టీనేజ్ అనేది టీనేజర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా సవాలే! వాళ్ల ఎదుగుదలను చూసి సంతోషం, గర్వం ఒకవైపు... వాళ్లతో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు స్వేచ్ఛనివ్వాలి, దారి తప్పకుండా ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలు మరోవైపు. ఓపెన్నెస్– పరిమితుల మధ్య, అధికారం– సహానుభూతి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయం. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా గొడవలు తప్పవు. అందుకే ఈ వయసులో తల్లిదండ్రుల మద్దతు వారి అభివృద్ధినెలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
కమ్యూనికేషన్ డైనమిక్స్
ఢ స్వతంత్రం కోసం తపిస్తారు. అదే సమయంలో వాళ్ల తల్లిదండ్రులు తమ అదుపు తప్పకూడదని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో పేరెంట్స్ చెప్పే మాటలను టీనేజర్లు పట్టించుకోరు. అది తమను తిరస్కరించినట్లుగా భావిస్తారు. ఇదే ఘర్షణలకు కారణమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు జడ్జిమెంట్ లేకుండా వినడం అవసరం. అప్పుడే తల్లిదండ్రులు తమను అర్థం చేసుకున్నారని ఫీలవుతారు.
వివాదాలు సహజం..
కౌమారంలో తమదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛ, స్వతంత్రాలను ప్రదర్శించడం అవసరమని టీనేజర్లు భావిస్తారు. ఈ క్రమంలో హెయిర్ స్టయిల్ నుంచి డ్రెస్సింగ్ స్టయిల్ వరకు, సిద్ధాంతాల నుంచి లైఫ్ స్టయిల్ వరకు, స్నేహాల నుంచి నైటవుట్ల వరకు తరాల మధ్య అంతరాలు ఉంటాయి.
మరోవైపు పిల్లలు చేయిదాటిపోతున్నారని పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. వారి ప్రవర్తనను కట్టడి చేయాలని ప్రయత్నిస్తుంటారు. కఠిన నియమాలు అమలు చేయాలని చూస్తుంటారు. ఈ విషయంలో టీనేజర్లు, పేరెంట్స్ మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇది సహజం. ఇందులో ఆందోళన పడాల్సిన పనిలేదు.
భావజాల ఘర్షణలు..
కౌమారంలో భావజాలం పరిపూర్ణంగా అభివృద్ధి చెందదు. టీనేజర్లు తీవ్రమైన భావజాలానికి సులువుగా ఆకర్షితులవుతారు. తమ భావాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సరైన పద్ధతులు ఇంకా వారికి తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు కోపం లేదా అసహనాన్ని ప్రదర్శించడం వల్ల వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. పిల్లలు అసహనం చూపినప్పుడు తల్లిదండ్రులు కూడా అసహనం చూపకుండా శాంతంగా స్పందించాల్సిన అవసరం ఉంది. టీనేజర్లతో కలిసి కూర్చుని, చర్చించి హద్దులను నిర్ణయించాలి. అది వారిలో బాధ్యతను పెంచుతుంది.
మీ మద్దతే వారి ఆత్మవిశ్వాసం...
తల్లిదండ్రుల మద్దతు టీనేజర్లలో ఆత్మవిశ్వాసం, సహనాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వయస్సులో పీర్ ప్రెషర్, అకడమిక్ ప్రెషర్ లాంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. తల్లిదండ్రులు వారి భావాలను, ఆలోచనలను అంగీకరిస్తూ మద్దతు ఇవ్వడం ద్వారా టీనేజర్లు భద్రత, నమ్మకం పొందుతారు, తద్వారా వారు ఈ సవాళ్లను అధిగమించడానికి తగిన ధైర్యాన్ని తెచ్చుకుంటారు. పరిశోధనల ప్రకారం తల్లిదండ్రుల మద్దతు గట్టిగా ఉన్న కౌమారులు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
మీరే ఆదర్శం...
టీనేజర్లు తమ తల్లిదండ్రులను అనుకరించడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రులు గౌరవమర్యాదలు, జాగ్రత్త, సానుకూల దృక్పథం, నైతికత, పట్టుదలను ప్రదర్శించడం ద్వారా వారికి శక్తిమంతమైన ఉదాహరణలుగా నిలుస్తారు. టీనేజర్లు ఆ విలువలను చూసి, వాటిని తామూ అమలు చేస్తూ సవాళ్లను ఎదుర్కొనే విధానంలో పాజిటివ్‌గా ఉంటారు.
బంధం బలపడాలంటే...
⇒ కలిసి భోంచేయడం, షికారుకు వెళ్లడం, సినిమాలు చూడటం వంటి మామూలు పనులు చేయండి. ఇది ఒత్తిడిలేని పరస్పర బంధానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
⇒ఎప్పుడూ చదువు, కెరీర్ గురించే మాట్లాడకుండా, అప్పుడప్పుడూ వారి ప్రపంచంపై ఆసక్తి చూపండి. వారికి నచ్చిన సినిమాలు, మ్యూజిక్ బ్యాండ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా తరాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించవచ్చు.
⇒ఎప్పుడూ వారి గదిలోకి దూరిపోకుండా, వారి స్పేస్, ప్రైవసీని గౌరవించండి. అది వారు అటానమీని అభివృద్ధి చేసుకోవడానికి అవసరం.
⇒ఏదైనా గొడవ వచ్చినప్పుడు కోపంతో తిట్టకుండా, తప్పు పట్టకుండా... ‘నీ ప్రవర్తనకు నేను బాధపడుతున్నాను’ లాంటి ‘ఐ స్టేట్‌మెంట్స్ వాడండి. అది డిఫెన్సివ్ నెస్‌ను తగ్గిస్తుంది.
⇒వారు చేసిన పొరపాట్లను పక్కకు నెట్టేసి, వారి విలువను, ప్రేమను గుర్తుచేసేలా మాట్లాడండి. దాంతో మీరు వారిని అంగీకరించారనే భద్రతను పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment