీపీఎస్ ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలను గుర్తించి నిర్ధారించిన కమతం హద్దులను), డైరెక్షన్స్‌ను ముందుగా ఫీడ్ చేయాలి, అనంతరం తదనుగుణంగా ట్రాక్టర్ పని చేస్తుంది. ► దున్నడమే కాకుండా వరుసలో విత్తనాలు చల్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ► ధరపై అధికారిక ప్రకటన రాకున్నా, సుమారు 50 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) ఉండొచ్చని అంచనా. -
మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా ఎయిర్టెల్
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా అవతరించింది. వరల్డ్ సెల్యులార్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (డబ్ల్యూసీఐఎస్) గణాంకాల ప్రకారం.. ఎయిర్టెల్ వినియోగదారులు 30 కోట్లకు పైగా ఉన్నారు. దాదాపు 62 కోట్ల మంది వినియోగదారులతో చైనా మొబైల్ అగ్రస్థానంలో, 40 కోట్ల మంది వినియోగదారులతో వోడాఫోన్ గ్రూప్ (యూకే) రెండో స్థానంలో ఉంది. చైనా యూనికామ్ (29 కోట్ల మంది), అమెరికా మోవిల్ (27 కోట్ల మంది) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఎయిర్టెల్ కార్యకలాపాలు 1995లో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఎయిర్టెల్ సేవలు 20 దేశాల కు విస్తరించాయి. -
ఎయిర్‌సెల్ నుంచి ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్
హైదరాబాద్: ప్రముఖ మొబైల్ ఆపరేటర్, ఎయిర్‌సెల్ కంపెనీ ‘ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్’ను అందిస్తోంది. టెక్నాలజీ భాగస్వామి ఎంకార్బన్తో కలిసి ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీస్‌లో భాగంగా మొబైల్ వినియోగదారుల బ్యాలెన్స్ రూ.10 కంటే తక్కువకు పడిపోయినప్పుడు రూ.10 తక్షణ రుణం పొందవచ్చని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనుపమ్ వాసుదేవ్ పేర్కొన్నారు. వినియోగదారులు ూ414ుకు గానీ, 12880కు గానీ డయల్ చేయాలని లేదా ఎల్ఓఏఎన్ అని టైప్ చేసి 55414కు ఎస్ఎంఎస్ చేసి ఈ ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్‌ను పొందవచ్చని వివరించారు. వినియోగదారులు తర్వాత రీచార్జ్ చేసుకున్నప్పుడు కొంత రుసుముతో కలుపుకొని ఈ రూ.10ను తగ్గిస్తామని పేర్కొన్నారు. కనీసం 180 రోజలు పాటు తమ సర్వీసును వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు ఈ ఎక్స్ట్రా క్రెడిట్ సర్వీస్‌ను పొందడానికి అర్హులని వివరించారు. -
టెలీవింగ్స్‌కు టెలికాం లెసైన్స్‌లు
న్యూఢిల్లీ: టెలీవింగ్స్ సంస్థకు ఏకీకృత లెసైన్స్, కొత్త టెలికాం పర్మిట్లు లభించినట్లయింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, గోవా, తూర్పు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల్లో ఏకీకృత లెసైన్స్‌లు పొందామని టెలీ వింగ్స్ పేర్కొంది. యూనినార్ పేరుతోనే సర్వీసులను కొనసాగిస్తామని వివరించింది. నార్వేకు చెందిన టెలినార్, భారత్‌కు చెందిన యూనిటెక్‌లు కలిసి యూనినార్ పేరుతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల యూనిటెక్ ఈ జేవీ నుంచి వైదొలగడంతో యూనిటెక్ వెర్లైస్లో ఉన్న ఆస్తులన్నింటినీ యూనినార్ ప్రమోటర్ సంస్థ టెలినార్ - కొత్త సంస్థ, టెలీ వింగ్స్‌కు బదలాయించింది. దీంతో టెలీవింగ్స్‌కు ఏకీకృత లెసైన్స్, కొత్త టెలికాం పర్మిట్లు లభించినట్లయింది.