రంగంలోకి రోబోలు | Rescue operation in SLBC tunnel from today | Sakshi
Sakshi News home page

రంగంలోకి రోబోలు

Published Wed, Mar 12 2025 4:03 AM | Last Updated on Wed, Mar 12 2025 4:03 AM

Rescue operation in SLBC tunnel from today

ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో నేటి నుంచి రెస్క్యూ ఆపరేషన్‌  

మూడు రకాల రోబోలతో కార్మికుల కోసం వెదుకులాట  

ప్రమాద స్థలంలో డీ2 నుంచి డీ1 మధ్యనే తవ్వకాలు ముమ్మరం 

టన్నెల్‌ నిండా 6 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి, శిథిలాలు 

మరోసారి టన్నెల్‌లోకి కడావర్‌ డాగ్స్‌ 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత రోబోలను బుధవారం నుంచి రంగంలోకి దింపనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్వీ రోబో టిక్స్‌ బృందం మంగళవారం సొరంగం వద్దకు చేరుకుంది. మూడు రకాల రోబోల ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టనున్నారు. వాటిని ఆప రేట్‌ చేసే మాస్టర్‌ రోబోను సొరంగం వద్దకు తీసుకొచ్చారు. రోబోటిక్‌ నిపుణులు విజయ్, అక్షయ్‌ నేతృత్వంలో రోబోల అనుసంధానం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.  

ముమ్మరంగా గాలింపు 
సొరంగంలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని ఇప్పటికే వెలికి తీయగా, మిగతా ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రమాదస్థలంలో కడావర్‌ డాగ్స్‌ గుర్తించిన డీ2 నుంచి డీ1 స్పాట్ల మధ్యలో ట్రెంచ్‌ను తవ్వుతున్నారు. టీబీఎం కట్టర్‌ హెడ్‌ భాగానికి వెనుకవైపు నుంచి డీ1 వరకు సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో ప్రతీ 10 మీటర్లకు ఒక చోట తవ్వకాలు జరుపుతూ గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. 

ఆయా చోట్ల మళ్లీ కడావర్‌ డాగ్స్‌తో గాలింపు చేపడుతున్నారు. 18 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలను డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సొరంగం వద్దే ఉండి పర్యవేక్షిస్తున్నారు.  

మనుషుల కన్నా 15 రెట్ల వేగం 
సొరంగం లోపల 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా.. చివరి 20 మీటర్ల వద్ద ప్రమాద­కర పరిస్థితులు నెలకొన్నాయి. పైకప్పు వదులుగా ఉండి మళ్లీ కూలే అవకాశం ఉండటంతో రోబోల ద్వారా రెస్క్యూ పనులను చేపట్టనున్నారు. సొరంగంలోని పెద్ద రాళ్లను, శిథిలాలను తొలగించేందుకు ఒక రోబో, మట్టిని తొలగించేందుకు ఒకటి, బురదను తొలగించేందుకు మరొక రోబోను వినియోగించనున్నారు. 

సొరంగం చివరన 200 మీట­ర్ల విస్తీర్ణంలో సుమారు 6 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి, బురద పేరుకుని ఉంది. రోబోల ద్వారా మూడు రోజుల్లో మొత్తం మట్టి, శిథిలాలను తొలగించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. రోబోల రెస్క్యూ ఆపరేషన్‌ను సొరంగంలోపల 200 మీటర్ల దూరం నుంచి పర్యవేక్షించేందుకు వీలుంటుంది. ఇందుకోసం ఇన్‌డెప్త్‌ ఏఐ కెమెరా, లైటర్‌ టెక్నాలజీ వినియోగించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement