సోషల్ స్టడీస్ బుక్స్ నిషేధం విధిస్తూ జారీ చేసిన సర్క్యూలర్
ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వం పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాల్లో సోషల్ స్టడీస్ పుస్తకాలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పుస్తకాల్లో ముద్రించిన పాక్ మ్యాప్‌లో కశ్మీర్ భూభాగం భారత్‌లో అంతర్భాగమని చూపిస్తుండటంతో వాటిపై నిషేధానికి ఆదేశాలు జారీ చేసింది. 2, 4, 5, 7, 8 తరగతులు విద్యార్థులకు సంబంధించిన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో వివాదాస్పద, అభ్యంతరకరమైన విషయాలు, ముఖ్యంగా పాక్ మ్యాప్‌ల్లో కశ్మీర్ భారత్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు పంజాబ్ కరికులమ్, టెక్స్ట్‌బుక్ బోర్డు(పీసీటీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ ప్రావిన్స్‌లో తక్షణమే ఆ పుస్తకాలను నిషేధించాలని పీసీటీబీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూమ్ ఆయా పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేశారు. విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు ఈ ఘోర తప్పిదం చేసిన పబ్లిషర్స్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సంస్థ పీసీటీబీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment