వామదేవుడి వృత్తాంతం | Who is Parkshit in Mahabharata? | Sakshi
Sakshi News home page

వామదేవుడి వృత్తాంతం

Published Sun, Nov 24 2024 9:51 AM | Last Updated on Sun, Nov 24 2024 9:51 AM

Who is Parkshit in Mahabharata?

పూర్వం పరిక్షితుడు అనే రాజు అయోధ్యను పరిపాలించేవాడు. ఒకనాడు అతడు గుర్రమెక్కి వేట కోసం అడవికి వెళ్లాడు. అనేక మృగాలను వేటాడాడు. గుర్రం అలసిపోవడంతో, దానిని మేతకు విడిచిపెట్టాడు. అందమైన అడవి పరిసరాలను పరిశీలిస్తూ అలా ముందుకు నడవసాగాడు. ఒకచోట అతడికి ఒక అందగత్తె కనిపించింది. ఆమెను చూడగానే రాజు మనసు పారేసుకున్నాడు. ఆమె కూడా అతడిని చూసి, నర్మగర్భంగా నవ్వుతూ తన వలపును ప్రకటించింది.పరిక్షితుడు ఆమెను ‘సుందరీ! నువ్వెవరివి? క్రూరమృగాలు తిరిగే అడవిలో ఎందుకిలా ఒంటరిగా సంచరిస్తున్నావు?’ అని అడిగాడు.

‘రాజా! నా పేరు సుశోభన. నా తండ్రి అనుమతితో వరాన్వేషణ కోసం బయలుదేరాను. మార్గమధ్యంలో ఈ అడవి ఎదురైంది’ అని బదులిచ్చింది. ‘సుందరీ! నా పేరు పరిక్షితుడు. ఇక్కడకు దగ్గరలోని అయోధ్యకు రాజును. నీకు అభ్యంతరం లేకుంటే, నిన్ను పెళ్లాడతాను’ అంటూ మనసులోని మాటను తెలిపాడు.‘రాజా! నీతో పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నన్ను జలక్రీడల కోసం మాత్రం ఎన్నడూ నిర్బంధించనంటేనే పెళ్లికి సిద్ధపడగలను’ అంటూ షరతు విధించింది. ఆమె షరతుకు పరిక్షితుడు అంగీకరించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని, హాయిగా జీవించసాగారు. ఒకరోజు ఉద్యానవనంలో భార్యతో సల్లాపాలాడుతుండగా, పరిక్షితుడి శరీరం చెమటతో తడిసింది. 

కాసేపు జలక్రీడలాడి సేదదీరాలని తలచి, ఉద్యానవనంలో ఉన్న కొలనులోకి దిగాడు. అందులో ఈదులాడుతూ, తనతో జలకాలాడాలంటూ భార్యను పిలిచాడు. ఆమె నవ్వుతూ వచ్చి, కొలనులోకి దిగి, వెంటనే అదృశ్యమైపోయింది. అనుకోని ఈ పరిణామానికి పరిక్షితుడు దిగ్భ్రాంతుడయ్యాడు. భార్య కోసం కొలనంతా గాలించాడు. ఆమె కనిపించలేదు. భటులను పురమాయించి, కొలనులోని నీటినంతటినీ తోడి పోయించాడు. కొలను అడుగున కప్పలు తప్ప మరేమీ కనిపించలేదు. కప్పలే తన భార్యను తినేసి ఉంటాయని భావించిన పరిక్షితుడు కప్పలపై కోపం పెంచుకున్నాడు. 

రాజ్యంలోని కప్పలన్నింటినీ వెదికి చంపమంటూ భటులను ఆదేశించాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు రాజ్యంలోని నీటితావులన్నీ గాలించి, కప్పలను వెదికి చంపి కుప్పలుగా పోయడం ప్రారంభించారు. కప్పలపై పరిక్షితుడి కక్ష విపరీతంగా మారుతుండటంతో కప్పలరాజు అయిన ఆయువు ఒక మహర్షి రూపంలో వచ్చి, కప్పల మీద ద్వేషానికి కారణమేమిటని అతడిని అడిగాడు. తన ప్రియురాలిని అదృశ్యం చేయడం వల్లనే కప్పలను చంపుతున్నానని పరిక్షితుడు బదులిచ్చాడు. అప్పుడు కప్పలరాజు ఆయువు తన నిజరూపంలో పరిక్షితుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.

 పరిక్షితుడు ప్రేమించిన సుశోభన తన కూతురేనని చెప్పి, ఆమెను రప్పించి అప్పగించాడు. ఆమె ఎందరో రాజులను తన వలపుతో మోసం చేసిందని, అందువల్ల ఆమెకు పుట్టే కొడుకులు మోసగాళ్లవుతారని శపించాడు. కూతురికి హితవు చెప్పి వెళ్లిపోయాడు. పరిక్షితుడు, సుశోభనలకు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. పెద్దవాడైన శలుడికి రాజ్యం అప్పగించి, పరిక్షితుడు తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. శలుడు ఒకనాడు బంగారు రథంపై అడవికి వేటకు వెళ్లాడు. ఒక లేడి కనిపిస్తే, దానిని బాణంతో కొట్టాడు. బాణం దెబ్బతిన్న లేడి పరుగు లంకించుకుంది. శలుడు ఆ లేడి వెనుకనే రథాన్ని పరుగు తీయించాడు. 

లేడి వేగాన్ని రథాశ్వాలు అందుకోలేక పోయాయి. శలుడు విసుగు వ్యక్తం చేశాడు. ‘రాజా! వామ్యజాతి అశ్వాలైతే రథాన్ని అద్భుతమైన వేగంతో ఉరుకులెత్తించగలవు. వామ్యజాతి అశ్వాలు ఈ ప్రాంతంలో వామదేవుడు అనే మహర్షి వద్ద ఉన్నాయి’ అని చెప్పాడు రథసారథి. శలుడు రథాన్ని వామదేవుడి ఆశ్రమానికి మళ్లించమని ఆదేశించాడు. ఆశ్రమం చేరుకోగానే, శలుడు రథం దిగి, నేరుగా ఆశ్రమం లోపలకు వెళ్లాడు. వామదేవుడికి నమస్కరించి, వామ్యజాతి అశ్వాలను తనకు ఇవ్వమని కోరాడు. పని పూర్తయిన తర్వాత తిరిగి తనకు ఇచ్చేయాలనే షరతు మీద వామదేవుడు ఆ అశ్వాలను శలుడికి అప్పగించాడు. 

శలుడు వాటిని తన రథానికి పూన్చి, వేటాడాడు. వేట పూర్తయ్యాక ఆ అశ్వాలను వామదేవుడికి అప్పగించకుండా, తన కోటకు తోలుకుపోయాడు. నెల్లాళ్లు గడిచినా అశ్వాలను ఇవ్వకపోవడంతో వామదేవుడు అశ్వాలను అడిగి తెమ్మని తన శిష్యుల్లో ఆత్రేయుడనే వాడిని శలుడి వద్దకు పంపాడు. అశ్వాలను ఇవ్వను పొమ్మనడంతో ఆత్రేయుడు గురువు వద్దకు వచ్చి, జరిగిన సంగతి చెప్పాడు. ఈసారి వామదేవుడు స్వయంగా వెళ్లాడు. ‘రాజా! మాట నిలబెట్టుకో! పరద్రవ్యాపహరణం పాపహేతువు అవుతుంది’ అని హెచ్చరించాడు. శలుడు అతడి మాటలు పట్టించుకోకుండా, ‘బ్రాహ్మణులకు అశ్వాలు ఎందుకు? కావాలంటే, గోవులు, ఎద్దులు గాని, కంచరగాడిదలు గాని రెట్టింపు సంఖ్యలో ఇస్తాను’ అన్నాడు. 

‘విప్రుల సొమ్ము అపహరించడమే కాకుండా, దానికి బదులుగా మరొకటి ఇస్తాననడం దురహంకారం’ అన్నాడు వామదేవుడు. అహం దెబ్బతినడంతో శలుడు మండిపడ్డాడు. ‘ఈ మునిని బంధించి శూలాలతో పొడిచి చంపండి’ అని ఆదేశించాడు. వామదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది. అతడి మంత్ర ప్రభావంతో వేలాది మంది రాక్షసులు పుట్టుకొచ్చారు. వారు శలుడిపైకి లంఘించి, అతణ్ణి చంపేశారు. శలుడి తర్వాత అతడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొన్నాళ్లయ్యాక వామదేవుడు మళ్లీ వెళ్లి తన గుర్రాలను తిరిగి ఇచ్చేయమని అడిగాడు.

 వామదేవుడిని విషబాణంతో చంపడానికి ధనుస్సు తీసుకుని, బాణాన్ని ఎక్కుపెట్టాడు. వామదేవుడి మంత్రప్రభావంతో అతడి చేతులు స్తంభించిపోయాయి. నలుడు నివ్వెరపోయాడు. వామదేవుడి ముందు తలవంచి, క్షమాపణలు కోరాడు. వామదేవుడు ప్రసన్నుడై, అతడిని స్తంభన నుంచి విముక్తుణ్ణి చేశాడు. నలుడు వామదేవుడి అశ్వాలను తిరిగి అప్పగించాడు. వామదేవుడు వాటితో తన ఆశ్రమానికి వెళ్లాడు.
∙సాంఖ్యాయన

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement