సాంకేతిక సంరంభం | Story About Consumer Electronics Show In Funday | Sakshi
Sakshi News home page

సాంకేతిక సంరంభం

Published Sun, Jan 26 2020 4:09 AM | Last Updated on Sun, Jan 26 2020 4:09 AM

Story About Consumer Electronics Show In Funday - Sakshi

అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల జరిగిన కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌)–2020 ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. సీఈఎస్‌లో వివిధ సంస్థలు వేలాదిగా ప్రదర్శించిన వస్తువుల్లో కొన్ని సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన ఆ వస్తువులు వార్తల్లోనూ విశేషంగా నిలిచాయి. సీఈఎస్‌–2020లో ప్రదర్శించిన పలు వస్తువులు మన సాంకేతిక భవితవ్యానికి నిదర్శనంగా కనిపించాయి. కన్జూమర్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (సీటీఏ) అమెరికాలో ఏటా నిర్వహించే సీఈఎస్‌ విశేషాలపై ప్రత్యేక కథనం మీ కోసం...

కన్జూమర్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (సీటీఏ) 1967 నుంచి అమెరికాలో ఏటా కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో (సీఈఎస్‌) నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో ప్రదర్శించిన వస్తువులు అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చి, సాంకేతిక పురోగతిని శరవేగంగా మార్చాయి. తొలి సీఈఎస్‌ న్యూయార్క్‌లో జరిగింది. తొలి ప్రదర్శనలో ప్రదర్శించిన పాకెట్‌ సైజు రేడియోలు, ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ టీవీ సెట్‌లు విశేషంగా నిలిచాయి. అనతికాలంలోనే ఇవి జనాలకు అందుబాటులోకి వచ్చాయి. 1960 దశకంలో వీసీఆర్‌లను కేవలం టీవీ స్టేషన్స్‌లో మాత్రమే ఉపయోగించేవారు.

వాటి ధర కూడా అప్పట్లో 50 వేల డాలర్లకు పైగా ఉండేది. అయితే, ఫిలిప్స్‌ సంస్థ 1970లో జరిగిన సీఈఎస్‌లో తొలిసారిగా ఇళ్లలో వాడుకునేందుకు అనువైన వీసీఆర్‌ను ప్రదర్శించింది. దాని ధర 900 డాలర్లు కావడంతో వీసీఆర్‌ అనతి కాలంలోనే ఇళ్లలో వాడటం మొదలైంది. దశాబ్ది గడిచే సరికి మరింత మెరుగైన వీసీఆర్‌లు మరింత తక్కువ ధరకే తయారై, మధ్యతరగతి జనాలకూ అందుబాటులోకి వచ్చాయి. షికాగోలో 1982 జూన్‌లో జరిగిన సమ్మర్‌ సీఈఎస్‌లో కామ్‌డోర్‌ సంస్థ తొలి హోమ్‌ కంప్యూటర్‌ ‘కామ్‌డోర్‌–64’– 8 బిట్‌ కంప్యూటర్‌ను ప్రదర్శించింది. కంప్యూటర్ల యుగంలో అత్యధికంగా అమ్ముడైన సింగిల్‌ మోడల్‌ కంప్యూటర్‌గా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించడం విశేషం.

ఇదే ఏడాది జనరల్‌ కంప్యూటర్‌ ఎలక్ట్రానిక్స్‌ (జీసీఈ) సంస్థ ‘వెక్ట్రెక్స్‌’ వెక్టర్‌ డిస్‌ప్లే బేస్డ్‌ హోమ్‌ వీడియోగేమ్‌ పరికరాన్ని ప్రదర్శించింది. ఇది జరిగిన అనతికాలంలోనే వీడియోగేమ్స్‌ బహుళ వ్యాప్తిలోకి వచ్చాయి. లాస్‌వెగాస్‌లో 1993లో జరిగిన సీఈఎస్‌లో ‘కాప్‌కార్న్‌’ సంస్థ ‘మెగా మ్యాన్‌ ఎక్స్‌’ యాక్షన్‌ బేస్డ్‌ వీడియోగేమ్‌ను ప్రదర్శించింది. దీని రాకతో వీడియోగేమ్స్‌లో కొత్త శకం మొదలైంది. ఇక నవ సహస్రాబ్ది మొదలైనప్పటి నుంచి సీఈఎస్‌లో ఏడాదికేడాది ప్రదర్శించే వస్తువులు సందర్శకులను అబ్బురపరుస్తూ వస్తున్నాయి. 2002 సీఈఎస్‌లో మైక్రోసాఫ్ట్‌ ‘విండోస్‌ ఎక్స్‌పీ’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ప్రదర్శించింది. ‘బ్లూ రే గ్రూప్‌’ 2004 సీఈఎస్‌లో తొలిసారిగా బ్లూరే డిస్క్‌ను ప్రదర్శించింది.

బ్లూరే డిస్క్‌ రాకతో వినోదరంగంలో ఒక కొత్త మార్పు మొదలైంది. 2005 సీఈఎస్‌లో శామ్‌సంగ్‌ 102 అంగుళాల ప్లాస్మా టీవీని ప్రదర్శించింది. శామ్‌సంగ్‌కు దీటుగా పానసోనిక్‌ 2008 సీఈఎస్‌లో 150 అంగుళాల భారీ ప్లాస్మా టీవీని ప్రదర్శించింది. దీని మందం కేవలం 0.46 అంగుళాలే కావడంతో ఇది జనాలను విశేషంగా ఆకట్టుకుంది. 2009 సీఈఎస్‌లో ‘మినొరు త్రీడీ వెబ్‌కామ్‌’ విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచంలోనే తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ వెబ్‌కామ్‌ ఇదే కావడం విశేషం. ఇదే ఏడాది కంప్యూటర్ల తయారీ సంస్థ ‘డెల్‌’ తొలి సబ్‌నోట్‌బుక్‌ను ప్రదర్శించింది. ఇది సాధారణ లాప్‌టాప్‌ల కంటే చిన్నసైజు లాప్‌టాప్‌ కంప్యూటర్‌. గడచిన దశాబ్దకాలంగా సీఈఎస్‌ మరింతగా పుంజుకుంది. మరిన్ని విలక్షణమైన వస్తువులతో ఏడాదికేడాది జనాలను ఆకట్టుకుంటోంది. తాజాగా సీఈఎస్‌–2020లో ప్రదర్శించిన వాటిలో కొన్ని విలక్షణ వస్తువులు...

తొలిసారిగా ఇండియా టెక్‌పార్క్‌
సీఈఎస్‌–2020లో తొలిసారిగా ఔత్సాహిక భారత పారిశ్రామికవేత్తలు ‘ఇండియా టెక్‌పార్క్‌’ ఏర్పాటు చేయడం విశేషం. ‘ఇండియా టెక్‌పార్క్‌’ భారత్‌కు చెందిన ఔత్సాహిక స్టార్టప్‌ సంస్థలకు వేదికగా నిలిచింది. సిలికాన్‌ వ్యాలీలో స్థిరపడిన ఆశా జడేజా మోత్వానీ సీఈఎస్‌–2020లో  ‘ఇండియా టెక్‌పార్క్‌’ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత ఏడాది సీఈఎస్‌కు వచ్చినప్పుడు ఇక్కడ భారత్‌కు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకమైన వేదిక ఏదీ లేకపోవడాన్ని గుర్తించానని, ఇది తనకు మనస్తాపం కలిగించిందని, అందుకే ఈసారి ఇక్కడ ‘ఇండియా టెక్‌పార్క్‌’ వేదికను ఏర్పాటు చేశానని ఆశా జడేజా మోత్వానీ తెలిపారు.

సెగ్వే ఎస్‌–పాడ్‌
చూడటానికి వీల్‌చైర్‌లా కనిపించే ఈ ‘సెగ్వే ఎస్‌–పాడ్‌’ నిజానికి కొత్త తరహా ఎలక్ట్రిక్‌ వాహనం. అన్ని ఎలక్ట్రికల్‌ వాహనాల మాదిరిగానే ఇది కూడా చార్జబుల్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఇది సెల్ఫ్‌ బ్యాలెన్సింగ్‌ వాహనం. ఇందులో కూర్చుంటే ఏమాత్రం ఒంటికి శ్రమ లేకుండా ప్రయాణించవచ్చు. దీనితో పాటే ఇచ్చే ఒక జాయ్‌స్టిక్‌తో దీనిని నియంత్రించవచ్చు. ఇది గరిష్ఠంగా గంటకు 38 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మలుపులు తీసుకునే ప్రదేశాల్లో ఎదురుగా వాహనాలు లేదా మనుషులు వచ్చేటట్లయితే, ఇందులోని సెన్సర్ల ద్వారా ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ పనిచేసి, వాహనం నిలిచిపోతుంది. అడ్డంకులేవీ లేకుంటేనే ముందుకు సాగుతుంది. ఇందులోని ఎక్స్‌టీరియర్‌ లైట్లు ఇండికేటర్లుగా పనిచేస్తాయి. వికలాంగులు కూడా దీనిలో కూర్చుని సునాయాసంగా ప్రయాణాలు చేయడానికి అనువుగా దీనిని రూపొందించారు.

లెనోవో థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 ఫోల్డ్‌

మడతపెట్టుకోగల మొబైల్‌ఫోన్లు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. లెనోవో సంస్థ తొలిసారిగా మడతపెట్టుకోవడానికి అనువైన లాప్‌టాప్‌ ‘థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌1 ఫోల్డ్‌’ను రూపొందించింది. విండోస్‌–10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ 13.3 అంగుళాల లాప్‌టాప్‌ ‘సై్టలస్‌ ఇన్‌పుట్‌’, ‘విండోస్‌ ఇంక్‌’కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. దీనివల్ల ఈ లాప్‌టాప్‌పై డిజిటల్‌ పెన్‌తో కూడా తేలికగా పని చేసుకోవచ్చు. ఏదైనా టైప్‌ చేసుకోవాలనుకుంటే, ఇందులోని మాగ్నెటిక్‌ కీబోర్డును ఆన్‌ చేసుకుని టైప్‌ చేసుకోవచ్చు. 

పవర్‌ ఎగ్‌ ఎక్స్‌

పవర్‌ విజన్‌ సంస్థ రూపొందించిన ‘పవర్‌ ఎగ్‌ ఎక్స్‌’ విలక్షణమైన ద్రోన్‌ కెమెరా. ఇది కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌. హోరువాన కురుస్తున్న సమయంలో కూడా ఆరుబయట చక్కర్లు కొడుతూ చక్కని స్పష్టతతో కూడిన ఫొటోలు, వీడియోలు తీయగలదు. దీనితో చిత్రించిన వీడియోలకు కోరుకున్న గొంతును డబ్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉండటం విశేషం. ఈ ద్రోన్‌ కెమెరా రీచార్జబుల్‌ బ్యాటరీలు, రిమోట్‌ సాయంతో పనిచేస్తుంది. పూర్తిగా చార్జ్‌ చేసిన బ్యాటరీతో ఏకధాటిగా అరగంట సేపు ఎగురుతూ వీడియోలు చిత్రించగలదు. 

ఫిస్కర్‌ ఓషన్‌
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ తాజాగా రూపొందించిన స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ఇది. బ్యాటరీతో పనిచేసే ఈ ఎస్‌యూవీ పూర్తిస్థాయి పర్యావరణ అనుకూల వాహనమని ‘ఫిస్కర్‌’ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులోని సీటు కవర్లకు జంతుచర్మాన్ని కాకుండా, మొక్కల నుంచి సేకరించిన పదార్థాలతో తయారు చేసిన వీగన్‌ లెదర్‌ను ఉపయోగించారు. వాహనం నడుస్తుండగా, బ్యాటరీ చార్జ్‌ కావడానికి వీలుగా వాహనం టాప్‌పైన సోలార్‌ ప్యానల్‌ను అమర్చారు. కాబట్టి కాస్త ఎండగా ఉన్నప్పుడు బ్యాటరీ రీచార్జింగ్‌ గురించి ఆలోచించకుండా ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఈ వాహనంలో మరో విశేషం కూడా ఉంది. స్టీరింగ్‌ వద్ద ఉండే ‘కాలిఫోర్నియా మోడ్‌’ బటన్‌ను ఆన్‌ చేసుకుంటే, కిటికీలు మూసి ఉంచినా, ఓపెన్‌ ఎయిర్‌లో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.

లెనోవో థింక్‌బుక్‌ ప్లస్‌
‘లెనోవో’ ఈ ఏడాది తీసుకువచ్చిన మరో విలక్షణమైన లాప్‌టాప్‌ ‘థింక్‌బుక్‌ ప్లస్‌’. దీని ప్రత్యేకత ఏమిటంటే, పదమూడు అంగుళాల ఈ లాప్‌టాప్‌ను మూసేసిన తర్వాత కూడా దీనిని భేషుగ్గా ఉపయోగించుకోవచ్చు. దీని మూతపై ఉండే 10.8 అంగుళాల ఈ–ఇంక్‌ డిస్‌ప్లే ద్వారా మూసేసిన తర్వాత కూడా దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. మూతపై ఉండే డిస్‌ప్లేలో క్యాలెండర్‌ అపాయింట్‌మెంట్స్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే, ఇది కిండిల్‌ యాప్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. లాప్‌టాప్‌లో టైపింగ్, ఇతర పనులు పూర్తయ్యాక, దీనిని మూసేసిన తర్వాత మూతపై ఉండే డిస్‌ప్లేలో ఇంచక్కా ఈ–బుక్స్, డిజిటల్‌ పేపర్స్‌ వంటివి చదువుకోవచ్చు.

జూలియా స్మార్ట్‌ కుకింగ్‌ సిస్టమ్‌
మీకు వంట పెద్దగా రాకపోయినా, వంటింట్లో ఈ స్మార్ట్‌ కుకింగ్‌ సిస్టమ్‌ ఉంటే కాకలు తీరిన షెఫ్‌లకు దీటుగా కోరుకున్న వంటకాలను ఇట్టే వండేయగలరు. ఇది ఆలిన్‌ వన్‌ స్మార్ట్‌ కుకింగ్‌ సిస్టమ్‌. దీనిపైన ఉండే ఎనిమిదంగుళాల స్మార్ట్‌ డిస్‌ప్లేను ‘స్మార్ట్‌ కిచెన్‌ హబ్‌’గా పేర్కొంటున్నారు దీని తయారీదారులు. ఇందులో డిజిటల్‌ రెసిపీ బుక్, అప్లయన్స్‌ కంట్రోల్స్‌ ఉంటాయి. ఇందులో రెసిపీని ఎంపిక చేసుకుని, అందులోని సూచనల మేరకు వంటకానికి కావలసిన పదార్థాలను ఇందులోని నిర్ణీత పాత్రల్లో వేసుకుని ఆన్‌ చేస్తే చాలు. మిగిలిన పనంతా ఈ స్మార్ట్‌ కుకింగ్‌ సిస్టమే చేసుకుపోతుంది. ఇందులో మూడులీటర్ల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బౌల్, పదార్థాల కొలతలను సరిచూసుకునే ఎలక్ట్రానిక్‌ త్రాసుతో పాటు తరగడం, తురమడం, చిలకడం, పిండి కలపడం, స్టీమ్‌ చేయడం, వేయించడం వంటి పన్నెండు రకాల ప్రక్రియలకు చెందిన మోడ్స్‌ ఉంటాయి. వంటకానికి కావలసిన పదార్థాలను వేశాక, దానికి తగిన మోడ్‌ ఎంపిక చేసుకుంటే చాలు. దీనిని శుభ్రం చేయడానికి ఏమాత్రం కష్టపడక్కర్లేదు. ఎందుకంటే ఇందులో సెల్ఫ్‌ క్లీన్‌ ఆప్షన్‌ ఎంచుకుని, డిష్‌సోప్‌ వేసుకుంటే చాలు. దానంతట అదే శుభ్రం చేసుకుంటుంది. దీనిని ఆండ్రాయిడ్‌ ట్యాబ్‌ ద్వారా కూడా ఆపరేట్‌ చేసే వెసులుబాటు అదనపు విశేషం.

సోలార్‌ ట్రైసికిల్‌
ఫ్రెంచి స్టార్టప్‌ కంపెనీ ‘వెల్లో’ రూపొందించిన ఈ వాహనం ఎలక్ట్రిక్‌ సైకిల్‌కు ఎక్కువ, ఎలక్ట్రిక్‌ కారుకు తక్కువలా కనిపించే ఈ వాహనం ట్రాఫిక్‌ రద్దీ నగరాల్లో ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. దీని టాప్‌పైన ఉన్న సోలార్‌ ప్యానెల్‌ ద్వారా ఇందులోని బ్యాటరీ చార్జ్‌ అవుతుంది. ఇది గరిష్ఠంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముందువైపు రెండు చక్రాలు, వెనుక వైపు ఒక చక్రం ఉన్న ఈ ట్రైసైకిల్‌లో ముందువైపు ఒకరు, వెనుక వైపు ఇద్దరు కూర్చుని ప్రయాణించవచ్చు. – పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement