అప్పుడే పెళ్లికెందుకు తొందర..?
పెద్దతూప్రలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
పెద్దతూప్ర(శంషాబాద్ రూరల్): మండల పరిధిలోని పెద్దతూప్రలో అధికారులు శుక్రవారం ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. మైనారిటీ తీరాకే పెళ్లి చేస్తామని తల్లిదండ్రుల నుంచి హామీపత్రం తీసుకున్నారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతూప్ర గ్రామానికి చెందిన పి.శంకరయ్య, సాలమ్మ దంపతుల కూతురు(15) స్థానికంగా ఆరో తరగతి వరకు చదివి మూడేళ్ల క్రితం బడి మానేసింది. ఇంటిపట్టునే ఉంటూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటోంది.
బాలికకు మేనబావ వరుసైన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన యాదయ్యతో శుక్రవారం పెళ్లి జరిపించడానికి ఇరు కుటుం బాల వారు నిర్ణయించారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. గ్రామంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు గురువారం రాత్రి తహసీల్దార్ వెంకట్‌రెడ్డి విశ్వసనీయ సమాచారం అందుకున్నారు. ఆయన ఆదేశాలతో శంషాబాద్ పోలీసులు అదేరోజు రాత్రి పోలీసులు గ్రామానికి వెళ్లి బాలిక కుటుంబీకులతో మాట్లాడారు. అమ్మాయి మైనర్ కావడంతో ఇప్పుడే పెళ్లి వద్దని సూచించి వెళ్లిపోయారు. అయినా పెళ్లి కార్యక్రమం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
దీంతో శుక్రవారం ఉదయం సీఐ ఉమామహేశ్వర్‌రావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు కల్యాణి, నారాయణమ్మ, బాలల సంరక్షణ జిల్లా ప్రతినిధి లావణ్యరెడ్డి పెద్దతూప్రకు చేరుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో పెళ్లి చే యొద్దని, 18 ఏళ్లు దాటిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. కా దు.. కూడదని పెళ్లి చేస్తే రెండు కుటుం బాలవారు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. అప్పటి వరకు బాలికను హాస్టల్‌లో వసతి సౌకర్యం కల్పించి చదువుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని అధికారులు నచ్చజెప్పారు.
అప్పుడే పెళ్లికెందుకు తొందర..? ముందు చదువుకోనివ్వండి అన్నారు. చిన్న వయస్సులో పెళ్లి చేస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, బాలిక బంగారు జీవితం నాశనం అవుతుందన్నారు. అమ్మాయి మేజర్ అయిన తర్వాత పెళ్లి చేస్తే ప్రభుత్వం నుంచి కల్యాణ లక్ష్మీ పథకం కింద రూ.50 వేలు వస్తాయని తెలిపారు. బాలికకు మైనారిటీ తీరాకే పెళ్లి చేస్తామని అధికారులు ఆమె కుటుంబీకుల నుంచి హామీ పత్రం రాయించుకున్నారు.
జిన్నారంలో బాల్య వివాహం నిలిపివేత
బంట్వారం: ఓ నలభై ఏళ్ల ప్రబుద్ధుడు పన్నెండేళ్ల బాలికను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అమ్మాయి తల్లిదండ్రులకు రెండెకరాల పొలం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన బాల్య వివాహన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకొని బాలిక బంగారు జీవితాన్ని కాపాడారు. ఈ సంఘటన మండల పరిధిలోని జిన్నారంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అంజయ్య, అంతమ్మ దంపతుల కూతురు(12) రాంపూర్‌లోని జెడ్పీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. బాలికకు ధారూరు మండలం నాగారం గ్రామానికి చెందిన యాదగిరి(40)తో పెళ్లి చేసేందుకు మార్చి 2న ఏర్పాట్లు చేశారు. కాగా యాదగిరికి ఇది రెండో వివాహం. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
అమ్మాయి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో యాదగిరి బాలిక తల్లిదండ్రులకు రెండెకరాల పొలాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈమేరకు వారు అంగీకరించి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మోమిన్‌పేట ఐసీడీఎస్ సీడీపీవో కాంతారావు, సూపర్‌వైజర్ జగదాంబ శుక్రవారం స్థానిక పోలీసులతో జిన్నారం గ్రామానికి చేరుకున్నారు. బాల్య వివాహం వల్ల జరిగే అనర్థాలను తెలియజేసి వివాహాన్ని రద్దు చేయించారు. తనకు పెళ్లి ఇష్టం లేదని, బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఉందని బాలిక అధికారులకు తెలియజేసింది. బంట్వారంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో బాలికను చేర్పించారు. బాలికకు మైనారిటీ తీరాకే వివాహం చే యాలని అధికారులు అమ్మాయి తల్లిదండ్రులకు సూచించారు.