ఈ పేటకు నేనే మేస్త్రీనిరా.. ఎలాంటి బరువైనా కిందపడనివ్వను రా! అని పాడుకుంటూ హడావుడి చేస్తోంది ఒక రోబో! ఎలాంటి వస్తువునైనా, ఎలాంటి ఉపరితలాలపైనైనా కిందపడకుండా తీసుకుపోయేందుకు ఉపయోగపడే మోబ్‌ఎడ్(మొబైల్ ఎసెంట్రిక్ డ్రాయిడ్) రోబోను హ్యుండాయ్ అభివృద్ధి చేసింది. పార్సిళ్లు, పానీయాల ట్రేలనే కాకుండా చిన్న పిల్లలను సైతం ఎలాంటి కుదుపులు లేకుండా మోసుకుపోవడం దీని ప్రత్యేకత. కంపెనీ విడుదల చేసిన వీడియోలో ఈ రోబో ఒక బేబీని మోస్తూ కనిపించింది. అలాగే గ్లాసులతో పేర్చిన పిరమిడ్ ఆకృతి చెదరకుండా ఒక ఎత్తయిన ప్రాంతాన్ని దాటింది.
వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. వచ్చే జనవరిలో జరిగే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)2022లో దీన్ని ప్రదర్శించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్థిరమైన, యుక్తి అవసరమైన పనులు చేసేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశామని పేర్కొంది. నాలుగు చక్రాలున్న ఈ రోబోకి ఫ్లాట్ బాడీని అమర్చారు. మెరుగైన సస్పెన్షన్ వల్ల ఎలాంటి కుదుపులు లేకుండా బరువులు మోయడం సాధ్యమవుతుంది. ప్రయాణ మార్గానికి అనుగుణంగా తనపై ఉన్న బరువు కిందపడకుండా తగినట్లు అడ్జెస్ట్ చేసుకుంటూ సాగిపోవడం దీని ప్రత్యేకత. ఇందులో మూడు చక్రాలకు మూడు మోటార్లున్నాయి.
మరికొన్ని విశేషాలు..
► పొడవు: 26 అంగుళాలు
► వెడల్పు: 23 అంగుళాలు
► ఎత్తు 13: అంగుళాలు
► బరువు: 50 కిలోలు
► వీల్ బేస్: హైస్పీడ్ డ్రైవింగ్‌లో 25 అంగుళాల వరకు విస్తరిస్తుంది, లోస్పీడ్ డ్రైవింగ్‌లో 17 అంగుళాలకు తగ్గుతుంది.
► వేగం: గంటకు 30 కిలోమీటర్లు
► బ్యాటరీ సామర్థ్యం: 2 కిలోవాట్లు
► బ్యాటరీ రన్నింగ్ సమయం: 4 గంటలు
► ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ వీల్ డ్రైవింగ్, హైటెక్ స్టీరింగ్, బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment