
కొంతమందికి పుస్తకాలంటే ఎంతో మక్కువ.. పుస్తకాలుంటే చాలు ఇంకేమీ పట్టదు. పుస్తకాలు ఇచ్చి వారిని అలా వదిలేస్తే చాలు చదువుకుంటూ గంటలు గంటలు గడిపేస్తారు. ఈ పుస్తకాల పురుగులు ఏదైనా టూర్ లేదా విహార యాత్రలకు వెళితే తమ బ్యాగులో పుస్తకాలు తప్పకుండా ఉండాల్సిందే. అయితే పోర్చుగల్‌లోని ఓబిడోస్ అనే గ్రామంలోని లిటరరీ మ్యాన్ ఓబిడోస్ హోటల్‌కెళ్లే పర్యాటకులకు మాత్రం ఆ అవసరం లేదు.. ఎందుకంటే ఆ హోటలే ఒక చిన్న సైజు గ్రంథాలయం కాబట్టి.. దీన్ని 2015లో ప్రారంభించారు.
ఇప్పటివరకు ఈ హోటల్‌లో దాదాపు 50 వేల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పుస్తకప్రియుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజుల్లో ఆ సంఖ్యను లక్షకు పెంచనున్నట్లు హోటల్ యజమానులు చెబుతున్నారు. ఇందులో పద్య రచనలు, నవలలు, వంటలు, కథల పుస్తకాలతో పాటు దాదాపు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయంట. అయితే ఇవన్నీ ఇంగ్లిష్ భాషలో ఉన్నాయి.
పుస్తకం చదవడం పూర్తవక ముందే హోటల్ రూమ్‌ను ఖాళీæ చేయాల్సి వచ్చినా ఏం పర్లేదు.. ఎందుకంటే ఆ పుస్తకానికి తగిన ధర చెల్లించి ఎంచక్కా ఇంటికి తీసుకెళ్లే వెసులుబాటు ఆ హోటల్‌లో ఉంది. అయితే చాలామంది పుస్తక ప్రేమికులు పుస్తకాలను వెంట తీసుకెళ్లడం మానేసి ఆ హోటల్ ఐడియాకు మెచ్చి వారే కొన్ని పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి వెళుతున్నారు. అయితే ఆ హోటల్‌లోని పుస్తకాలను చదవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకున్నా.. హోటల్‌లో ఒక రాత్రి స్టే చేయాలంటే మాత్రం 90 డాలర్లు చెల్లించాలి సుమా..!