పరీక్ష ఉంది.. పరిష్కారమూ ఉంది
పిల్లలు లేకపోవడం ఓ పెద్ద పరీక్ష. అందరూ సలహాలిచ్చేవాళ్లే! ‘లేకపోతేనేమీ? నీకు మీ ఆయన మీ ఆయనకు నువ్వు పిల్లలేగా’ అని సర్దిచెప్పే మంచివాళ్లూ ఉంటారు. ‘మన కడుపులో పడితేనేనా బిడ్డ?’
అంటూ చెప్పే గొప్పవాళ్లూ ఉంటారు. ఇక తప్పుబట్టి వెక్కిరించేవాళ్లూ ఉంటారు.వాళ్లను మనం పట్టించుకోనక్కర్లేదు. ఇదిగో మీ కోసం ‘సాక్షి’ పిల్లలు పుట్టడం కోసం చేయించాల్సిన పరీక్షల గురించి, వైద్య ప్రపంచంలోని పరిష్కారాల గురించి వివరాలు అందిస్తోంది. మీ పెద్ద ‘పరీక్ష’లో విజయం సాధించేలా చేయూతనందిస్తోంది. మీరు పాస్ కావాలని మా ఆకాంక్ష.
కిందటి వారాల్లో మనం మహిళల్లో గర్భధారణకు అడ్డంకిగా ఉండే అనేక అంశాలను చర్చించాం. సాధారణ సామాజిక అంశాలు మొదలుకొని అండం విడుదలలో, గర్భాశయంలో, ఫెలోపియన్ ట్యూబ్స్‌లో, ఫలదీకరణ, ఇంప్లాంటేషన్ లోపాలు మొదలుకొని మానసిక అంశాలు సైతం గర్భధారణను ఎలా ప్రభావితం చేస్తాయో చూశాం. ఆయా లోపాలను అధిగమించే మార్గాలనూ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో సంతానలేమితో బాధపడే మహిళకు తొలి నుంచీ చేసే అవసరమైన పరీక్షలూ, సంతానం కోసం నిర్వహించే ప్రక్రియల తాలూకు పూర్తి వివరాలు తెలుసుకుందాం. సంతానలేమి సమస్యతో డాక్టర్ ఒక మహిళ దగ్గరికి రాగానే ముందుగా ఆమె వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) గురించి డాక్టర్ విపులంగా అడిగి తెలుసుకుంటారు.
మెడికల్ హిస్టరీ : ...అంటే... ఆమె పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా లేదా; ఒకవేళ ఆ సమయంలో ఏమైనా ఇబ్బందులున్నాయా, ఆ జంట క్రమం తప్పకుండా సెక్స్‌లో పాల్గొంటున్నారా, కలయికలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా; ఆ జంట ఇద్దరిలోనూ ఎవరికైనా దీర్ఘకాలికంగా ఏవైనా జబ్బులు ఉన్నాయా; వాటి కోసం లేదా ఇతరత్రా ఏమైనా మందులు వాడుతున్నారా... వంటి అనేక అంశాలను అడిగి తెలుసుకుంటారు. దాంతో వారికి ఎలాంటి పరీక్షలు అవసరమవుతాయనే దానిపై డాక్టర్‌కు ఒక అవగాహన ఏర్పడుతుంది.
ఫిజికల్ ఎగ్జామినేషన్ : ఆమె బరువు, ఎత్తు, బీఎమ్ఐ వంటి శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. పెల్విక్ పరీక్షతో పాటు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా గర్భసంచి సైజు, షేప్, పొజిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. దాంతో పాటు ఇన్ఫెక్షన్ లేదా పూత వంటివి ఏవైనా ఉన్నాయా, గర్భసంచి ముఖద్వారం ఎలా ఉంది వంటి వివరాలు తెలుస్తాయి.
ట్రాన్స్ వెజైనల్ స్కానింగ్ : ఈ పరీక్షతో గర్భసంచి సైజు, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అండాశయంలో కణతులు, సిస్ట్ల వంటివి ఏవైనా సమస్యలు ఉన్నాయా వంటి అవకతవకల వివరాలు తెలుస్తాయి. అలాగే ఫాలిక్యులార్ స్టడీస్ ద్వారా పీరియడ్స్ మొదలైన 10వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదలవుతోందా, లేదా తెలుస్తోంది. ఆ విషయంలో తేడాలేమైనా ఉంటే అది ఎప్పుడు విడుదలవుతోందనేది కూడా తెలుస్తుంది.
డాప్లర్ స్కానింగ్ : ఈ పరీక్ష ద్వారా అండం విడుదలయ్యే సమయంలో అండం చుట్టూ ఉండే ఫాలికిల్, గర్భాశయ పొరలోకి రక్త ప్రసరణ ఎలా ఉంది వంటి అనేక అంశాలను తెలుసుకోవచ్చు.
రక్తపరీక్షలు : ఇందులో సాధారణ రక్తపరీక్షలతో పాటు అవసరాన్ని బట్టి కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలూ చేస్తారు. వాటిల్లో... రక్తం ఎలా ఉందో తెలుసుకునే బ్లడ్‌కౌంట్ పరీక్ష అవసరం. మహిళ గర్భధారణకు హీమోగ్లోబిన్ పాళ్లు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. ఆరోగ్యకరమైన గర్భధారణకు మహిళ రక్తంలోని హీమోగ్లోబిన్ తగినంత ఉండాలి. హీమోగ్లోబిన్ రక్తహీనత సమస్య ఉంటే మహిళకు రక్తం (హీమోగ్లోబిన్) పెరగడానికి ఐరన్ మాత్రలు సూచిస్తారు. సాధారణంగా వాటితో పాటు మహిళకు భవిష్యత్తులో గర్భం వస్తే బిడ్డలో వెన్నుపూస సమస్యలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) రాకుండా ఉండేందుకు ఫోలిక్ యాసిడ్ మాత్రలూ సూచిస్తుంటారు. ఇక మరో సాధారణ రక్తపరీక్షలో మహిళకు డయాబెటిస్ సమస్య ఉందేమో తెలుసుకోవడం కోసం రాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్బీఎస్) పరీక్ష కూడా చేస్తారు. రక్తంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే తెలుసుకోడానికి ఈఎస్ఆర్ పరీక్ష, హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్ఎల్ పరీక్షలు దంపతులిద్దరికీ చేయించాలి. ఇక మరో రకం రక్తపరీక్షలు కాస్తంత అడ్వాన్స్డ్గా పరిగణించవచ్చు. వీటిలో మహిళల గర్భధారణను ప్రభావితం చేసే హార్మోన్లయిన ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, టీఎస్‌హెచ్ (థైరాయిడ్), ప్రోలాక్టిన్ వంటివి నార్మల్‌గానే ఉన్నాయా లేదా వాటిలో ఏవైనా హెచ్చుతగ్గులున్నాయా అన్న విషయం అర్థమవుతుంది. అలాగే కొందరిలో సీరమ్ ఈస్ట్రోడయాల్, ఏఎమ్‌హెచ్ వంటి పరీక్షలు అవసరాన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. ఇక మగవారికి సీమెన్ ఎనాలిసిస్ పరీక్ష చేయించడం ద్వారా శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత వంటి అంశాలు తెలుసుకోవచ్చు. వాటిలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు కారణం తెలుసుకోడానికి మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే... మహిళలకు అడ్వాన్స్డ్ పరీక్షలు చేయించబోయే ముందు, పురుషులు కూడా తప్పనిసరిగా సీమెన్ ఎనాలిసిస్ పరీక్షలు చేయించాలి. మహిళకు అన్ని పరీక్షలు చేయించి, చికిత్స మొదలయ్యాక తర్వాత ఎప్పుడో పురుషులు సీమెన్ టెస్ట్ చేయించుకుని, దానిలో ఏమైనా లోపాలున్నట్లు తేలితే, అప్పటికే మహిళలకు చేయించిన పరీక్షలకూ, చికిత్సలకూ చాలా డబ్బు, సమయం వృథా అవుతాయి.
ట్యూబ్ టెస్టింగ్ : ఫెలోపియన్ ట్యూబ్స్ తెరచుకొని ఉన్నాయా లేదా మూసుకుపోయాయా అన్న విషయం తెలుసుకోడానికి ఉపయోగపడే పరీక్ష. హిస్టరో సాల్పింగోగ్రామ్ అనే ఎక్స్–రే పరీక్ష ఇందుకు ఉపయోగపడుతుంది.
పోస్ట్ కాయిటల్ టెస్ట్ : మహిళలోకి ప్రవేశించిన శుక్రకణాలను నిర్వీర్యం చేసే ‘యాంటీ స్పెర్మ్ యాంటీబాడీస్’ను తెలుసుకునేందుకు చేసే పరీక్ష ఇది.
లాపరోస్కోపీ : కొంచెం మత్తు ఇచ్చి, పొట్ట మీద మూడు చోట్ల చిన్న గాట్లు పెట్టి, సన్నని గొట్టం వంటి స్కోప్‌తో లోపల గర్భసంచి, అండాశయాలు, ట్యూబ్స్ పరిస్థితి తెలుసుకోడానికి ఉపకరించే పరీక్ష ఇది. అయితే ఏవైనా లోపాలుంటే ఇదే ప్రక్రియలో దానికి అప్పటికప్పుడు చికిత్స చేసే సౌకర్యం కూడా ఇందులో ఉంటుంది.
హిస్టరోస్కోపీ : సన్నని గొట్టం వంటి పరికరంతో గర్భసంచి లోపల ఏమైనా అడ్డుపొరలు (సెప్టమ్), కొయ్యకొండలు/అతుకులు (అడ్హెషన్స్), కండ పెరగడం (పాలిప్స్) వంటివి ఉన్నాయేమో తెలుసుకోవచ్చు. ఉంటే అప్పటికప్పుడే చికిత్స కూడా చేయవచ్చు.కొంతమంది దంపతులలో అన్ని పరీక్షల్లోనూ ఎలాంటి లోపమూ కనిపించదు. అయినా వారికి సంతానం కలగకపోవచ్చు. ఇలా అన్ని బాగుండి కూడా సంతానం కలగకపోవడాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అంటారు. అయితే ఇక్కడ పేర్కొన్న అన్ని పరీక్షలూ, అందరికీ ఒకేసారి అవసరం ఉండవు. వాళ్ల వాళ్ల ఆరోగ్యచరిత్రనూ, పరిస్థితిని బట్టి వాళ్లలో ఉన్న లోపాల ఆధారంగా పరీక్షలు చేస్తుంటారు. కొన్ని కొన్ని పరీక్షల్లో బయటపడ్డ అంశాల ఆధారంగా ఆ తర్వాతి అడ్వాన్స్డ్ పరీక్షలు చేయడం కూడా జరుగుతుంటుంది.
చికిత్సలు
సంతానయోగం కోసం చేసే చికిత్సలు... ఆయా దంపతులకు ఉన్న సమస్యలను బట్టి ఉంటాయి. 20 – 30 శాతం మందిలో వారి శారీరక స్థితిపైనా, రుతుచక్రం, అండం విడుదల వంటి అంశాలపై అవగాహన పెంచుకొని, శ్రద్ధవహించి, కొంచెం ఓపిక చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి చికిత్సలు అవసరం లేకుండానే గర్భం ధరించవచ్చు. కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటిస్తే అవి ఇటు సంతానయోగ్యతకూ, అటు సాధారణ ఆరోగ్యానికీ మేలుచేస్తాయి. ఉదాహరణకు...
►మంచి ఆహార నియమాలు
►సరైన వ్యాయామంతో పాటు ఎత్తుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్త తీసుకోవడం.
►జీవనశైలిలో మార్పులు... వీటిలో మంచి ఆహారం, సరైన వ్యాయామంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి అంశాలపై జాగ్రత్త వహించాలి.
►థైరాయిడ్ సమస్యలు : థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్లలో లోపాలు ఉంటే దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. చాలామందిలో థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు దాన్ని సరిచేయగానే గర్భం ధరించే అవకాశం బాగా పెరుగుతుంది.
అండం విడుదల జరగనప్పుడు : క్లోమఫిన్, లెట్రోజల్ వంటి మాత్రలను నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే తగిన మోతాదుల్లో వాడాలి. అలాంటప్పుడు ఈ మాత్రలు వాడిన కొద్దిరోజుల్లోనే గర్భధారణ జరగడం నిపుణులు సాధారణంగా చూస్తుంటారు.
►మాత్రలతో అండం విడుదల కానప్పుడు, కొన్ని రకాల హార్మోన్ ఇంజెక్షన్లను ఇచ్చి చూస్తారు. దాంతో గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి.
►గర్భాశయానికి ఇన్ఫెక్షన్ ఏవైనా ఉంటే... సరైన యాంటీబయాటిక్‌ను సరైన మోతాదుల్లో వాడటం వల్ల ... ఇక ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే గర్భధారణ జరుగుతుండటం నిపుణులు చూస్తుంటారు.
డీ అండ్ సీ : కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం మరీ సన్నగా ఉంటుంది. అలాంటప్పుడు డీ అండ్ సీ అనే చిన్న ఆపరేషన్ చేసి, యోని మార్గాన్ని వెడల్పు చేస్తారు. అలాగే గర్భసంచి లోపలి పొరను శుభ్రం చేయడం కూడా జరుగుతుంది. దీనివల్ల కొంతమందిలో గర్భాశయం లోపలి పొర ఆరోగ్యంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అవసరాన్ని బట్టి పొరను బయాప్సీకి పంపడం వల్ల, హార్మోన్ అసమతౌల్యతలు ఏవైనా ఉంటే తెలుస్తాయి. ఇన్ఫెక్షన్స్ వంటివి ఏవైనా ఉన్నా అవి బయటపడతాయి. అలాగే కొందరిలో ఈ పొరను టీబీ పరీక్షకు కూడా పంపించడం జరుగుతుంది. ఇందులో టీబీ నిర్ధారణ అయితే, దానికి చికిత్స తీసుకుంటే కూడా చాలామందిలో గర్భం నిలుస్తుంది.
► హిస్టరోసాల్పింగోగ్రామ్ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్ తెరచుకొని ఉన్నాయా లేక మూసుకొని ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ మూసుకుపోయినట్లు అనిపిస్తే, అప్పుడు లాపరోస్కోపీ ద్వారా ట్యూబ్స్ మూసుకుపోయిన విషయాన్ని నిర్ధారణ చేసుకుని, కొందరిలో చికిత్స కూడా చేయవచ్చు. మరికొందరిలో సర్జరీ ద్వారా మూసుకుపోయిన ట్యూబ్స్‌ను సరిచేయడానికి ప్రయత్నించవచ్చు.
►గర్భాశయంలో ఉండే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, అడ్డుపొరలు, అండాశయంలోని నీటిబుడగలను లాపరోస్కోపీ, హిస్టరోస్కోపీ ద్వారా సరిచేయవచ్చు.
గర్భం దాల్చడానికి చేసే అడ్వాన్స్డ్ ప్రక్రియలు
ఐయూఐ : కొంతమందిలో గర్భాశయ ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ లేదా పూత ఉన్నప్పుడు లేదా యాంటీ స్పెర్మ్ యాంటీబాడీస్ ఉన్నప్పుడు; వీర్యకణాలు గర్భాశయంలోకి వెళ్లలేనప్పుడు, మందుల ద్వారా ప్రయత్నించినా గర్భం రానప్పుడు ఇంట్రా యుటిరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) అనే ప్రక్రియను నిర్వహిస్తారు. ఇందులో భర్త వీర్యాన్ని చిన్న కంటెయినర్లో సేకరించి, దాన్ని స్పెర్మ్ వాషింగ్ మీడియాలో శుభ్రపరచి, మంచి ఆరోగ్యవంతమైన వీర్యకణాలను వేరుపరచి, అండం విడుదలయ్యే రోజుల్లో గర్భాశయంలోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముందుగా సేకరించిపెట్టుకున్న ఆరోగ్యకరమైన వీర్యకణాలను ఒక సన్నటి కాన్యులాలోకి తీసుకుంటారు. సరిగ్గా అండం విడుదలయ్యే సమయానికి ఆ కాన్యులాను యోని ద్వారా గర్భాశయంలోకి పంపి అక్కడ వీర్యకణాలను ఇంజెక్ట్ చేస్తారు. దాంతో వీర్యకణాలు... యోని మొదలుకొని, గర్భాశయముఖద్వారంలోని అడ్డంకులను దాటుకొని, గర్భాశయం వరకు ప్రయాణించాల్సిన దూరం తగ్గుతుంది. ఇలాంటి అడ్డంకులు దాటడం వల్ల సాధారణ ప్రయత్నం కంటే గర్భం వచ్చేందుకు ఒకసారికి సాధారణం కంటే 10 – 20 శాతం ఎక్కువగా అవకాశాలు పెరుగుతాయి ఇలా ఐయూఐ ప్రక్రియను 3 నుంచి 6 సార్లు ప్రయత్నించవచ్చు. ట్యూబ్స్ తెరచుకొని ఉండి, గర్భాశయంలో ఎలాంటి అడ్డంకులు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే ఐయూఐకి ప్రయత్నించడం మంచిది. గర్భాశయంలోకి ప్రవేశించిన వీర్యకణాలు వాటంతట అవే అక్కడినుంచి ట్యూబ్స్‌లోకి ప్రయాణం చేయాలి. అక్కడ చేరిన అండంలోకి దూరి, దానికి ఫలదీకరణం చేయాలి. ఆ తర్వాత పిండం తయారై, అది గర్భాశయంలోకి చేరి, అక్కడ అంటుకుంటుంది. దీన్నే ఇంప్లాంటేషన్ అంటారు. అప్పుడది గర్భంగా (శిశువుగా) పెరుగుతుంది. వీర్యకణాలను లోపలికి వదిలాక మిగతావన్నీ వాటంతట అవే జరగాలి. అక్కడ ఏవైనా సమస్యలుంటే ఐయూఐతో వాటిని అధిగమించలేము. కాబట్టి ఒక మూడుసార్లు ఈ ప్రయత్నం చేయవచ్చు. మూడుసార్లకు ఈ ప్రక్రియతో సక్సెస్‌రేటు 30% వరకు పెరగవచ్చు. తర్వాత మళ్లీ ఒకసారి కారణాలను విశ్లేషించుకొని, సమస్యలను బట్టి చికిత్సను మార్చుకోవచ్చు. ఇలా మరో మూడు సార్లు ప్రయత్నం చేయవచ్చు.
ఐయూఐ... ఎవరిలో, ఎప్పుడు?
ఏ అన్నీ బాగున్నా గర్భం రాని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నవారికి ఏ సర్వైకల్ సమస్యలు ఉన్నవారికి ఏ సాధారణ చికిత్సలతో రానప్పుడు ఏ మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉన్నప్పుడు ఏ కలయికలో సమస్యలు ఉన్నప్పుడు ఏ మగవారిలో అంగస్తంభన, స్ఖలనం (ఎరక్షన్, ఎజాక్యులేషన్) సమస్యలున్నప్పుడు ఏ వీర్యకణాల సంఖ్య కొద్దిగా తక్కువగా (అంటే 10 నుంచి 15 మిలియన్లు మాత్రమే)ఉండి, కదలికలు మందకొడిగా ఉన్నప్పుడు ఏ దాత వీర్యకణాలు వాడాల్సి వచ్చినప్పుడు సాధారణంగా అండం తయారవుతున్నా కూడా కొందరిలో ఎక్కువ అండాలు తయారు కావడానికీ, వాటి నాణ్యతకూ, సక్సెస్‌రేటు పెరగడానికి కొన్ని మందులు, ఇంజెక్షన్లు అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది.
ఐవీఎఫ్ లేదా టెస్ట్‌ట్యూబ్ బేబీ: పైన పేర్కొన్న పద్ధతిలో చికిత్స తీసుకున్నా ఫలితం లేనప్పుడు, మరికొన్ని అధునాతన ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ఒకటి. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ అని కూడా అంటారు. ఫెలోపియన్ ట్యూబ్స్ పూర్తిగా మూసుకుపోయి, ఏమాత్రం సరిదిద్దడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఈ పద్ధతి ద్వారా గర్భం వచ్చేలా ప్రయత్నించవచ్చు. పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయి, మళ్లీ పిల్లలు కావాలనుకున్నప్పుడు రీ–ఆపరేషన్ వల్ల ఉపయోగం లేకపోతే కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించవచ్చు.
గుర్తుంచుకోండి
గర్భధారణ కోసం పైన వివరించిన ప్రక్రియలన్నింటినీ ఒకేసారి నిర్వహించడం జరగదు. అవసరాన్ని బట్టి, దశల వారీగా ఒకటి తర్వాత మరొకటి ప్రయత్నించడం జరుగుతుంది. అందుకని దంపతులందరికీ ఇవన్నీ ఒకేలా వర్తించవు. కాబట్టి వారికి అవసరమైన నిర్ణీత ప్రక్రియను కనుగొనేందుకు కాస్త ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుంది.
ముఖ్యంగా తెలుసుకోవాల్సింది
పిల్లల కోసం డాక్టర్ దగ్గరికి వచ్చే దంపతుల్లో కొందరికి చికిత్స మొదలుకాగానే తర్వాతి నెలలోనే గర్భం రావాలంటూ ఆత్రుత పడుతుంటారు. రెండు మూడు నెలలకే మరో డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. ఇలా డాక్టర్లను మారుస్తూ వారి సమయం వృథా చేసుకుంటుంటారు. ఒకరి సమస్యలు, శరీరతత్వం, లోపాల వంటివి తెలుసుకునేందుకే ఒక్కోసారి డాక్టర్‌కు రెండు నెలలు లేదా అంతకంటే కాస్తంత ఎక్కువ సమయం పట్టవచ్చు.
పీరియడ్స్ సక్రమంగా లేకపోతే
కొందరిలో పీరియడ్స్ సక్రమంగా ఉండవు. అంటే సాధారణంగా మహిళల్లో 28 నుంచి 30 రోజులకొకసారి పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా వచ్చే వారిలో పీరియడ్ మొదలైన మొదటిరోజు నుంచి లెక్కపెడితే 11 నుంచి 16వ రోజు లోపల చాలావరకు అండం విడుదల అవుతుంది. అయితే కొద్దిమందిలో విధిగా 35, 40 రోజలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. ఇలాంటి వారిలో పీరియడ్స్ కనపడటానికి 14 రోజుల ముందు అండం విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే వారిలో పీరియడ్ వచ్చాక గానీ అండం ఎప్పుడు విడుదలయ్యిందో అంచనా వేయలేం. అంటే... వీరివిషయంలో జరిగేదేమిటంటే...
►నెలసరి సక్రమంగా రానివాళ్లలో అండం విడుదల కూడా సక్రమంగా ఉండదు. పీరియడ్‌కీ, పీరియడ్‌కీ మధ్య ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు. లేదా అసలు కాకపోనూవచ్చు.
►కాబట్టి సంతానం కావాలనుకునే దంపతుల్లో సక్రమంగా పీరియడ్స్ వచ్చేవారు పీరియడ్స్ వచ్చి 11 నుంచి 16 రోజుల సమయంలో తప్పక కలవాలి. పీరియడ్స్ సక్రమంగా రాని వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి, ఆ మేరకు అవసరమైన చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలి.
డా‘‘ వేనాటి శోభ, బర్త్‌రైట్ బై రెయిన్బో, హైదర్‌నగర్, హైదరాబాద్